గడువు ముగిసిన వ్యాక్సిన్ ఇచ్చిన ఘటనపై హెచ్ఆర్సీ కీలక తీర్పు

by Bhanu |

గాంధీ ఆసుపత్రిలో 11 ఏండ్ల క్రితం గడువు తీరిన హెపటైటిస్ బీ వ్యాక్సిన్‌ను రోగులకు అందించిన ఘటనపై తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ తీవ్రంగా స్పందించింది.

గడువు ముగిసిన వ్యాక్సిన్ ఇచ్చిన ఘటనపై హెచ్ఆర్సీ కీలక తీర్పు
X

దిశ, హైదరాబాద్ బ్యూరో: గాంధీ ఆసుపత్రిలో 11 ఏండ్ల క్రితం గడువు తీరిన హెపటైటిస్ బీ వ్యాక్సిన్‌ను రోగులకు అందించిన ఘటనపై తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ తీవ్రంగా స్పందించింది. బాధితులందరికీ ఒక్కొక్కరికి ₹1.25 లక్షల చొప్పున నష్టపరిహారం చెల్లించాల్సిందిగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కమిషన్ ఆదేశించింది.

2014లో గాంధీ ఆసుపత్రిలో చేరిన 16 మంది రోగులకు గడువు ముగిసిన వ్యాక్సిన్ ఇవ్వగా, వారిలో ఆరుగురు — ఏఎన్ ఆదిలక్ష్మి, ఎస్ దేవమని, టీ సతీష్, పీ మల్లిఖార్జున్, టీ రవి, జీ ధనంజయ్ — హెచ్ఆర్సీని ఆశ్రయించి అప్పటి వైద్యురాలు డాక్టర్ తారాదేవి మీద ఫిర్యాదు చేశారు. కమిషన్ హక్కుల కేసు (3464/2014)ను నమోదు చేసి, విచారణ కమిటీని ఏర్పాటు చేసింది.

2015 ఆగస్టు 14న గాంధీ ఆసుపత్రిలో పరిశీలన నిర్వహించిన కమిటీ, బాధితులకు ఇవ్వబడిన వ్యాక్సిన్ గడువు ముగిసినదేనని నిర్ధారించింది. దీనికి ప్రధాన కారణం డాక్టర్ తారాదేవి నిర్లక్ష్యమేనని స్పష్టం చేస్తూ ప్రభుత్వం ఆమెను సస్పెండ్ చేసింది. ఇప్పుడు తుది తీర్పులో బాధితులకు పరిహారం చెల్లించడంతో పాటు, డాక్టర్ తారాదేవి మరియు అప్పటి ఆసుపత్రి సూపరింటెండెంట్‌పై చర్యలు తీసుకుని రెండు నెలల లోగా నివేదిక సమర్పించాల్సిందిగా సీఎస్‌కు సూచించింది. ఇకపై ఇలాంటివి పునరావృతం కాకుండా మందుల తయారీదారులు ఎక్స్ పైరీ, తయారీ తేదీలను స్పష్టంగా పెద్ద అక్షరాల్లో ముద్రించాలంటూ హెచ్ఆర్సీ సూచించింది.


Next Story