గజ్వేల్ బంద్ విజయవంతం

by Nallavelli.Anjaneyulu |

గజ్వేల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం పై కాంగ్రెస్ నాయకుల దాడికి నిరసనగా బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన గజ్వేల్ బంద్ కార్యక్రమం విజయవంతమైంది

గజ్వేల్ బంద్ విజయవంతం
X

దిశ, గజ్వేల్ : గజ్వేల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం పై కాంగ్రెస్ నాయకుల దాడికి నిరసనగా బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన గజ్వేల్ బంద్ కార్యక్రమం విజయవంతమైంది. బీఆర్ఎస్ గజ్వేల్ నియోజకవర్గ ఇన్ చార్జి వంటేరు ప్రతాప్ రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు వాణిజ్య, వ్యాపార సంస్థలు, హోటల్లు, పెట్రోల్ బంకులు, స్కూల్స్, కాలేజీలు, షాపులు ఉదయం నుంచే మూసివేశారు. గజ్వేల్ ప్రజ్ఞాపూర్ బస్ డీపో నుంచి బస్సులు రాకుండా బీఆర్ఎస్ శ్రేణులు అడ్డుకున్నారు. ఈ బంద్ కార్యక్రమంలో గులాబీ శ్రేణులు పెద్ద సంఖ్యలో కదం తొక్కారు. పెద్ద ఎత్తున పాల్గొని పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుంచి ప్రధాన రహదారుల వెంట భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.

అధికార అహంకారంతోనే దాడులు : వంటేరు ప్ర‌తాప్ రెడ్డి

అధికార అహంకారంతో కాంగ్రెస్ నేతలు దాడులకు పాల్పడుతున్నారని బీఆర్ఎస్ నేతలు వంటేరు ప్రతాపరెడ్డి, మాజీ ఏఎంసీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్, మండల పార్టీ అధ్యక్షుడు బెండ మధు అన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ పై వారు తీవ్ర విమర్శలు చేశారు. కేసీఆర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంపై జరిగిన దాడిని యావత్ తెలంగాణ ప్రజలపై జరిగిన దాడిగా భావించి తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. 14 ఏళ్ల ఉద్యమంతో తెలంగాణ సాధించిన ఉద్యమకారుడి క్యాంపు కార్యాలయం పై దాడిని రాష్ట్ర ప్రజలందరూ ఖండిస్తున్నారని తెలిపారు. కాంగ్రెస్ పాలనను ప్రజలు వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో తమ ఉనికిని చాటుకునేందుకే బీఆర్ఎస్ నేతలపై కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. గత రెండేళ్లలో గజ్వేల్ నియోజకవర్గానికి సరైన అభివృద్ధి నిధులు కేటాయించలేదని విమర్శించారు. దమ్ముంటే సీఎం రేవంత్ రెడ్డితో మాట్లాడి నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేయాలని కాంగ్రెస్ నేతలను డిమాండ్ చేశారు.

అధికారం శాశ్వతం కాదని.. ప్రజల మనసు గెలుచుకోవాలని కాంగ్రెస్ నాయకులకు హెచ్చరించారు. బీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన బంద్ పిలుపుకు పట్టణ ప్రజలు స్వచ్ఛందంగా సహకరిస్తున్నారని పేర్కొన్నారు. గతంలో రైతులు ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఉండేదని, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత కేసీఆర్ కాలేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంతో రైతులను బలోపేతం చేసి దేశానికి అన్నం పెట్టే స్థాయికి తీసుకెళ్లారని తెలిపారు. ప్రస్తుతం కాంగ్రెస్ పాలనలో కరెంటు, ఎరువులు, విత్తనాల కొరతతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు. మహాలక్ష్మి పథకం పేరుతో ఉచిత బస్సు ప్రయాణం అమలు చేస్తున్నామని చెబుతూ 6 గ్యారంటీలు అమలవుతున్నాయని కాంగ్రెస్ నేతలు గొప్పలు చెప్పుకుంటున్నారని విమర్శించారు. ఆసరా పెన్షన్లు నిలిచిపోయాయని, కళ్యాణలక్ష్మి పథకాన్ని కనుమరుగు చేశారని ఆరోపించారు. కేసీఆర్ కిట్, రైతు బీమా వంటి పథకాలను అమలు చేయకుండా రాజకీయ దాడులకే కాంగ్రెస్ ప్రభుత్వం పరిమితమైందని అన్నారు. ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ నేతలు దాడులను మానుకోకపోతే తెలంగాణ ప్రజలే తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో గజ్వేల్ నియోజకవర్గంలోని బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు మాజీ ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నేతలు, నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Next Story