- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సమ్మె తప్ప వేరే ఆప్షన్ లేదు.. విద్యుత్ ఉద్యోగుల సమస్యలపై జి. సాయిబాబా కీలక వ్యాఖ్యలు
విద్యుత్ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి సమ్మె తప్ప వేరే ఆప్షన్ లేదని 1104 యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి సాయిబాబా అన్నారు.

దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: విద్యుత్ ఉద్యోగుల (electricity employees) సమస్యల పరిష్కారానికి సమ్మె (strike) తప్ప వేరే ఆప్షన్ లేదని 1104 యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి సాయిబాబా (G. Sai Baba) అన్నారు. విద్యుత్ ఉద్యోగులు నిత్యం వినియోగదారులకు మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేస్తున్నారని, విద్యుత్ ఉద్యోగులు, కార్మికుల సమస్యల పట్ల ప్రభుత్వం సానుకూలంగా ఉన్నా యాజమాన్యాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని అన్నారు. దీర్ఘకాలిక సమస్యలైన ఆర్టీజన్ ఉద్యోగులకు పదోన్నతులతో పాటు.. ఆర్టిజన్లు ప్రమాదాల బారిన పడి గాయపడినప్పుడు వారి కుటుంబాలకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని జి సాయిబాబా డిమాండ్ చేశారు. ఆర్టిజన్లకు కనీసం సెలవులు ఇవ్వకుండా పనిచేయుస్తూ వెట్టిచాకిరి చేయిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం మింట్ కాంపౌండ్ లోని యూనియన్ రాష్ట్ర కార్యాలయంలో యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు వేమునూరి వెంకటేశ్వర్లు అధ్యక్షతన ఏర్పాటు చేసిన రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఆయన ప్రసంగించారు. కార్మికులు, ఆర్టిజన్లు, అన్ మ్యాన్డ్ కార్మికులు ఎదుర్కొంటున్న అతి ముఖ్యమైన సమస్యలను ప్రాంతీయ అధ్యక్ష కార్యదర్శులు సమావేశంలో కేంద్ర కార్యవర్గం దృష్టికి తీసుకువచ్చారు. సమస్యల పరిష్కారానికి కార్యాచరణ చేపడతామని ఈ సందర్భంగా సాయిబాబా తెలిపారు.
పని భారం పెరిగిపోయింది..
ఇప్పటికే దీర్ఘకాలిక సమస్యలపై యాజమాన్యాలకు, రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయామని, విద్యుత్ శాఖ మంత్రి స్పందించడంతో ట్రాన్స్ కో యాజమాన్యంతో చర్చలు జరిపినట్లు సాయిబాబా తెలిపారు. అయితే అంగీకరించిన సమస్యల పరిష్కారం పై ఉత్తర్వులు మాత్రం వెలువడలేదన్నారు. ఆర్టిజన్ల సమస్యలన్నీ నేటికీ అపరిష్కృతంగానే ఉన్నాయని అన్నారు. ఉద్యోగులు, కార్మికుల సమస్యల పట్ల ఇప్పటికే చాలాకాలంగా వేచి ఉన్నామని, ఇక ఆగే పరిస్థితి లేదని ఆయన స్పష్టం చేశారు. సమస్యల పరిష్కారం కోసం సమ్మె చేయడం మినహా వేరే మార్గం లేదని స్పష్టం చేశారు. రాష్ట్రంలో విద్యుత్ సిబ్బందికి మోయలేనంత పని భారం పెరిగిపోయిందని, పని భారం తగ్గించేలా వెంటనే ఖాళీగా ఉన్న 3 వేల పోస్టులతో పాటు సుమారు పదివేల అదనపు పోస్టులు భర్తీ చేయాలని ఆయన కోరారు. ఉద్యోగులకు పదోన్నతుల ప్రక్రియ వెంటనే ప్రారంభించాలని డిమాండ్ చేశారు. పాత పెన్షన్ విధానాన్ని తిరిగి తీసుకురావాలని, అన్ మ్యాన్డ్, స్పాట్ బిల్లింగ్, ఎంఆర్టీ, అవుట్ సోర్సింగ్ కార్మికులను ఆర్టిజన్లుగా గుర్తించాలన్నారు. 2011 జేఎల్ఎంలకు వారిని రెగ్యులర్ చేసిన తేదీ నుంచి కాకుండా కాంట్రాక్టు జేఎల్ఎంలుగా చేరిన తేదీ నుంచి వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. అదనపు విద్యార్హతలు పొందిన ఉద్యోగులు కార్మికులకు పదోన్నతుల్లో నిర్వహించే స్క్రీనింగ్ టెస్ట్ రద్దు చేయాలన్నారు.
ప్రభుత్వం విద్యుత్ ఉద్యోగుల సమస్యల పరిష్కారం పట్ల సానుకూలంగా ఉన్నా, యాజమాన్యాలు మాత్రం తమ సమస్యల పరిష్కారం కోసం కనీసం సమీక్ష జరిపేందుకు కూడా సమయం కేటాయించడం లేదని ఆయన మండిపడ్డారు. సమస్యల పరిష్కారంలో ఇదే వైఖరి కొనసాగితే, యూనియన్ కేంద్ర కార్యవర్గ తీర్మానం మేరకు సమ్మె చేసేందుకు వెనకాడేది లేదని ఆయన స్పష్టం చేశారు. కార్యక్రమంలో కార్యనిర్వాహక అధ్యక్షుడు రాజేందర్, అదనపు ప్రధాన కార్యదర్శి వరప్రసాద్, సలహాదారు ఆర్ జనార్దన్ రెడ్డి, డిస్కం, ట్రాన్స్ కో, జెన్ కో ప్రాంతీయ అధ్యక్ష కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.






