మిడ్ డే మీల్స్ వంట కార్మికుల వేతనాలకు నిధులు విడుదల

by Malleboina Mahesh |

రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల్లో అమలు చేస్తున్న మధ్యాహ్న భోజన పథకం (పీఎం పోషణ్) కింద పనిచేస్తున్న వంట కార్మికుల జీతాల చెల్లింపుకు ప్రభుత్వం నిధులు విడుదల చేసింది.

మిడ్ డే మీల్స్ వంట కార్మికుల వేతనాలకు నిధులు విడుదల
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల్లో అమలు చేస్తున్న మధ్యాహ్న భోజన పథకం (పీఎం పోషణ్) కింద పనిచేస్తున్న వంట కార్మికుల జీతాల చెల్లింపుకు ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. కుక్ కమ్ హెల్పర్స్‌కు గౌరవ వేతనం చెల్లింపు కోసం రూ. 44.73 కోట్ల బడ్జెట్ విడుదల చేస్తూ పాఠశాల విద్యా డైరెక్టర్ నవీన్ నికోలస్ ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అదనంగా ఇస్తున్న నెలకు రూ. 2000 గౌరవ వేతనానికి ఈ బడ్జెట్‌ను విడుదల చేశారు. ఈ మొత్తం 2025-26 ఆర్థిక సంవత్సరంలో రెండో త్రైమాసికం అనగా ఆగస్టు 2025 వరకు విడుదల చేశారు. జిల్లా విద్యా శాఖాధికారుల నుంచి అందిన అదనపు బడ్జెట్ ప్రతిపాదనల మేరకు, ఫైనాన్స్ డిపార్ట్‌మెంట్ ఆమోదంతో ఈ నిధులు విడుదలయ్యాయి.

రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన నిర్వాహకులకు ఊరట కలిగించేలా ప్రభుత్వం పెండింగ్ బిల్లులకు సంబంధించి ఇటీవల నిధులు విడుదల చేసింది. అందులో భాగంగానే 9, 10 తరగతుల విద్యార్థులకు వంట ఖర్చుల కోసం రూ. 28,43,76,000 నిధులు విడుదల చేసింది. అలాగే 1 నుండి 8 వ తరగతి విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకంలో భాగంగా గుడ్డు ఖర్చులకు సంబంధించి పెండింగ్ బిల్లులు రూ. 25,64,91,000 నిధులు విడుదల చేసింది.

మొత్తం రూ. 4473.07 లక్షలు నిధులు కేటాయింపు

ఇందులో ప్రధానంగా జనరల్, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు విడివిడిగా నిధులు కేటాయించారు. జనరల్ విభాగంలో కుక్ కమ్ హెల్పర్ గౌరవ వేతనం రూ. 2797.53 లక్షలు కాగా, ఎస్సీ విభాగంలో కుక్ కమ్ హెల్పర్స్ గౌరవ వేతనం రూ. 979.83 లక్షలు, ఎస్టీ కుక్ కమ్ హెల్పర్స్ గౌరవ వేతనం రూ. 695.71 లక్షలు కేటాయించారు. రాష్ట్రంలోని జిల్లా విద్యా శాఖాధికారులు (డీఈఓలు) ఈ మొత్తాన్ని మండల విద్యా శాఖాధికారులకు (ఎంఈఓలకు) కేటాయించి, అమలు చేసే ఏజెన్సీలకు డ్రా చేసి, పంపిణీ చేయాలని ఆదేశించారు. ఈ చెల్లింపులు ట్రెజరీ ద్వారా మాత్రమే చేయాలని, ప్రభుత్వ మార్గదర్శకాలు, సూచనలకు అనుగుణంగా పథకాన్ని అమలు చేయాలని కోరారు. రాష్ట్రంలోని జిల్లాల వారీగా వంటకార్మికులకు (కుక్ కమ్ హెల్పర్స్‌)కు కేటాయించిన మొత్తం వివరాలు ఇలా ఉన్నాయి.

అత్యధిక మొత్తం కేటాయించిన టాప్ 5 జిల్లాలు (రూపాయలల్లో)

నల్గొండ: 307,85,000

రంగారెడ్డి: 33,326,000

మహబూబ్‌నగర్: 23,119,000

వికారాబాద్: 22,913,000

నిజామాబాద్: 20,382,000

Next Story