- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సీఎం నియోజకవర్గం కొడంగల్ మీదుగా రైలు మార్గం.. భూసేకరణకు నిధులు విడుదల
హైదరాబాద్ నుంచి గోవాకు రైలులో వెళ్లే వారికి మరో మార్గం అందుబాటులోకి రానుంది. వికారాబాద్ నుంచి కొడంగల్ మీదుగా రాయచూరుకు సమీపంలో ఉన్న కృష్ణా రైల్వే స్టేషన్ వరకు కొత్త రైల్వే లైన్ నిర్మించేందుకు మార్గం సుగమమైంది.

దిశ, తెలంగాణ బ్యూరో : హైదరాబాద్ నుంచి గోవాకు రైలులో వెళ్లే వారికి మరో మార్గం అందుబాటులోకి రానుంది. వికారాబాద్ నుంచి కొడంగల్ మీదుగా రాయచూరుకు సమీపంలో ఉన్న కృష్ణా రైల్వే స్టేషన్ వరకు కొత్త రైల్వే లైన్ నిర్మించేందుకు మార్గం సుగమమైంది. ఈ రైల్వే ప్రాజెక్టుకు ఎంతో కీలకమైన 845 హెక్టార్ల భూ సేకరణకు కోసం రూ.438 కోట్లు ఖర్చు చేసేందుకు ఇటీవల రాష్ట్ర కేబినెట్ తీర్మానం చేసింది. దీంతో ఈ రైల్వే మార్గం ఏర్పాటు కు తొలి అడుగు విజయవంతంగా పడింది. సికింద్రాబాద్ నుంచి వికారాబాద్ మీదుగా రాయచూర్ వెళ్లేందుకు ప్రస్తుతం తాండూరు, సేడం, చిత్తాపూర్, వాడి, యాద్గిర్ మీదుగా చుట్టూ తిరిగి వెళ్లాల్సి వస్తోంది. ఫలితంగా సమయం, ఇంధనం వృథా అవుతుంది. సికింద్రాబాద్ నుంచి రాయచూరుకు 290 కి.మీ దూరం అవుతుంది. ఈ మార్గానికి ప్రత్యామ్నాయంగా రైల్వేశాఖ వికారాబాద్-కృష్ణా మార్గాన్ని తెరపైకి తీసుకువచ్చింది.
100 కి.మీ. దూరం తగ్గే మార్గం
రూ.2,196 కోట్ల అంచనా వ్యయంతో రైల్వేశాఖ ప్రతిపాదించిన ఈ వికారాబాద్-కృష్ణా రైల్వే లైన్ పూర్తయితే కొడంగల్ నియోజకవర్గం తో పాటు వికారాబాద్, నారాయణపేట జిల్లాలు ఎంతో అభివృద్ధి చెందేందుకు అవకాశం ఏర్పడుతుంది. సికింద్రాబాద్ నుంచి రాయచూరు చేరుకునేందుకు ప్రస్తుతం వాడి, యాద్గిర్ మీదుగా చుట్టూ తిరిగి వెళ్లడం వల్ల 290 కి.మీ దూరం ప్రయాణించాల్సి వస్తుంది. వికారాబాద్-కృష్ణా కొత్త లైన్ వల్ల సుమారు 100 కి.మీ మేర దూరం తగ్గుతుంది. ప్రస్తుతం సికింద్రాబాద్ నుంచి వికారాబాద్‌కు 72 కి.మీ దూరం కాగా... కొత్తగా 122 కి.మీ మేర లైన్ నిర్మించనున్నారు. ఫలితంగా సుమారు 100 కి.మీ దూరం తగ్గడంతో ప్రయాణికులకు, సరుకు రవాణాకు అత్యుత్తమ మార్గంగా ఈ లైన్ మారనుంది.
గోవాకు మరింత దగ్గర
ప్రస్తుతం సికింద్రాబాద్ నుంచి గోవా చేరుకునేందుకు వికారాబాద్, వాడి, యాద్గిర్, రాయచూరు, గుంతకల్ మీదుగా రైళ్లు తిరుగుతున్నాయి. అలాగే కాచిగూడ, మహబూబ్‌నగర్, కర్నూలు, గుంతకల్, హుబ్లీ మీదుగా మరో మార్గం ఉంది. వికారాబాద్-కృష్ణా మార్గం అందుబాటులోకి వస్తే సుమారు 100 కి.మీ దూరం తగ్గుతుంది. ఇక రాయచూరు నుంచి మునీరాబాద్ వరకు నిర్మాణంలో ఉన్న రైల్వే లైన్ పనులు కూడా పూర్తయితే గోవాకు మరింత దగ్గరి మార్గం అందుబాటులోకి వస్తుందని రైల్వే అధికారులు చెబుతున్నారు.
రేవంత్‌రెడ్డి నియోజకవర్గానికి రైలు మార్గం
సీఎం రేవంత్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ ఎంతో వెనుకబడిన ప్రాంతం. సీఎం అయ్యాక ఆయన ఈ ప్రాంతం అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారు. ఇదే క్రమంలో రైల్వే శాఖ చేపడుతున్న కొత్త ప్రాజెక్టు కారణంగా కొడంగల్ నియోజవర్గానికి రైలు వచ్చే అవకాశం ఏర్పడింది. ఈ లైన్ వల్ల గతంలో రైలు సదుపాయమే లేని పరిగి, కొడంగల్, నారాయణపేట పట్టణాలకు రైల్వే కనెక్టివిటీ అందుబాటులోకి వస్తుంది. దాదాపు 4 దశాబ్దాల క్రితం ఈ రైల్వే లైన్ కోసం సర్వే చేసినా అప్పట్లో ప్రభుత్వాలు పట్టించుకోక పనులు అటకెక్కాయి. కొడంగల్ నియోజకవర్గంతో పాటు నారాయణపేట, వికారాబాద్ జిల్లాలకు గేమ్ చేంజర్‌గా మారనున్న ఈ నూతన రైలు మార్గాన్ని సుగమం చేసినందుకు రెండు జిల్లాల ప్రజలు సీఎం రేవంత్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలుపుతున్నారు.
READ MORE ...
చెక్‌పోస్టుల కొనసాగింపుపై సీఎం ఫైర్.. రవాణా శాఖ తీరుపై సీరియస్






