విగ్రహాల నుంచి సమాధుల మీదకు రాజకీయం.. నిన్న దాసరి ఇవాళ తెరపైకి అందెశ్రీ సమాధి

by Prasad Jukanti |   (  Updated:2026-05-31 06:53:45  IST  )

తెలుగు రాష్ట్రాల్లో విగ్రహాల రాజకీయం ఇప్పుడు సమాధుల చుట్టూ తిరుగుతోంది. దాసరి, అందెశ్రీ స్మారకాల దుస్థితిపై రేగుతున్న వివాదం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‍గా మారింది.

విగ్రహాల నుంచి సమాధుల మీదకు రాజకీయం.. నిన్న దాసరి ఇవాళ తెరపైకి అందెశ్రీ సమాధి
X

దిశ, డైనమిక్ బ్యూరో: నిన్నటి వరకు విగ్రహాల చూట్టూ సాగిన రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయం ఇప్పుడు సమాధుల చుట్టూ టర్న్ తీసుకుంది. హైదరాబాద్ మైత్రీవనంలో ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ విగ్రహాం విషయంలో తెలంగాణలో పలువురు నుంచి విమర్శలు వ్యక్తం అయిన సంగతి తెలిసిందే. స్వరాష్ట్ర సాధన కోసం పోరాడిన మహనీయుల విగ్రహాలు కాదని ఆంధ్రుల విగ్రహాలు ఏర్పాటు చేయడం ఏంటంటూ తెలంగాణలో విమర్శలు వ్యక్తం కాగా ఎన్టీఆర్ ప్రాంతాలకు అతీతుడు అంటూ ఏపీ వైపు నుంచి మద్దతు లభించింది. ఈ క్రమంలో ఏపీ రాజధాని అమరావతిలో ప్రొ.జయశంకర్ విగ్రహాం ఏర్పాటు కోరుతూ ఏపీ సీఎం చంద్రబాబుకు తెలంగాణ యంగ్ థింకర్స్ ఫోరమ్ కన్వీనర్ రోహిత్ వక్రాల లేఖ రాయడం సోషల్ మీడియాలో చర్చగా మారింది. ఇప్పటి వరకు విగ్రహాలపై సాగిన రాజకీయ ఇప్పుడు సమాదులపైకి పాకింది. టాలీవుడ్ దిగ్గజం దాసరి నారాయణరావు సమాధి దుస్థితిపై నిన్నటి నుంచి సినీ, రాజకీయ వర్గాల్లో జరుగుతున్న చర్చ ఇవాళ తెలంగాణ ఉద్యమకారుడు, ప్రజాకవి అందెశ్రీ సమాధి (స్మృతి వనం) చుట్టూ ముదురుతున్నాయి. దీనిపై ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ డిస్కషన్ నడుస్తోంది.

పాడుపడ్డ స్థితిలో దాసరి సమాధి:

తెలుగు చిత్రసీమలో దాసరి నారాయణరావు పేరు తెలియని వారుండరు. కేవలం దర్శకుడిగానే కాకుండా, ఇండస్ట్రీ పెద్దగా ఎంతోమంది కార్మికులను, ఆర్టిస్టులను ఆదుకున్న మహోన్నత వ్యక్తి ఆయన. మే 30, 2017న కన్నుమూసిన దాసరి నారాయణ సమాధి మొయినాబాద్‌లో నిర్మించారు. అయితే చిత్రపరిశ్రమలో ఎంతో మందికి పెద్దదిక్కుగా నిలిచిన దాసరి సమాధి ముళ్లపొదలు, పిచ్చిమొక్కలతో పాడుపడ్డ స్థితిలో ఉందంటూ ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‍గా మారింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు దర్శకరత్న సమాధికి ఏం గతి పట్టిందంటూ చలించిపోయారు. ఈ విషయం పెద్ద ఎత్తున చర్చకు రావడంతో తాజాగా సినీ, రాజకీయ రంగానికి చెందిన ప్రముఖులు స్పందించారు. ఇవాళ ఉదయం మంచు మనోజ్ తన అనుచరులతో కలిసి దాసరి సమాధి వద్దకు చేరుకుని శుభ్రం చేయించారు. ప్రముఖ నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ సైతం తమ మనుషులను పంపి క్లీనింగ్ పనులు చేపట్టాయి. ఈ క్రమంలో స్థానిక ఎమ్మెల్యే కాలే యాదయ్య సైతం అక్కడికి చేరుకున్నారు. సమాధి శుభ్రపరిచాక దాసరి విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. లెజెండరీ డైరెక్టర్‌కు ఈ పరిస్థితి రావడం టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది.

అందెశ్రీ స్మృతి వనంపై రాజకీయం:

ఓవైపు దాసరి సమాదిపై చర్చ కొనసాగుతుండగా సోషల్ మీడియాలో ఇవాళ ఉదయం నుంచి తెలంగాణ ప్రజాకవి, ఉద్యమకారుడు అందెశ్రీ సమాధి (స్మృతి వనం) చుట్టూ సరికొత్త వివాదం మొదలైంది. తెలంగాణ రాష్ట్ర అధికారిక గీతాన్ని అందించిన అందెశ్రీ సమాధిని ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందంటూ నెటిజన్లు సోషల్ మీడియాలో మండిపడుతున్నారు. పక్క రాష్ట్రం వాళ్ల విగ్రహాల మీద ఉన్న శ్రద్ధ తెలంగాణ వాదుల మీద లేకపోవడం దారుణం అంటూ బీఆర్ఎస్ మద్దతుదారులు విమర్శిస్తున్నారు. రేవంత్ రెడ్డి సీఎం కావడానికి ఎంతో కష్టపడిన అందెశ్రీకి కనీసం సమాధిని కూడా సరిగ్గా కట్టలేదంటూ నిలదీస్తున్నారు. ఇక బీఆర్ఎస్ మద్దతుదారులు చేస్తున్న విమర్శలకు కాంగ్రెస్ పార్టీ సపోర్టర్స్ కౌంటర్ ఇస్తున్నారు. అందెశ్రీ బ్రతికున్నప్పుడు కనీసం గౌరవం ఇవ్వని వారు, ఇప్పుడు సమాధి గురించి తెగ చింతిస్తూ డ్రామాలు ఆడుతున్నారని మండిపడ్డారు. అందెశ్రీ మరణించినప్పుడు కనీసం చివరి చూపు చూడటానికి రాని అహంకారులే నేడు మాట్లాడుతున్నారని, ఆయన మరణిస్తే తమ్ముడి స్థానంలో ఉండి అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు జరిపించింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డేనంటూ బీఆర్ఎస్ మద్దతుదారుల నుంచి వస్తున్న విమర్శలను కాంగ్రెస్ తిప్పికొడుతోంది. మొత్తంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో విగ్రహాలు, సమాధుల రాజకీయం ఇప్పుడు చర్చనీయాశంగా మారుతోంది.

Next Story