TG: జూన్ 1 నుంచి భూముల ధరలకు రెక్కలు.. ఏ ఏ ప్రాంతాల్లో ఎంతెంత పెరుగుతున్నాయంటే?

by Prasad Jukanti |

తెలంగాణలో భూముల ధరలను పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. క్యూర్, ప్యూర్, రేర్ ఏరియాలో ప్రభుత్వం రిజిస్ట్రేషన్ విలువలను సవరించబోతోంది.

TG: జూన్ 1 నుంచి భూముల ధరలకు రెక్కలు.. ఏ ఏ ప్రాంతాల్లో ఎంతెంత పెరుగుతున్నాయంటే?
X

దిశ, తెలంగాణ బ్యూరో: భూముల ధరలను పెంచేందుకు (Telangana land rates hike) రాష్ట్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. ఆరు నెలల క్రితమే రిజిస్ట్రేషన్ల శాఖ పెంచిన ధరల నివేదికను సమర్పించింది. ఆ తర్వాత ఓ ప్రైవేట్ ఏజెన్సీతోనూ క్రాస్ చెక్ చేయించారు. వచ్చే మంత్రివర్గ సమావేశంలో మార్కెట్ విలువలను ఆమోదించనున్నారు. జూన్ 1వ తేదీ నుంచి పెంచిన భూముల ధరలు అమల్లోకి రానున్నాయి. రియల్ ఎస్టేట్ పడిపోయిందన్న ప్రచారం ఉత్తదేనని ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) ప్రకటించారు. గత నాలుగేళ్ల ట్రాన్సక్షన్స్ కు తగ్గట్లుగానే ఈ ఏడాది కూడా ఉన్నాయన్నారు. అయితే తన అంచనాలకు తగినట్టు పెరగడం లేదని కుండబద్దలు కొట్టారు. ఈ క్రమంలోనే మార్కెట్ విలువల పెంపు ప్రస్తావన ఆసక్తిగా మారింది. అందరూ రియల్ ఎస్టేట్ వ్యాపారం తిరోగమనంలో ఉన్న నేపథ్యంలో ధరల పెంపు తగదని వాదించారు. అయితే సీఎం అభిప్రాయంతో పెంపు ప్రస్తావన అనివార్యమని స్పష్టమైంది. ఎక్కడెక్కడ ఎలా పెంచుతారోనన్న చర్చ జోరుగా సాగుతున్నది. రాష్ట్రాన్ని మూడు విభాగాలుగా విభజించారు. క్యూర్, ప్యూర్, రేర్ ప్రాతిపదికనే భూముల ధరలను చూస్తున్నారు. ప్రధానంగా క్యూర్(కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ), ప్యూర్(పెరీ అర్బన్ రీజినయన్ ఎకానమీ) ప్రాంతంలో అత్యధికంగా పెంచనున్నారు. రేర్(రూరల్ అగ్రికల్చర్ రీజినల్ ఎకానమీ) ప్రాంతంలో నామమాత్రంగా పెరుగుతాయని అధికారుల నుంచి అందిన సమాచారం. ఇప్పటికే ప్రతిపాదించిన రేట్ల నివేదికను రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస​రెడ్డి ఫైనల్ చేసినట్టు తెలిసింది.

ఔటర్ లోపలే కీలకం

ఔటర్ రింగ్ రోడ్డు లోపల భూముల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఇక్కడే ట్రాన్సక్షన్స్ లెక్కలేనన్ని జరుగుతున్నాయి. రెసిడెన్షియల్, కమర్షియల్ ప్రాజెక్టులన్నీ ఇక్కడే కొలువుదీరాయి. ఇప్పటికే గజం ధర రూ.లక్షల్లో పలుకుతుంది. అయితే మార్కెట్ విలువలు మాత్రం రూ.10వేల నుంచి రూ.25వేలలోపే ఉన్నాయి. వీటిని అక్కడి సేల్స్ ను బట్టి పెంపు ప్రతిపాదనలను సిద్ధం చేశారు. ఉదాహరణకు మార్కెట్ విలువ గజం రూ.10వేలు ఉంటుంది. కానీ బహిరంగ మార్కెట్లో రూ.50 వేల వరకు పలుకుతుంది. ప్రస్తుతం ఈ రెండింటి వ్యత్యాసాన్ని తగ్గించేందుకు కసరత్తు చేశారు. ఇప్పటికే ధరలు పెరిగిన క్రమంలో ఆయా ప్రాంతాల్లో 25 నుంచి 50 శాతం వరకు పెంచాలని నిర్ణయించినట్టు సమాచారం. ఔటర్ లోపల ఎకరాల్లో స్థలాలు దొరకడం లేదు. ఏనాడో దాదాపు నాలా కన్వర్షన్ గా మారింది. కేవలం శ్రీశైలం- హైదరాబాద్ మార్గంలోనే కాస్త పొలాలు కనిపిస్తున్నాయి. మిగతా అన్ని ప్రాంతాలూ రెసిడెన్షియల్ జోన్ గా మారిపోయాయి..

వనస్థలిపురంలో మార్కెట్ విలువలు(గజం ధర రూ.ల్లో)

ప్రాంతం ప్రస్తుతం బహిరంగ మార్కెట్లో ప్రతిపాదితం

ఆదిత్యనగర్ రూ.20,300 రూ.40వేలు రూ.25వేలు

నేషనల్ హైవే రూ.44,900 రూ.లక్ష రూ.60వేలు

సుష్మ టు ఫంక్షన్ హాల్ రూ.26వేలు రూ.50వేలు రూ.35వేలు

పోలీస్ స్టేషన్ రూ.26వేలు రూ.50వేలు రూ.35వేలు

..దీన్ని బట్టి 25 శాతం నుంచి 50 శాతం పెరుగుతున్నట్టు అంచనా.

వనస్థలిపురంలో మార్కెట్ విలువలు(నిర్మాణాలు చ.అ.ధర రూ.ల్లో)

ప్రాంతం ప్రస్తుతం బహిరంగ మార్కెట్లో ప్రతిపాదితం

ఆదిత్యనగర్ రూ.2,500 రూ.5వేలు రూ.3వేలు

నేషనల్ హైవే రూ.4,500 రూ.6వేలు రూ.5వేలు

సుష్మ టు ఫంక్షన్ హాల్ రూ.2,500 రూ.5వేలు రూ.3వేలు

...నిర్మాణాల్లోనూ 25 శాతం వరకు పెరిగే చాన్స్ ఉంది.

సబ్ రిజిస్ట్రార్ మార్కెట్ వ్యాల్యూ(కనిష్టం/గరిష్టం) బహిరంగ వ్యాల్యూ

కాప్రా రూ.10,200/రూ.33,100 రూ.30వేలు/రూ.లక్ష

కూకట్ పల్లి రూ.29,100/రూ.44,900 రూ.80వేలు/రూ.1.5లక్షలు

ఉప్పల్ రూ.16,800/రూ.44,900 రూ.35వేలు/రూ.1.5లక్షలు

శామీర్ పేట రూ.2,300/రూ.12,600 రూ.10వేలు/రూ.30వేలు

ఘట్ కేసర్ రూ.2300/రూ.12,600 రూ.10వేలు/రూ.30వేలు

కీసర రూ.2300/రూ.6300 రూ.15వేలు/రూ.30వేలు

నారపల్లి రూ.5300/రూ.27వేలు రూ.20వేలు/రూ.65వేలు

వల్లభ్​నగర్ రూ.9200/రూ.26,700 రూ.25వేలు/రూ.75వేలు

బాలానగర్ రూ.20,300/రూ.44,900 రూ.60వేలు/రూ.1.2లక్షలు

..మార్కెట్ వ్యాల్యూ, ఓపెన్ మార్కెట్ లోని ధరలకు మధ్య తేడాలు ఉన్నాయి.

ఔటర్ టు త్రిబుల్ ఆర్

ఔటర్ రింగ్ రోడ్డు నుంచి త్రిబుల్ ఆర్ మధ్య ప్రాంతంలోనూ రియల్ ఎస్టేట్ జోరుగా నడుస్తున్నది. గతేడాది మాదిరిగానే లావాదేవీలు చోటు చేసుకున్నాయని అంచనా. ఔటర్ లోపల ఖాళీస్థలాల మాటే లేదు. అందుకే ప్రధాన డెవలపర్లు ఔటర్ అవతలి వైపు ల్యాండ్ పూలింగ్ చేసి పెట్టుకున్నారు. రానున్న రోజుల్లో త్రిబుల్ ఆర్ వరకు ప్రభుత్వం కూడా అనేక ప్రాజెక్టులను ప్రతిపాదించింది. ఈ నేపథ్యంలో ఇక్కడి భూములకు విలువ పెరిగే చాన్స్ ఉంది. అందుకే మార్కెట్ విలువలు కూడా అందుకు అనుగుణంగానే పెంచాలని ప్రతిపాదించినట్లు తెలిసింది. అలాగే అన్ని పట్టణాలకు పరిసరాల్లోనూ లావాదేవీలను బట్టి రేట్ల పెంపు ఉంటుంది. వరంగల్, ఖమ్మం, కరీంనగర్, నిజామాబాద్, నల్లగొండ పరిసరాల్లోనూ 50 శాతం వరకు పెరగవచ్చని అధికారులు పేర్కొంటున్నారు.

రేర్‍లో నామమాత్రమే

త్రిబుల్ ఆర్ తర్వాత ఉన్న ప్రాంతంలోనూ భూములకు డిమాండ్ ఉంది. అయితే ఈ ఏరియాను రూరల్ గానే చూస్తున్నారు. రాష్ట్రంలో ఎకరా ధర రూ.10లక్షలకు తక్కువగా ఎక్కడా లేదు. ప్రస్తుతం మార్కెట్ విలువ కనీసం రూ.1.5 లక్షల వరకు ఉంది. దీన్ని రూ.రెండు లక్షల వరకు చేసే అవకాశం ఉందని అధికారులు చెప్పారు.

Next Story