జనసంఘ్ నుంచి జాతీయ ఉద్యమం వరకు.. బీజేపీ 46 ఏళ్ల ప్రయాణం : రాంచందర్ రావు

by Ramesh Naini |

బీజేపీ కేవలం ఒక రాజకీయ పార్టీ మాత్రమే కాదని జాతీయత, క్రమశిక్షణ, ప్రజల పట్ల నిబద్ధత అనే విలువలతో ముందుకు సాగే ఒక మహత్తర జాతీయ ఉద్యమం అని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్​ రావు పేర్కొన్నారు.

జనసంఘ్ నుంచి జాతీయ ఉద్యమం వరకు.. బీజేపీ 46 ఏళ్ల ప్రయాణం : రాంచందర్ రావు
X

దిశ, తెలంగాణ బ్యూరో : బీజేపీ కేవలం ఒక రాజకీయ పార్టీ మాత్రమే కాదని జాతీయత, క్రమశిక్షణ, ప్రజల పట్ల నిబద్ధత అనే విలువలతో ముందుకు సాగే ఒక మహత్తర జాతీయ ఉద్యమం అని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్​ రావు పేర్కొన్నారు. ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రతి కార్యకర్త దేశం ముందు - పార్టీ తర్వాత - స్వయం చివర అనే భావంతో, పార్టీ సిద్ధాంతాలను మరింతగా ప్రజలకు చేరువ చేసే సంకల్పంతో ముందుకు సాగుతున్నారని తెలిపారు. ఆదివారం తమ నివాసం వద్ద పార్టీ జెండా ఆవిష్కరించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ, 45 సంవత్సరాలు పూర్తి చేసుకుని 46 సంవత్సరంలోకి అడుగుపెడుతున్న పార్టీ ఈ రోజు ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీగా నిలవడం మనందరికీ గర్వకారణంగా ఉందన్నారు. ఒకప్పుడు జనసంఘ్‌గా ప్రారంభమైన ఈ ప్రయాణం, అనంతరం 1980లో ముంబైలో అటల్ బిహారీ వాజపేయి అధ్యక్షతన భారతీయ జనతా పార్టీగా రూపుదిద్దుకుని, తన సిద్ధాంత బలం, క్రమశిక్షణ గల కార్యకర్తల శ్రమ, జాతీయ సేవ పట్ల అచంచల నిబద్ధతతో అతిపెద్ద రాజకీయ పార్టీగా ఎదిగిందన్నారు. విశాలమైన సభ్యత్వ బలం, దాదాపు 21 రాష్ట్రాల్లో ప్రభుత్వాలతో భారతీయ రాజకీయాల్లో శక్తివంతమైన శక్తిగా అవతరించిందన్నారు. ఈ అభివృద్ధి పార్టీపై, దాని నాయకత్వంపై దేశ ప్రజలు ఉంచిన విశ్వాసం, నమ్మకాన్ని ప్రతిబింబిస్తుందని తెలిపారు. భారతీయ జనతా పార్టీ కేవలం ఒక రాజకీయ సంస్థ మాత్రమే కాదని, దేశ భవిష్యత్తును మలిచే ఒక శక్తివంతమైన జాతీయ ఉద్యమంగా నిలిచిందన్నారు.

భారత్‌కు నిజమైన ఆర్థిక మార్పు

వాజపేయి, మోడీ దేశ ప్రధానమంత్రులైన తర్వాతనే భారత్ నిజమైన ఆర్థిక మార్పును, అభివృద్ధి కొత్త యుగాన్ని చూడడం ప్రారంభించింది. వారి నాయకత్వం దేశానికి కొత్త దిశను చూపి, అభివృద్ధిని వేగవంతం చేసి, మరింత బలమైన, ఆత్మనిర్భరమైన, అభివృద్ధి చెందిన భారత నిర్మాణానికి పునాది వేసిందన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ భారత్ అభివృద్ధిని నిజమైన అర్థంలో ఆలోచించలేదని, అవినీతినే పాలనగా మార్చుకుంది. దీనికి విరుద్ధంగా మోడీ నాయకత్వంలోని ప్రభుత్వం ఒక్క అవినీతి మచ్చ కూడా లేకుండా ప్రజలకు అవినీతి రహిత పాలనను అందిస్తోందని అన్నారు.

పార్టీ బలం కార్యకర్తల్లో ఉంది

పార్టీ బలం కేవలం నాయకత్వంలోనే కాదని, క్రమశిక్షణతో, అంకితభావంతో, అనేక సవాళ్లు, కష్టాలను ఎదుర్కొంటూ నిరంతరం శ్రమిస్తున్న కార్యకర్తల్లో ఉందని చెప్పారు. అలాంటి కార్యకర్తల పట్ల ఈ పార్టీ ఎల్లప్పుడూ రుణపడి ఉంటుందని, పార్టీ ఈ స్థాయిలో నిలవడానికి వారి కష్టం, త్యాగం, అచంచల నిబద్ధతే కారణమని మనం ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాలని అన్నారు. పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ సిద్ధాంతాలను, డాక్టర్ శ్యామ ప్రసాద్ ముఖర్జీ త్యాగాలను, కాశ్మీర్ కోసం ఆయన చేసిన త్యాగాన్ని మనం స్మరించుకుని ప్రేరణ పొందాలన్నారు. ఈ మహనీయుల ఆలోచనలు, త్యాగాలే భారతీయ జనతా పార్టీ సిద్ధాంత పునాదులు.. అవి ప్రతి కార్యక్రమంలో, ప్రతి కార్యకర్తకు స్ఫూర్తిగా నిలవాలని సూచించారు. తెలంగాణలో మరింత అంకితభావంతో పనిచేసి పార్టీని అధికార దిశగా తీసుకెళ్లాలని కోరారు.

Next Story