కులగణన నుంచి రిజర్వేషన్ల వరకూ.. బీసీలను మోసం చేయటమే కాంగ్రెస్ వైఖరి: కేటీఆర్

by Yella Dhawani Reddy |   (  Updated:2025-07-22 15:24:09  IST  )

తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అంశం నుంచి బీసీ డిక్లరేషన్ వరకూ ప్రతి విషయంలోనూ కాంగ్రెస్ పార్టీ మోసపూరిత వైఖరిని అవలంబిస్తోందని బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా మండిపడింది.

కులగణన నుంచి రిజర్వేషన్ల వరకూ.. బీసీలను మోసం చేయటమే కాంగ్రెస్ వైఖరి: కేటీఆర్
X

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అంశం నుంచి బీసీ డిక్లరేషన్ వరకూ ప్రతి విషయంలోనూ కాంగ్రెస్ పార్టీ మోసపూరిత వైఖరిని అవలంబిస్తోందని BRS పార్టీ తీవ్రంగా మండిపడింది. బోనాల పండుగ సందర్భంగా మంగళవారం మాజీ మంత్రి త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్ (Talasani Srinivas Yadav) ఇంట్లో అందుబాటులో బీసీ నాయకులతో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ (KTR) సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం బీసీల పట్ల చేస్తున్న ద్రోహపూరిత చర్యలపై విస్తృతంగా చర్చించారు.

ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ బీసీల హక్కులను కాలరాసే విధంగా రాజకీయ లబ్ధి కోసమే రిజర్వేషన్ల విషయాన్ని ఉపయోగించుకుంటోందని అన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అంశంలో కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి మోసపూరిత వైఖరిని అవలంబిస్తోందని ఆరోపించారు. కులగణన సర్వే నుంచి ప్రస్తుతం తీసుకొస్తున్న ఆర్డినెన్స్ వరకు, ప్రతి దశలోనూ బీసీల సంఖ్యను తగ్గించి చూపడం, హామీలను అమలు చేయకపోవడం ద్వారా అన్ని స్థాయిల్లోనూ బీసీలను మోసం చేయడమే కాంగ్రెస్ అసలైన లక్ష్యంగా ఉందని విమర్శించింది. అంతేకాదు, కాంగ్రెస్ ప్రభుత్వం తాము తీసుకొచ్చిన రిజర్వేషన్ బిల్లు ఆమోదం పొందదని తెలిసినా, కేవలం రాజకీయ లబ్ధి కోసం ఆర్డినెన్స్ పేరుతో కొత్త నాటకానికి పాల్పడుతోందని నాయకులు ఆరోపించారు.

కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహించిన కులగణన సర్వే లోపభూయిష్టంగా, దురుద్దేశపూర్వకంగా జరిగిందని మండిపడ్డారు. ఈ సర్వేను జాతీయ రోల్ మోడల్‌గా చిత్రీకరిస్తూ, జాతీయ వేదికలపై అబద్ధాలు ప్రచారం చేస్తూ తెలంగాణ ప్రజలను మోసం చేస్తోందని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే, బీసీ డిక్లరేషన్ పేరుతో కాంగ్రెస్ ఇచ్చిన ఒక్క హామీని కూడా అమలు చేయకుండా బీసీలకు తీవ్రమైన అన్యాయం చేస్తుందన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రారంభించిన పథకాలను నిలిపివేసిన కాంగ్రెస్, బడుగు బలహీన వర్గాల అభివృద్ధిపై నిర్లక్ష్యం చూపుతోందని విమర్శలు గుప్పించారు.

అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ.. బీసీల సాధికారత కోసం బీఆర్ఎస్ ఎప్పుడూ కట్టుబడి ఉంటుందన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం బీసీలను మోసం చేయడాన్ని సహించబోమని తెలిపారు. బీసీల హక్కుల పరిరక్షణ కోసం ప్రతి స్థాయిలో పోరాటం కొనసాగుతుందన్నారు.

Next Story