- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సెమీకండక్టర్లు, ఏఐ రంగాల్లో తైవాన్‌తో దోస్తీ! ఐసీఐఈ ఆధ్వర్యంలో 'ఎక్స్‌ప్లోర్ టు ఎక్స్‌పాండ్ తైవాన్'
ప్రపంచ స్థాయి ఆవిష్కరణలు, సాంకేతిక రంగాల్లో అంతర్జాతీయ సహకారాన్ని పెంపొందించే దిశగా ఇంటర్నేషనల్ కౌన్సిల్ ఫర్ ఇన్నోవేటర్స్ అండ్ ఎంట్రప్రెన్యూర్స్ (ఐసీఐఈ) కీలక అడుగు వేసింది.

దిశ, తెలంగాణ బ్యూరో: ప్రపంచ స్థాయి ఆవిష్కరణలు, సాంకేతిక రంగాల్లో అంతర్జాతీయ సహకారాన్ని పెంపొందించే దిశగా ఇంటర్నేషనల్ కౌన్సిల్ ఫర్ ఇన్నోవేటర్స్ అండ్ ఎంట్రప్రెన్యూర్స్ (ఐసీఐఈ) కీలక అడుగు వేసింది. తైవాన్‌లో సెమీకండక్టర్లు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) అవకాశాలను అన్వేషించేందుకు 'ఎక్స్‌ప్లోర్ టు ఎక్స్‌పాండ్ తైవాన్' కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ఐసీఐఈ వ్యవస్థాపక కన్వీనర్ సందీప్ కుమార్ మక్తాల వెల్లడించారు.
తైవాన్ ప్రతినిధులతో వ్యూహాత్మక చర్చలు
ఈ కార్యక్రమం నేపథ్యంలో, తైవాన్ ప్రభుత్వానికి చెందిన ఇన్‌స్టిట్యూట్ ఫర్ ఇన్ఫర్మేషన్ ఇండస్ట్రీ (ఐఐఐ) అంతర్జాతీయ సహకార వ్యూహాల అధికారి వివియన్ హువాంగ్, నేషనల్ యాంగ్ మింగ్ చియావో టుంగ్ యూనివర్సిటీ (ఎన్‌వైసీయూ) ఇన్నోవేషన్ అండ్ ఎంట్రప్రెన్యూర్‌షిప్ సెంటర్ సీఈఓ డాక్టర్ మైఖేల్ లిన్‌లతో సందీప్ కుమార్ మక్తాల వ్యూహాత్మక చర్చలు జరిపారు. ప్రధానంగా సెమీకండక్టర్లు, ఏఐ, డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్, స్టార్టప్‌లు, పరిశోధన, పరిశ్రమ-విద్యాసంస్థల భాగస్వామ్యాలు, ప్రతిభ మార్పిడి తదితర అంశాలపై వీరు చర్చించారు. ప్రపంచ సెమీకండక్టర్ల తయారీకి కేంద్ర బిందువైన తైవాన్.. ప్రస్తుతం ఏఐ, డీప్ టెక్నాలజీ, అధునాతన తయారీ రంగాల్లోనూ కీలక పాత్ర పోషిస్తోంది.
జూలై 29 నుంచి ఆగస్టు 2 వరకు పర్యటన
తైవాన్ ఆవిష్కరణల వ్యవస్థను ప్రత్యక్షంగా అధ్యయనం చేసేందుకు వీలుగా జూలై 29 నుంచి ఆగస్టు 2 వరకు అంతర్జాతీయ ప్రతినిధి బృందం పర్యటన సాగనుంది. ఈ పర్యటనలో సెమీకండక్టర్లు, ఏఐ, ఎలక్ట్రానిక్స్, డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్, డీప్ టెక్నాలజీ, అధునాతన తయారీ, స్టార్టప్‌లు, ఆవిష్కరణలు, పరిశోధన రంగాలపై ప్రత్యేక దృష్టి సారించనున్నారు.
ఎవరెవరు పాల్గొనవచ్చు?
ఈ అంతర్జాతీయ పర్యటన ద్వారా వ్యాపారవేత్తలు, స్టార్టప్ వ్యవస్థాపకులు, ఆవిష్కర్తలు, పెట్టుబడిదారులు, విద్యార్థులు, అధ్యాపకులు, పరిశోధకులు తైవాన్ ఎకోసిస్టమ్‌ను నేరుగా పరిశీలించే అవకాశం దక్కనుంది. వీరు మాత్రమే కాకుండా ఎగుమతిదారులు, పరిశ్రమ సంఘాలు, విద్యా సంస్థల ప్రతినిధులు సైతం ఈ కార్యక్రమానికి తమ పేర్లను నమోదు చేసుకోవచ్చని ఐసీఐఈ నిర్వాహకులు ఒక ప్రకటనలో స్పష్టం చేశారు.






