గాంధీ ఐవీఎఫ్ సెంటర్‌లో జన్మించిన బాల భీముడు

by Naga Rani Yarlagadda |

ప్రైవేటు ఆసుపత్రుల్లో లక్షలు కుమ్మరించినా దక్కని సంతాన భాగ్యం.. ప్రభుత్వ గాంధీ ఆసుపత్రిలో రూపాయి ఖర్చు లేకుండా నెరవేరింది.

గాంధీ ఐవీఎఫ్ సెంటర్‌లో జన్మించిన బాల భీముడు
X
  • సుమారు 4 కిలోల బరువుతో పుట్టిన బాబు
  • గాంధీలో పూర్తి ఉచితంగా ఐవీఎఫ్ చికిత్స అందించామన్న సూపరింటెండెంట్ డా.వాణి

దిశ, తెలంగాణ బ్యూరో: ప్రైవేటు ఆసుపత్రుల్లో లక్షలు కుమ్మరించినా దక్కని సంతాన భాగ్యం.. ప్రభుత్వ గాంధీ ఆసుపత్రిలో రూపాయి ఖర్చు లేకుండా నెరవేరింది. గాంధీ ఐవీఎఫ్ సెంటర్‌లో చికిత్స పొందిన దంపతులకు ఏకంగా సుమారు 4 కిలోల బరువుతో బాల భీముడు జన్మించాడు. పూర్తి ఉచితంగా అందించిన ఈ ఐవీఎఫ్ చికిత్స విజయవంతం కావడంతో ఆ తల్లిదండ్రుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. బాబును చూసి ఆ తల్లిదండ్రులు మురిసిపోతున్నారు. భువనగిరి జిల్లాకు చెందిన రవి, సౌమ్య దంపతులకు 9 సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. సంతానం కలగకపోవడంతో పలు ప్రైవేటు ఫెర్టిలిటీ సెంటర్లలో చికిత్స తీసుకున్నారు. సుమారు 12 సార్లు ఓఐ, ఐయూఐ వంటి ప్రొసీజర్లు చేయించుకున్నప్పటికీ ఫలితం దక్కలేదు. గతేడాది గాంధీ హాస్పిటల్‌లోని ఐవీఎఫ్ సెంటర్‌ను రవి, సౌమ్య దంపతులు ఆశ్రయించారు. వీరి సమస్యను గుర్తించిన డాక్టర్లు, వీరికి ఐవీఎఫ్ చేశారు. ఐవీఎఫ్ తొలి ప్రయత్నంలో ప్రెగ్నెన్సీ సక్సెస్ అయిందని డాక్టర్లు శోభ, ఫాతిమా తెలిపారు. ఐవీఎఫ్ మొదలు యాంటినాటల్ చెకప్స్, మెడిసిన్ అన్నీ గాంధీలోనే ఉచితంగా అందజేశామని వివరించారు. ఈ నెల 27న గాంధీ హాస్పిటల్‌లోనే సౌమ్య పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. బాబు, తల్లి సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నారని డాక్టర్లు తెలిపారు. సౌమ్య, రవి దంపతులు ప్రైవేటు హాస్పిటల్స్‌లో లక్షలు ఖర్చు చేసుకున్నారని, గాంధీలో పూర్తి ఉచితంగా వారికి చికిత్స అందించామని సూపరింటెండెంట్, డాక్టర్ వాణి తెలిపారు.

Next Story