ఉచిత బస్సు ప్రయాణం.. ఆర్టీసీ చరిత్రలో ఆల్ టైమ్ రికార్డు బద్దలు

by Disha Web Desk 6 |
ఉచిత బస్సు ప్రయాణం.. ఆర్టీసీ చరిత్రలో ఆల్ టైమ్ రికార్డు బద్దలు
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మహాలక్ష్మి పథకం అమలులోకి వచ్చింది. దీంతో మహిళలు, బాలికలు, ట్రాన్స్ జెండర్స్ ఉచితంగా రాష్ట్రమంతటా ప్రయాణించవచ్చు. దీంతో కొన్ని రోజులు ఏ ఐడీ చూపించకుండా ప్రయాణించారు. అయితే ఇటీవల ఐదైనా ఐడీ కార్డు చూపించి ప్రయాణం చేయాలనడంతో రద్దీ భారీగా పెరిగింది. మహిళలు ప్రతి రోజు బస్సుల్లో అధికంగా ప్రయాణిస్తూ తెలియని ప్రదేశాలను తెలుసుకుంటున్నారు. అంతేకాకుండా ఆర్జీసీకి కూడా భారీగా రీయింబర్స్ ద్వారా లాభాలు వచ్చినట్లు సమాచారం. దీంతో అధికారులు ఆనందం వ్యక్తం చేశారు.

ఇదిలా ఉంటే.. తాజాగా, ఆర్టీసీ చరిత్రలోనే ఆల్ టైం రికార్డు సాధించింది. సోమవారం ఒక్కరోజే రూ. 21.11 కోట్ల ఆదాయం వచ్చినట్లు ఆర్టీసీ అధికారులు వెల్లడించినట్లు సమాచారం. తెలంగాణ రాష్ట్రమంతటా ఆర్టీసీ పరిధిలో 97 డిపోలు ఉండగా.. సోమవారం నాడు దాదాపు 96 డిపోలకు భారీగా లాభాలు వచ్చినట్లు తెలుస్తోంది. ఇలా జరగడం టీఎస్ ఆర్టీసీ చరిత్రలో ఇదే మొదటిసారి కావడం గమనార్హం. ప్రభుత్వం రీయింబర్స్ చేయడంతో ఈ నెల మొత్తం మీద 49 డిపోలకు లాభాలు వచ్చాయట. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మూడు ఆర్టీసీ జోన్లలో సోమవారం బస్సులు 33.36 లక్షల కిలోమీటర్లు తిరిగాయి. అత్యధికంగా కరీంనగర్‌ జోన్‌లో 14.49 లక్షల కిలోమీటర్లు తిరిగాయి.

ఇక గ్రేటర్‌ హైదరాబాద్‌ జోన్‌లో 10.93 లక్షల కిలోమీటర్లు తిరిగాయి. డిసెంబరులో ఇప్పటి వరకు డిసెంబర్ 4వ తేదీన అత్యధికంగా 34.16 లక్షల కి.మీ. బస్సులు తిరగగా రూ.21.04 కోట్ల ఆదాయం వచ్చింది. డిసెంబర్‌ 18న 33.36 లక్షల కిలోమీటర్లు మాత్రమే బస్సులు తిరిగినా రూ.21.10 కోట్ల ఆదాయం వచ్చింది. బస్సుల ఆక్యుపెన్సీ రేషియో 97.31 శాతానికి పెరిగినట్లు ఆర్టీసీ వర్గాలు వెల్లడించాయి. మహాలక్ష్మి పథకం వల్ల ప్రభుత్వం నష్టాల పాలవుతుందని భావించిన ప్రజలు ఈ విషయం తెలిసి షాక్ అవుతున్నారు. ఈ స్కీమ్‌లో ఆర్టీసీ ఇంకెన్ని రికార్డులు బద్దలు కొడుతుందో చూడాలి.


Next Story