ఆర్టీసీపై ‘మహాలక్ష్మి’ భారం.. ఏడాది రాయితీ ఒక్కనెలకే?

by Naga Rani Yarlagadda |

తెలంగాణ ఆర్టీసీకి ఉచిత ప్రయాణాలు మోయలేని భారంగా మారుతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. గతంలో ఏడాది కాలానికి ఇచ్చే రాయితీ.. ఇప్పుడు మహాలక్ష్మి పథకంతో ఒక్కనెలకు కూడా సరిపోవడం లేదని ఆర్టీఐ వెల్లడించింది.

ఆర్టీసీపై ‘మహాలక్ష్మి’ భారం.. ఏడాది రాయితీ ఒక్కనెలకే?
X
  • నెలకు రూ.390 కోట్ల రాయితీ ప్రయాణాలు
  • ఆర్టీఐ ద్వారా సమాచారం వెల్లడించిన సంస్థ

దిశ, తెలంగాణ బ్యూరో: టీజీఎస్ ఆర్టీసీపై ఉచిత, రాయితీ ప్రయాణాలు భారంగా మారుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ‘మహాలక్ష్మి’ పథకంతో పోలిస్తే దశాబ్దాలుగా అందుతున్న ఇతర రాయితీల వాటా కేవలం 10శాతం కంటే తక్కువగానే ఉండటం గమనార్హం. నెలకు సమారు రూ.390 కోట్ల మేర ఆర్థిక భారాన్ని రాయితీ ప్రయాణాలకు సర్కారు ఖర్చు చేస్తున్నది. గతంలో ఏడాదికే రూ.404 కోట్ల మేర రాయితీ ప్రయాణాలు కల్పిస్తుండగా.. ఇప్పుడు అది దాదాపు నెల రోజుల్లోనే దాటిపోతున్నది.

మహాలక్ష్మి@ రూ.8,578 కోట్లు

రాష్ట్రంలో 2023 డిసెంబర్ 9న ప్రవేశపెట్టిన మహిళల ఉచిత బస్సు ప్రయాణ పథకం (మహాలక్ష్మి) రికార్డు స్థాయి గణాంకాలను నమోదు చేసింది. 2025 డిసెంబర్ 14 నాటికి (దాదాపు రెండేళ్లలో) మహిళలు రూ.8,578.07 కోట్ల విలువైన ప్రయాణాలు చేశారు. సగటున నెలకు రూ.357 కోట్ల భారం కేవలం ఈ ఒక్క పథకం ద్వారానే ఆర్టీసీపై పడుతున్నది.

ప్రశ్నార్థకంగా ఆర్టీసీ మనుగడ?

ఉచిత ప్రయాణాలకు సంబంధించిన బకాయిలను ప్రతినెలా ఆర్టీసీకి క్రమం తప్పకుండా చెల్లిస్తున్నామని ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. కానీ నిధులు విడుదల చేస్తున్నా అవి కేవలం నిర్వహణకే సరిపోతున్నాయని కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి. సంస్థను బలోపేతం చేయకపోతే భవిష్యత్‌లో ఆర్టీసీ మనుగడ ప్రశ్నార్థకంగా మారే అవకాశం ఉంది.

Next Story