జాబ్స్ పేరిట యువత, మహిళలను లక్ష్యంగా చేసుకుని మోసాలు

by Malleboina Mahesh |

ఐటీ కారిడార్ గా వెలుగొందుతున్న హైదరాబాద్ మహనగరంలో ఐటీ కంపెనీల ముసుగులో కొన్ని సంస్థలు యువతకు కుచ్చుటోపి పెడుతున్నాయి. నిరుద్యోగులను టార్గెట్‌గా చేసుకుని ముంచేస్తున్నాయి.

జాబ్స్ పేరిట యువత, మహిళలను లక్ష్యంగా చేసుకుని మోసాలు
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఐటీ కారిడార్ గా వెలుగొందుతున్న హైదరాబాద్ మహనగరంలో ఐటీ కంపెనీల ముసుగులో కొన్ని సంస్థలు యువతకు కుచ్చుటోపి పెడుతున్నాయి. నిరుద్యోగులను టార్గెట్‌గా చేసుకుని ముంచేస్తున్నాయి. రూ. లక్షల్లో వార్షిక వేతనం, ఐటీ కొలువు అని కలలు కంటున్న వారిని లక్ష్యంగా చేసుకొని మోసాలకు పాల్పడుతున్నాయి. ‘పేరుకే ఐటీ కంపెనీలు.. అవి ఐపీ కంపెనీలు’ అని బాధితులు పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేస్తున్నారు. కొన్ని సంస్థలు ట్రైనింగ్ ఇచ్చి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్పి.. లక్షలకు లక్షలు వసూలు చేసి రాత్రికి రాత్రే కంపెనీ బోర్డు తీప్పేస్తున్నాయి. మరికొన్ని కంపెనీలు ఉద్యోగుల ఆధార్, పాన్ కార్డు వివరాలు తీసుకుని.. వారికి తెలియకుండానే లోన్లు తీసుకుంటున్నాయి. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని గచ్చిబౌలి, మాదాపూర్ పోలీస్ స్టేషన్ లో నమోదవుతున్న కేసుల్లో ప్రధానంగా ఐటీ కంపెనీల పేరుతో జరిగిన మోసాలే అధికంగా ఉంటున్నాయి.

లోన్ల పేరుతో రూ.20 కోట్ల దోపిడీ..

ఉద్యోగుల డేటా తో రూ.20 కోట్ల లోన్లు తీసుకున్నట్లు బాధితులు సోనిక్స్ హ్యూమన్ క్యాపిటల్ సొల్యూషన్స్ కంపెనీపై గత మే నెలలో గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఉద్యోగాలు ఇచ్చే సమయంలో వ్యక్తిగత డేటా తీసుకున్నారని బాధితులు తెలిపారు. ట్రైనింగ్ సమయంలో కొంత చెల్లించాలని, లోన్ సౌకర్యం కల్పిస్తామని చెప్పి మోసాలకు పాల్పడినట్లు సికింద్రాబాద్ లాలాగూడకు చెందిన సునీత రెడ్డి తన ఫిర్యాదులో పేర్కోన్నారు. లోన్ ఇచ్చిన వర్ధన ఫైనాన్స్ కంపెనీ నుంచి లోన్ చెల్లించాలని నోటీసులు రావడంతో మోసపోయినట్టు గుర్తించామని వాపోయాడు. తన పేరుపై రూ.3 లక్షల లోన్ ఉన్నట్టు ఫిర్యాదులో పేర్కొన్నాడు.

వర్క్ ఫ్రమ్ హోమ్ పేరుతో..

గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో మే నెలలో వచ్చిన ఫిర్యాదు ఆధారంగా మరో ఐటీ కంపెనీ మోసం వెలుగులోకి వచ్చింది. ప్యూరోపాల్ క్రియేషన్ అండ్ ఐటీ సొల్యూషన్స్ సంస్థ ట్రైనింగ్ ద్వారా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని ఆశ చూపి సుమారు వందల సంఖ్యలో బాధితుల నుంచి రూ.2 లక్షల నుంచి రూ.2.5 లక్షల వరకు వసూలు చేసినట్లు తెలిసింది. ‘వర్క్ ఫ్రమ్ హోమ్’ పేరుతో అందినకాడికి దోచుకున్నట్లు బాధితులు వాపోయారు. సుమారు రూ.7 కోట్ల మేర వసూలు చేసినట్లు చెబుతున్నారు.

ఇంకా అనేక ఉదాహరణలు..

ఉద్యోగాల పేరుతో రైస్ వ‌ర‌ల్డ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ హైదరాబాద్ లో నిరుద్యోగుల‌ను మోసం చేసింది. మార్చి నెలలో ఈ మోసాలు వెలుగు చూశాయి. అంతకంటే ముందు ఈ కంపెనీ త‌మ బ్రాంచ్‌ను గచ్చిబౌలి ఏరియాలో ప్రారంభించింది. దేశ వ్యాప్తంగా ఐదు న‌గ‌రాల్లో బ్రాంచులు ఓపెన్ చేసిన‌ట్లు చూపి భారీగా డ‌బ్బులు వ‌సూలు చేసినట్లు బాధితులు ఆరోపించారు. ఒక్కో ఉద్యోగి నుంచి రూ. 50 వేలు వ‌సూలు చేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. కంపెనీ మూసివేశాక బాధితులు ఫిర్యాదు చేయడంతో ఈ మోసం వెలుగు చూసింది.

- మాదాపూర్‌ లో నియోజెన్ సాఫ్ట్ టెక్ సొల్యూషన్స్ చేసిన మోసం గత ఫిబ్రవరిలో బయటపడింది. నకిలీ ఐటీ కంపెనీ ఏర్పాటు చేసి, నకిలీ అపాయింట్మెంట్ లెటర్లు సృష్టించి నిరుద్యోగులను మోసం చేశారు. ఓ ఐటీ కంపెనీలో హెచ్‌ఆర్‌ (హ్యూమన్ రిసోర్స్) గా పనిచేసిన వ్యక్తి ఈ నేరాలకు పాల్పడ్డట్టు గుర్తించి అరెస్ట్ చేశారు.

-మోసపోయామని గ్రహించిన 800 మంది బాధితులు ఇన్నోహబ్‌ టెక్నాలజీస్‌ పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కంపెనీ ఒక్కో బాధితుడి నుంచి రూ.2లక్షల నుంచి రూ.3 లక్షల వరకు వసూలు చేసినట్లు బాధితులు తెలుపుతున్నారు.

- ఉద్యోగాల పేరుతో ధన్యన్‌ ఐటీ టెక్నాలజీస్‌ ఒక్కొక్కరి వద్ద రూ.2 లక్షల చొప్పున సుమారు 200 మంది నుంచి రూ.4 కోట్లు వసూలు చేయగా.. బాధితుల ఫిర్యాదుతో ఈ వ్యవహారం వెలుగు చూసింది.

-సాఫ్ట్‌ సొల్యూషన్‌ ఐటీ కంపెనీ శిక్షణ, ల్యాప్‌టాప్‌, సెక్యూరిటీ డిపాజిట్‌ కింద ఒక్కొక్కరి దగ్గర రూ.2లక్షల చొప్పున 150 మంది దగ్గర రూ.3 కోట్లు వసూలు చేసి బిచానా ఎత్తేసింది.

5 వేలకు పైగా కేసులు (బాక్స్)

సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో 2024–25 లో నమోదైన కేసుల్లో పార్ట్ టైం జాబ్ ఫ్రాడ్ కేసులు అధికంగా ఉన్నాయి. రెండేళ్లలో రాష్ట్రవ్యాప్తంగా పార్ట్ టైమ్ ఆఫర్ల పేరుతో మోసగించారని ఐదు వేలకు పైగా కేసులు నమోదు కాగా, బాధితులు రూ.35.3 కోట్లు పోగొట్టుకున్నట్లు పోలీసు నివేదికలు చెబుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఫ్రాడింగ్ కంపెనీలకు సంబంధించి 520 కేసులు నమోదయ్యాయి. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోనే జాబ్ ఆఫర్స్ పేరుతో 245 కేసులు నమోదు కావడం గమనార్హం. లోన్ ఫ్రాడ్స్ పేరుతో 175 కేసులు నమోదవగా , బాధితులు రూ.5.20 కోట్లు నష్టపోయారు.

Next Story