వర్షకాల ఆఫర్ల పేరుతో మోసాలు.. డ్రైఫ్రూట్స్‌ డీల్లో లక్షలు పోగొట్టుకున్న బాధితులు!

by Yella Dhawani Reddy |

హైదరాబాద్‌లోని మహిళ ఓ ఆకర్షణీయ ప్రకటన చూసి, పెద్ద మోసానికి గురయ్యారు.

వర్షకాల ఆఫర్ల పేరుతో మోసాలు.. డ్రైఫ్రూట్స్‌ డీల్లో లక్షలు పోగొట్టుకున్న బాధితులు!
X

దిశ, వెబ్ డెస్క్: హైదరాబాద్‌లోని మహిళ ఓ ఆకర్షణీయ ప్రకటన చూసి, పెద్ద మోసానికి గురయ్యారు. "4 కిలోల డ్రైఫ్రూట్స్ కేవలం రూ.499కే!" అనే ప్రకటన చూసి ఆమె యూపీఐ ద్వారా డబ్బు చెల్లించగా, తరువాత డెలివరీ బాయ్ వస్తున్నాడంటూ అడ్రెస్ చెప్పమంటూ, ఒక్కొక్కటిగా వివిధ రకాల ఫీజు పేరిట రూ.50,000కు పైగా ఆమె ఖాతా నుంచి దొంగిలించారు.

ఇక మరొక బాధితుడు.. డ్రైఫ్రూట్స్ అంతర్జాతీయ బ్రాండ్‌కు డీలర్‌షిప్ ఇస్తామని నమ్మించి, ఆయన నుంచి మోసగాళ్లు రూ.25.90 లక్షలు వసూలు చేసి కనిపించకుండా పోయారు. సామాజిక మాధ్యమాల్లో ఫొటోలు, ఆకర్షణీయమైన వీడియోల ద్వారా నమ్మకం కలిగించి, వాళ్లను మోసం చేసినట్టు పోలీసులు తెలిపారు.

వర్షకాలం ఆఫర్ల పేరిట మాయ

ప్రస్తుతం వర్షాకాలం, ఆఫర్ల సీజన్ అంటూ నకిలీ ఈ-కామర్స్ వెబ్‌సైట్లు, యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ వేదికగా భారీ డిస్కౌంట్లు చూపుతూ మాయ చేస్తుండటం ఆందోళనకరం. బాదం, పిస్తా, జీడిపప్పు, ఎండుద్రాక్ష వంటి డ్రైఫ్రూట్స్ కాంబో ప్యాక్‌ (4 కిలోల విలువ దాదాపు రూ.1999)ను కేవలం రూ.279కే ఇస్తున్నట్లు చూపిస్తున్నారు. ‘డీల్ ఆఫ్ ది డే’ అంటూ చూపించే ఆఫర్లకు తలరాని నష్టం చవిచూస్తున్నారు ప్రజలు.

నకిలీ సైట్ల వల్ల మోసపోతున్న వినియోగదారులు

డిస్కౌంట్ పేరు చెప్పి వంటనూనెలు, సబ్బులు, గోధుమపిండి వంటి రోజువారీ వస్తువులను 80-90% తగ్గింపుతో ఇస్తామంటూ నకిలీ ప్రకటనలు వస్తున్నాయి. ఓ మహిళ రూ.1779 చెల్లించగా డెలివరీ రాలేదు. మరొకరైతే రూ.589కి డ్రైఫ్రూట్స్ ప్యాక్ ఆర్డర్ చేసి మోసపోయినట్టు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

ఇటువంటి మోసాల బారినపడ్డవారు ఇప్పటి వరకూ 20 మంది అసలైన కంపెనీలకు ఫిర్యాదు చేసినట్టు సమాచారం. బాధితులు ముందుకు వస్తే మాత్రమే ఈ మోసాలకు అడ్డుకట్ట పడుతుందని సైబర్‌క్రైమ్‌ పోలీసులు హెచ్చరిస్తున్నారు.

జాగ్రత్తలు తప్పనిసరి

* నకిలీ వెబ్‌సైట్లపై లావాదేవీలు చేయకండి.

* ప్రమాణిత ఈ-కామర్స్ ప్లాట్‌ఫార్మ్‌లను మాత్రమే ఉపయోగించండి.

* అసలైన కంపెనీ వెబ్‌సైటు అనే విషయం URL ద్వారా నిర్ధారించుకోండి.

* ఏదైనా అనుమానం వచ్చిన వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్ లేదా 1930 నంబర్ ద్వారా ఫిర్యాదు చేయండి.

Next Story