క‌వ‌ల ఆడ‌పిల్ల‌ల హ‌త్య కేసులో క‌న్న తండ్రితో స‌హా న‌లుగురు నిందితులకు రిమాండ్

by Ratna Kumari |

అభం, శుభం తెలియని కవల పిల్లలను కన్నవాడే కసాయి వాడిలా వ్యవసాయ బావిలో పడేసి హత్య చేసిన ఘటన రాష్ట్రంలో తీవ్ర కలకలం రేపింది.

క‌వ‌ల ఆడ‌పిల్ల‌ల హ‌త్య కేసులో క‌న్న తండ్రితో స‌హా న‌లుగురు నిందితులకు రిమాండ్
X

దిశ, కరీంనగర్ రూరల్ : అభం, శుభం తెలియని కవల పిల్లలను కన్నవాడే కసాయి వాడిలా వ్యవసాయ బావిలో పడేసి హత్య చేసిన ఘటన రాష్ట్రంలో తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనపై కరీంనగర్ సీపీ గౌస్ ఆలం సోమవారం మీడియా స‌మావేశంలో వివ‌రాల‌ను వెల్ల‌డించారు. కరీంనగర్ మండలం జూబ్లీ నగర్ గ్రామానికి చెందిన కచ్చు శ్రీశైలం (28), ఓ ప్రవేట్ మెడికల్ కాలేజీలో కంప్యూటర్ ఆపరేటర్‌గా పని చేస్తున్నాడు. 2020లో మౌనికతో వివాహం కాగా 2022లో వీరికి కవల ఆడపిల్లలు (గీతంశి, గీతన్విక) జన్మించారు. అయితే మొదటి నుండి మగపిల్లవాడు కావాలని కోరుకున్న శ్రీశైలంకు, ఆడపిల్లలు పుట్టడం ఇష్టం లేదు. సుమారు 2 కోట్ల విలువైన ఆస్తి ఆడపిల్లల పెళ్లిళ్లకే సరిపోతుందని భావించిన శ్రీశైలం, తన తల్లిదండ్రులు అశోక్, లావణ్య తమ్ముడు రాకేష్‌తో కలిసి ఆస్తిపై మక్కువతో, ఆడపిల్లలనే వివక్షతో పిల్లలను అడ్డు తొలగించుకోవాలని పథకం వేసి ఈ దారుణానికి ఒడిగట్టినట్లు విచారణలో వెల్లడైనట్లు సీపీ తెలిపారు.

పథకం ప్రకారమే..

​ఏప్రిల్ 3న పథకం ప్రకారం.. నిందితుడు శ్రీశైలం తన భార్యను ఇంట్లోనే ఉండమని చెప్పి, బలవంతంగా ఇద్దరు కుమార్తెలను మోటార్ సైకిల్ పై పొలం వద్దకు తీసుకెళ్లాడు. చుట్టుపక్కల ఎవరూ లేని సమయం చూసి, నలుగురు నిందితులలైన కచ్చు శ్రీశైలం (తండ్రి), కచ్చు అశోక్ (తాత), కచ్చు లావణ్య (నానమ్మ), ​కచ్చు రాకేష్ (బాబాయ్) వీరు ముందుగా అనుకున్న ఒప్పందం ప్రకారం.. శ్రీశైలం ఇద్దరు చిన్నారులను వ్యవసాయ బావిలోకి తోసివేశాడు. నీటిలో మునిగిపోతున్న గీతంశి ప్రాణాల కోసం కొట్టుమిట్టాడుతుండగా, తనే బావిలోకి దిగి ఆమెను నీటిలో ముంచి ఊపిరాడకుండా చేసి చంపేశాడు. ​అనంతరం ఎవరికీ అనుమానం రాకుండా ఉండేందుకు, పిల్లలను కాపాడబోతున్నట్లుగా నటిస్తూ కేకలు వేస్తూ నటించినట్లు విచారణలో వెల్లడైంది. నిందితుడి ప్రవర్తనపై అనుమానం వచ్చిన గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించారు. కరీంనగర్ రూరల్ సీఐ నిరంజన్ రెడ్డి నేతృత్వంలో దర్యాప్తు చేపట్టిన పోలీసులు, నిందితులు గోపాల్‌పూర్‌లోని తమ బంధువుల ఇంట్లో తలదాచుకున్నట్లు గుర్తించిన పోలీసులు ఆదివారం మధ్యాహ్నం నిందితులను అదుపులోకి తీసుకోని విచారణ చేప‌ట్ట‌గా.. నేరాన్ని అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు. హత్యకు ఉపయోగించిన గ్లామర్ మోటార్ సైకిల్, ఒక వివో మొబైల్ ఫోన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేసును అత్యంత వేగంగా ఛేదించిన రూరల్ ఏసీపీ విజయ కుమార్, సీఐ నిరంజన్ రెడ్డి తోపాటు ఎస్ఐ లు లక్ష్మారెడ్డి, నరేష్ ని సీపీ గౌష్ ఆలం అభినందించారు.

Next Story