ఫార్ములా ఈ-కార్‌ రేసు కేసు.. KTRపై విచారణకు అనుమతినిచ్చిన గవర్నర్

by Kema Shiva Kumar |   (  Updated:2025-11-20 05:39:21  IST  )

తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో సంచలన పరిణామం చోటుచేసుకుంది.

ఫార్ములా ఈ-కార్‌ రేసు కేసు.. KTRపై విచారణకు అనుమతినిచ్చిన గవర్నర్
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో బీఆర్ఎస్ (BRS) ప్రభుత్వ హయాంలో జరిగిన ఫార్ములా ఈ-కార్ రేసు (Formule E-Car Race) నిర్వహణలో రూ.55 కోట్లకు పైగా అక్రమాలు జరిగాయన్న కేసులో మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ (KTR)పై క్రిమినల్ కేసు నమోదు చేసుకునేందుకు తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అనుమతి ఇచ్చారు. ఈ మేరకు సెప్టెంబర్ 9న రాజ్‌భవన్‌కు ఏసీబీ ఫైలు పంపగా, రాష్ట్రపతి కార్యాలయం నుంచి న్యాయ నిపుణుల సలహా తీసుకున్న అనంతరం గవర్నర్ బుధవారం గురువారం ఉదయం కేటీఆర్‌పై విచారణకు అనుమతినిస్తున్నట్లుగా ఫైలుపై సంతకం చేశారు. ఈ తాజాగా పరిణామంతో కేటీఆర్‌తో పాటు మాజీ HMDA చీఫ్ ఇంజినీర్ (ప్రాజెక్ట్స్) బీఎల్వీ రెడ్డి, మాజీ ప్రత్యేక అధికారి కిరణ్ కుమార్‌లపై ఏసీబీ త్వరలోనే చార్జ్‌షీట్ దాఖలు చేయనుంది. ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, బీఎల్ఎన్ రెడ్డిలపై విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఇప్పటికే ప్రాసిక్యూషన్ అనుమతి ఇచ్చిన నేపథ్యంలో ఈ కేసు మరింత వేగం పుంజుకోనుంది. ఇప్పటికే ఇదే కేసులో కేటీఆర్ నాలుగు సార్లు ఏసీబీ విచారణకు కూడా హాజరైన విషయం తెలిసిందే.

ఒప్పందం లేకుండా రూ.54.88 కోట్ల చెల్లింపులు..

2023 ఫిబ్రవరి 11న హైదరాబాద్‌లో జరిగిన ఫార్ములా ఈ-ప్రిక్స్ రేసుకు ఏస్ ఆటోమొబైల్స్ (Greenco Group)తో ఎలాంటి ఒప్పందం లేకుండానే రూ.54.88 కోట్లు చెల్లించారని అప్పటి మున్సిపల్ శాఖ మంత్రిగా పని చేసిన కేటీఆర్‌పై అభియోగాలు ఉన్నాయి. ఆర్థిక శాఖ, ఆర్‌బీఐ (RBI) అనుమతి లేకుండా విదేశీ కంపెనీ ‘ఫార్ములా ఈ ఆపరేషన్స్’కు నిధులు బదిలీ చేశారని.. HMDA, గ్రీన్‌కో, ఫార్ములా ఈ సంస్థల మధ్య రహస్య ఒప్పందాలు చేసుకున్నట్లుగా ఏసీబీ ఆరోపిస్తోంది. ఈ పరిణామంతో బీఆర్ఎస్ నేతృత్వంలోని ఫార్ములా ఈ-కార్ రేసు వ్యవహారం మరోసారి రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. కేటీఆర్‌పై చట్టపరమైన చర్యలకు రంగం సిద్ధమైంది.

Next Story