తెలంగాణ జనసేనలోకి చేరికలు షురూ.. పవన్ సమక్షంలో కండువా కప్పుకున్న మాజీ హెల్త్ డైరెక్టర్ గడల

by Prasad Jukanti |

తెలంగాణ పబ్లిక్ హెల్త్ మాజీ డైరెక్టర్ డాక్టర్ గడల శ్రీనివాసరావు జనసేనలో చేరారు. జూబ్లీహిల్స్‌లో పవన్ కల్యాణ్ ఆయనకు కండువా కప్పారు.

తెలంగాణ జనసేనలోకి చేరికలు షురూ.. పవన్ సమక్షంలో కండువా కప్పుకున్న మాజీ హెల్త్ డైరెక్టర్ గడల
X

దిశ, తెలంగాణ బ్యూరో/డైనమిక్ బ్యూరో: తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. రాష్ట్ర పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ మాజీ డైరెక్టర్ డాక్టర్ గడల శ్రీనివాసరావు జనసేన పార్టీలో చేరారు. బుధవారం హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో జనసేన పార్టీ అధ్యక్షుడు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నివాసంలో జరిగిన కార్యక్రమంలో గడల‌ శ్రీనివాసరావుకు పవన్ కళ్యాణ్ పార్టీ కండువా కప్పి జనసేనలోకి ఆహ్వానించారు. తెలంగాణ రాజకీయాల్లో జనసేన తిరిగి యాక్టివ్ కాబోతోందని, వచ్చే ఎన్నికల్లో జనసేన పోటీలో ఉండబోతోందని పవన్ కల్యాణ్ నిన్న వ్యాఖ్యలు చేసిన మరుసటి రోజే ఈ చేరిక జరగడం రాజకీయ వర్గాల్లో ఆసక్తిగా మారింది.

గడల చేరిక కొత్తబలం:

ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. డాక్టర్ గడల శ్రీనివాసరావు కుటుంబంతో తమ కుటుంబానికి ఎంతో కాలంగా సన్నిహిత అనుబంధం ఉందన్నారు. ప్రజాసేవ పట్ల అంకితభావం, నిజాయతీ, పరిపాలనా దక్షత కలిగిన అధికారిగా శ్రీనివాసరావు ప్రజల్లో విశేష గౌరవం సంపాదించుకున్నారని పేర్కొన్నారు. గడల శ్రీనివాసరావు వంటి అనుభవజ్ఞులు, సేవాభావం కలిగిన వ్యక్తులు జనసేనలో చేరడం పార్టీకి మరింత బలాన్ని, విశ్వసనీయతను తీసుకువస్తుందని తెలిపారు. ప్రజా సమస్యలపై అవగాహన, పరిపాలనా అనుభవం, సమాజంలోని వివిధ వర్గాలతో ఆయనకు ఉన్న అనుబంధం తెలంగాణలో పార్టీ విస్తరణకు దోహదపడుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. తెలంగాణలో పార్టీ బలోపేతానికి ఆయన కీలక పాత్ర పోషిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.

భావోద్వేగపూరిత నిర్ణయం కాదు:

ఈ సందర్భంగా మాట్లాడిన డాక్టర్ గడల శ్రీనివాసరావు.. పవన్ కల్యాణ్‍తో తన అనుబంధం చిరంజీవి ద్వారా ప్రారంభమైందని తెలిపారు. తాను జనసేనలో చేరడం భావోద్వేగపూరిత నిర్ణయం కాదని, సమాజానికి మరింత విస్తృత స్థాయిలో సేవ చేయాలనే సంకల్పంతో తీసుకున్న ఆలోచిత నిర్ణయమని స్పష్టం చేశారు. యువతకు ఆశయాలను, దిశానిర్దేశాన్ని అందించే నాయకత్వం పవన్ కల్యాణ్‍లో కనిపించిందన్నారు. ప్రస్తుత తరానికి విలువలతో కూడిన రాజకీయాలు అవసరమని, ఆ లక్ష్యంతో పనిచేస్తున్న జనసేన పార్టీ తనకు సరైన వేదికగా భావించానని తెలిపారు. ఇకపై జనసైనికుడిగా పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లడమే కాకుండా, తెలంగాణలో పార్టీ బలోపేతానికి తన వంతు కృషి చేస్తానని చెప్పారు.

బీఆర్ఎస్ టికెట్ ఆశించి భంగపాటు!

గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తనదైన డైలాగులు, రాజకీయ వ్యాఖ్యలతో తరచూ వార్తల్లో నిలిచిన గడాల శ్రీనివాస్ కరోనా సమయంలో హెల్త్ డైరెక్టర్‍గా వ్యవహరించడంతో తెలంగాణ వ్యాప్తంగా ఆయన పేరు ప్రజల్లోకి వెళ్లింది. తన స్వంత జీఎస్‌ఆర్ (GSR) చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు, ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించి ప్రజల్లోకి వెళ్లారు. ఈ క్రమంలో పొలిటికల్ ఎంట్రీ ఇవ్వాలని ప్రయత్నించిన గడల.. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో నాటి అధికార బీఆర్ఎస్ పార్టీ నుంచి కొత్తగూడెం టికెట్ ఆశించి భంగపడ్డారు. అనంతరం ప్రభుత్వం మారడంతో ఆయన స్వచ్ఛంద పదవీ విరమణ (VRS)తీసుకున్నారు. ఆ తర్వాత సైలెంట్ గా ఉన్న గడల అనూహ్యంగా జనసేన గూటిలో ప్రత్యక్షమయ్యారు. కొత్తగూడెం ప్రాంతంలో ఆంధ్రామూలాలు ఉన్న ఓటర్లు, పవన్ కల్యాణ్ అభిమానులు, యువత ఎక్కువగా ఉండటంతో ఇదంతా తన రాజకీయ భవిష్యత్ కు కలిసి వస్తుందనే అంచనాతోనే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు పొలిటికల్ కారిడార్‍లో చర్చ జరుగుతోంది. అయితే పవన్ కల్యాణ్ విషయంలో తెలంగాణలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న సమయంలో గడల జనసేన కప్పుకోవడం ఎంతవరకు కలిసి వస్తోందో కాలమే నిర్ణయించాలి.

Next Story