కాళేశ్వరంపై బండి సంజయ్ అసత్య ప్రచారాలు: వినోద్ కుమార్

by Gantepaka Srikanth |

మేడిగడ్డ వద్ద కుంగిన పిల్లర్లకు రిపేర్ చేయొచ్చని ఎన్‌డీఎస్ తన నివేదికలో చెప్పిందని.. మేడిగడ్డకు రిపేరు చేయమని కేంద్రమంత్రి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ఎందుకు అడగడం లేదని మాజీమంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ప్రశ్నించారు.

కాళేశ్వరంపై బండి సంజయ్ అసత్య ప్రచారాలు: వినోద్ కుమార్
X

దిశ, తెలంగాణ బ్యూరో: మేడిగడ్డ వద్ద కుంగిన పిల్లర్లకు రిపేర్ చేయొచ్చని ఎన్‌డీఎస్ తన నివేదికలో చెప్పిందని.. మేడిగడ్డకు రిపేరు చేయమని కేంద్రమంత్రి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ఎందుకు అడగడం లేదని మాజీమంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ప్రశ్నించారు. సోమవారం తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. మేడిగడ్డకు రిపేర్ చేయమని కోరితే ప్రజలు సంతోషించే వాళ్లని.. రిపేర్ చేయకుండా గోదావరి నీళ్లు కిందకు పంపించడమే బండి సంజయ్ ఉద్దేశమా? అని ప్రశ్నించారు. సంజయ్ కాళేశ్వరం ప్రాజెక్టుపై అసత్యాలు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం నడుస్తుందా ఎన్డీఏ ప్రభుత్వం నడుస్తున్నదా అనే అనుమానం వస్తున్నదన్నారు. దేశంలో ఎన్ని పెద్ద ప్రాజెక్టులు ఉన్నా.. వాటికంటే తక్కువ ఖర్చు ఈ ప్రాజెక్టుకు చేశామని వెల్లడించారు. లక్ష కోట్ల కన్నా తక్కువ ఖర్చు అయిన కాళేశ్వరం ప్రాజెక్టులో లక్ష కోట్ల అవినీతి జరిగిందని ఎలా అంటారని ప్రశ్నించారు.

రేవంత్ హయాంలో ఎస్ఎల్‌బీసీ కుప్పకూలిందని, సుంకిశాల దెబ్బతిన్నదని, వట్టెం మునిగిపోయిందని, పెద్ద వాగు కొట్టుకుపోయిందని.. అయినా బీజేపీ ఎందుకు విచారణ కోరడం లేదని నిలదీశారు. బీజేపీ, కాంగ్రెస్ మైత్రి బంధం బలపడ్డదని.. అందుకే రేవంత్ ప్రభుత్వ తప్పిదాలను బీజేపీ ప్రశ్నించడం లేదని ఆరోపించారు. సంజయ్ మంత్రిగా మాట్లాడితే అర్థం ఉంటుందని.. ఓ బీజేపీ కార్యకర్తగా మాట్లాడితే ఇలాంటి అబద్ధాలే వస్తాయని అన్నారు. మాజీ ఎంపీ బి.వినోద్ కుమార్ మాట్లాడుతూ.. బండి సంజయ్‌ది అవగాహనా రాహిత్యమన్నారు. కేసీఆర్‌ను తిట్టేందుకే పుట్టినట్టుగా ఆయన మాట్లాడుతుంటారని.. ద్వేషాన్ని నింపుకుని వాస్తవాలు దాచి కేసీఆర్‌పై విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు. ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు కట్టకముందే అంచనావ్యయం రూ.40 వేల కోట్లకు పెంచిన ఘనత కాంగ్రెస్ పార్టీదని.. ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం పెంపు గురించి సంజయ్ ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. ఇద్దరు కేంద్ర మంత్రులుగా ఉన్నారని.. తుమ్మిడిహెట్టి దగ్గర 152 మీటర్ల వద్ద రేవంత్‌తో కలిసి అనుమతి తీసుకురావాలని సవాల్ చేశారు.

ఎమ్మెల్సీ డాక్టర్ దాసోజు శ్రవణ్ మాట్లాడుతూ.. ఈటెల రాజేందర్‌తో అధ్యక్ష పదవిపై ఉన్న పేచీతోనే బండి సంజయ్ కాళేశ్వరంపై విషం గక్కారని ఆరోపించారు. బీజేపీ నేతలందరూ ఒక చోట సంకల్ప సభ పెట్టుకుంటే సంజయ్ ఆ మీటింగ్‌కు పోకుండా తన ఎజెండాను తెరపైకి తెచ్చారని పేర్కొన్నారు. రేవంత్ రిమోట్ ఎత్తితే ఎగిరే తోలుబొమ్మ బండి సంజయ్ అని అన్నారు. అమిత్ షా వీడియో మార్ఫింగ్ చేసి పోస్ట్ చేసిన కేసు రేవంత్‌పై ఉందని.. దాని గురించి ఎందుకు మాట్లాడడం లేదని నిలదీశారు. ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ.. కరీంనగర్ ఎంపీగా సంజయ్ గెలవడమే ఓ శాపమని అన్నారు. కాళేశ్వరంతో ఆయకట్టు పెరిగిందో లేదో కరీంనగర్ చౌరస్తాలో చర్చ పెడుదామని సవాల్ విసిరారు. సమావేశంలో ఎమ్మెల్యే డాక్టర్ కె.సంజయ్ పాల్గొన్నారు.

Next Story