ప్రధానిని నిలదీసే దమ్ములేదా?.. బీజేపీ ఎంపీలపై మాజీ మంత్రి వేముల ఫైర్

by Gantepaka Srikanth |

రీజినల్ రింగ్ రోడ్డు పనులపై మాటలు చెప్తూనే ఉన్నార తప్ప ఇప్పటికీ పనులు ప్రారంభం కాలేదని మాజీమంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌ రెడ్డి అన్నారు.

ప్రధానిని నిలదీసే దమ్ములేదా?.. బీజేపీ ఎంపీలపై మాజీ మంత్రి వేముల ఫైర్
X

దిశ, తెలంగాణ బ్యూరో: రీజినల్ రింగ్ రోడ్డు పనులపై మాటలు చెప్తూనే ఉన్నార తప్ప ఇప్పటికీ పనులు ప్రారంభం కాలేదని మాజీమంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌ రెడ్డి అన్నారు. మంగళవారం ఆయన తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడారు. కేంద్రంలో ఉన్న బీజేపీ, రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం సాగదీస్తూ తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్నాయని అన్నారు. 8 బీజేపీ, 8 మంది కాంగ్రెస్ ఎంపీలు ఉన్నా కేంద్ర ప్రభుత్వాన్ని, ప్రధాని మోడీని నిలదీసే దమ్ములేదని అన్నారు. నితిన్ గడ్కరీని కలిసి ఇగో అయిపోతుంది.. అగో అయిపోతుంది అంటారు కానీ అది అయింది లేదు పోయింది లేదని అన్నారు. రాష్ట్ర సాధన తరువాత కేసీఆర్ మదిలో నుండి పుట్టిన ప్రాజెక్ట్ ట్రిపుల్ ఆర్ ప్రాజెక్ట్ గురించి 2015 నుండి కేంద్ర ప్రభుత్వాన్ని కేసీఆర్ అడుగుతూనే ఉన్నారని అన్నారు. 2017లో సూత్రప్రాయంగా అంగీకరించారని.. 2018లో డీపీఆర్ పంపించడం జరిగిందని అన్నారు.

అప్రూవ్ చేశాక మళ్లీ తిరకాసు పెట్టారని తెలిపారు. ల్యాండ్ సేకరణకు మళ్లీ మోకాలు అడ్డుపెట్టారని.. భూ సేకరణకు ముందే రెండు వేల కోట్లు ఇవ్వాలని పెట్టారని ఆరోపించారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రెండేళ్లలో ఒక్క రూపాయి ఖర్చు చేయలేదని.. ఒక్క ఎకరా భూ సేకరణ చేయలేదని అన్నారు. తాము తెచ్చిన రూ.3వేల కోట్లు ఎటుపోయాయని ప్రశ్నించారు. రైతులకు డబ్బులు ఇవ్వకుండా భూ సేకరణ ఎలా సాధ్యమని నిలదీశారు. నార్త్ సైడ్ రింగ్ రోడ్డుకు టెండర్లు పిలిచారని.. ఇప్పటికీ 3 సార్లు టెండర్లు ఓపెన్ చేయలేదని ఆరోపించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమాధానం చెప్పాలన్నారు. రేవంత్‌రెడ్డి సర్కార్ వచ్చాక వాళ్ల భూముల ధరలు పెంచేందుకు నూతన అలైన్మెంట్ మార్పు చేశారని.. కొత్త అలైన్మెంట్ కేంద్రానికి పంపలేదని అన్నారు. రియల్ ఎస్టేట్ దందా కోసం తమకు నచ్చినట్లు అలైన్మెంట్ చేయవద్దని అన్నారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు చింతాప్రభాకర్, లక్ష్మారెడ్డి, కార్పొరేషన్ మాజీ చైర్మన్ కె.వాసుదేవరెడ్డి పాల్గొన్నారు.

Next Story