Srinivas Goud: ఎస్ఎల్‌బీసీలో శవాలు ఇప్పటికీ తీయలేదు

by Gantepaka Srikanth |

ఉమ్మడి పాలమూర్ జిల్లాకు ఎవరు వచ్చిన పాలమూరును ఎండబెట్టారని మాట్లాడుతున్నారని.. తాము ఏమీ చేయకపోతే ఈ రెండేళ్లలో కాంగ్రెస్ పాలమూరుకు ఏం చేసిందని మాజీ మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్ ప్రశ్నించారు.

Srinivas Goud: ఎస్ఎల్‌బీసీలో శవాలు ఇప్పటికీ తీయలేదు
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఉమ్మడి పాలమూర్ జిల్లాకు ఎవరు వచ్చిన పాలమూరును ఎండబెట్టారని మాట్లాడుతున్నారని.. తాము ఏమీ చేయకపోతే ఈ రెండేళ్లలో కాంగ్రెస్ పాలమూరుకు ఏం చేసిందని మాజీ మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్ ప్రశ్నించారు. సోమవారం ఆయన తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడారు. తాము ఏం చేయకుంటే నెట్టెంపాడు, బీమా, కోయిలసాగర్ నుంచి నీళ్లు ఎలా వస్తున్నాయని ప్రశ్నించారు. 90 శాతం పూర్తయిన పాలమూర్-రంగారెడ్డి ప్రాజెక్టును ఎందుకు మిగితా 10 శాతం పూర్తిచేయడం లేదని నిలదీశారు. ఇరిగేషన్ మంత్రికి నీటిపై చిత్తశుద్ధి లేదన్నారు. ఎస్ఎల్‌బీసీలో ఇప్పటివరకు శవాలు బయటకి తీయలేదని.. ఒక్క సమీక్ష అయినా చేయడం లేదని అన్నారు. తాము చేసిన అభివృద్ధికి ప్రతి రూపాయి లెక్క తమ వద్ద ఉందని చెప్పారు. కాళేశ్వరం కమిషన్ నివేదిక ఇవ్వకముందే లీక్‌లు ఇస్తున్నారని ఆరోపించారు. కేసీఆర్‌పై కేసు అవుతదని.. ఆయనను బద్నాం చేయాలని కుట్ర చేస్తున్నారని అన్నారు. కాంగ్రెస్ టార్గెట్ కేసీఆర్ అని.. లక్ష కోట్లు తింటే మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ఎక్కడివి అని నిలదీశారు.

కాంగ్రెస్ ప్రభుత్వంలో నిత్యం కరెంట్ కోతలు ఉంటున్నాయని.. కేసీఆర్‌ను ఏమీ చేయలేరని హెచ్చరించారు. తాము న్యాయ పోరాటానికి వెళ్తామని.. కాళేశ్వరం వద్దనే హరీశ్‌రావు పడుకొని పనులను పరిశీలించి అక్కడే ఉండి కట్టించారని స్పష్టం చేశారు. మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి మాట్లాడుతూ.. ఉమ్మడి పాలమూరు జిల్లాలో పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేసింది కేసీఆరే అని చెప్పారు. కొడంగల్ నారాయణపేట లిఫ్ట్‌కు ఏ అనుమతులు లేవని.. భూ సేకరణ అడ్డగోలుగా చేస్తున్నారని ఆరోపించారు. పాలమూరు-రంగారెడ్డితో మక్తల్‌లో 63వేల ఎకరాలకు నీళ్లు వచ్చే అవకాశం ఉందని.. కొడంగల్ లిఫ్ట్‌తో 13 వేల ఎకరాలకు కూడా నీళ్లు రావని చెప్పారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ నవీన్‌కుమార్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే నరేందర్‌రెడ్డి, శాట్స్ మాజీ చైర్మన్ అల్లీపురం వెంకటేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు.

Next Story