- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గ్రామ పంచాయతీల అభివృద్ధి నిలిచిపోయింది.. మంత్రి సీతక్కకు హరీశ్‌రావు లేఖ
నిధులు విడుదల లేకపోవడంతో గ్రామ పంచాయతీల అభివృద్ది ఎక్కడిక్కడే నిలిచిపోయిందని మాజీ మంత్రి హరీశ్‌రావు (Harish Rao) ఆవేదన వ్యక్తం చేశారు.

దిశ, డైనమిక్ బ్యూరో: నిధులు విడుదల లేకపోవడంతో గ్రామ పంచాయతీల అభివృద్ది ఎక్కడిక్కడే నిలిచిపోయిందని మాజీ మంత్రి హరీశ్‌రావు (Harish Rao) ఆవేదన వ్యక్తం చేశారు. అందుకు సంబంధించిన నిధులను వెంటనే విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఇవాళ (ఆదివారం) పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క (Seethakka)కు లేఖ రాశారు. గ్రామాల సమగ్ర అభివృద్ధిలో భాగంగా 2019లో బీఆర్ఎస్ ప్రభుత్వం 9,350 మంది జూనియర్ పంచాయతీ కార్యదర్శులను నియమించిందని గుర్తుకు చేశారు. గ్రామ పంచాయతీల అభివృద్ధి కోసం వారు ఎంతో శ్రమించారని తెలిపారు. గ్రామ పంచాయతీలకు సకాలంలో నిధులు మంజూరు చేయడం, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, గ్రామ పంచాయతీ అధికారుల కృషి వల్ల తెలంగాణ గ్రామాలు అభివృద్దిలో దేశానికే ఆదర్శంగా నిలిచాయన్నారు.
అయితే, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి పరిస్థితులు ఇందుకు భిన్నంగా మారాయన్నారు. వీధి దీపాల నిర్వహణ లేక పల్లెలు అంధకారంలో ఉంటున్నాయని ఆరోపించారు. చివరకు బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన ట్రాక్టర్లలో డీజిల్ పోయించలేక, ఆర్టీఏ టాక్స్ కట్టలేక అధికారులకు తాళాలు అప్పగిస్తున్న దుస్థితి వచ్చిందన్నారు. చేసిన పనులకు గాను మాజీ సర్పంచులు, పంచాయతీ కార్యదర్శుల పెండింగ్ బిల్లులు విడుదల చేయాలని రిక్వెస్ట్ చేశారు. “అభయహస్తం” మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం, ఔట్‌సోర్సింగ్ విధానంలో పనిచేస్తున్న పంచాయతీ కార్యదర్శులను జూనియర్ పంచాయతీ కార్యదర్శులుగా క్రమబద్ధీకరించాలని విజ్ఞప్తి చేశారు.
వానాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా గ్రామాల్లో స్పెషల్ డ్రైవులు నిర్వహించి, పారిశుద్ధ్యం పెంపొందించాలని కోరారు. గత మూడు నెలలుగా పారిశుధ్య కార్మికులకు వేతనాలు రాక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వెంటనే వారికి వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. గతేడాది నవంబర్ లో నిర్వహించిన ఇంటింటి కుటుంబ సర్వే డేటా ఎంట్రీ ఆపరేటర్లకు ఇప్పటి వరకు వేతనాలు చెల్లించకపోవడం శోచనీయమని వారికి వెంటనే వేతనాలు విడుదల చేయాలని లేఖలో పేర్కొన్నారు.






