బిడ్డా బబ్లూ మా ప్రభుత్వం వచ్చాక నీకుంటది.. పోలీసు అధికారికి హరీశ్ రావు మాస్ వార్నింగ్

by Prasad Jukanti |

బీఆర్ఎస్ కార్యకర్తలపై అక్రమ కేసులు పెడితే చూస్తూ ఊరుకోమని, భవిష్యత్తులో అధికారుల సంగతి తేలుస్తామని హరీశ్ రావు హెచ్చరించారు.

బిడ్డా బబ్లూ మా ప్రభుత్వం వచ్చాక  నీకుంటది.. పోలీసు అధికారికి హరీశ్ రావు మాస్ వార్నింగ్
X

దిశ, డైనమిక్ బ్యూరో: ప్రజా సమస్యలపై సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్న బీఆర్ఎస్ కార్యకర్తలపై కొంత మంది పోలీసులు అక్రమంగా కేసులు పెట్టి కొడుతున్నారని, బీఆర్ఎస్ అధికారంలోకి రాగానే అలాంటి అధికారులందరి సంగతి చెబుతామని మాజీ మంత్రి హరీశ్ రావు హెచ్చరించారు. ఇవాళ పెద్దపల్లి పట్టణంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమావేశంలో మాజీ మంత్రి హరీశ్ రావు పాల్గొని మాట్లాడారు. పెద్దపల్లి జిల్లాలో బబ్లూ అనే నిక్ నేమ్ కలిగిన ఓ పోలీసు అధికారి మా బీఆర్ఎస్ కార్యకర్త శ్రీకాంత్‍పై కేసు పెట్టి కొట్టాడని తెలిసింది. 'బిడ్డా బబ్లూ రేపు బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక మా శ్రీకాంత్ ఎంత బాధ పడ్డాడో ఆ బాధేంటో నీకు రుచి చూపిస్తాం జాగ్రత్త అని హెచ్చరించారు. మర్యాదగా ఉంటే మర్యాద.. రేవంత్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే కానీ ఎవరూ నిన్ను కాపాడలేరు' అని వార్నింగ్ అచ్చారు. ప్రభుత్వ వైఫల్యాలను సోషల్ మీడియాలో ప్రశ్నించినంత మాత్రాన కార్యకర్తలను కొట్టడం సరైంది కాదని, పోలీసు కానిస్టేబుళ్లే మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వం రావాలని కోరుకుంటున్నారన్నారు.

హిట్లర్‍కు పట్టిన గతే రేవంత్‍కు:

హిట్లర్ అంటే ఇష్టం, ఆయనను చూసే హైడ్రా పెట్టాను అని రేవంత్ రెడ్డి స్వయంగా అనడం ఆయన అహంకారానికి, నిరంకుశత్వానికి నిదర్శనమని హరీశ్ రావు విమర్శించారు. నాడు హిట్లర్ పేదలను ఊచకోత కోస్తే, నేటి నయా హిట్లర్ రేవంత్ రెడ్డి పేదల ఇళ్లను కూలుస్తూ వారి బతుకులను ఆగం చేస్తున్నారని మండిపడ్డారు. హిట్లర్‍కు పట్టిన గతే రేవంత్ రెడ్డికి పట్టబోతోందని, హిట్లర్ దురాగతాలకు నేటికీ జర్మనీ క్షమాపణలు చెబుతున్నట్లే, భవిష్యత్తులో రేవంత్ రెడ్డి పాపాలకు కాంగ్రెస్ పార్టీ కూడా ప్రజలకు క్షమాపణలు చెప్పక తప్పదని హెచ్చరించారు. రెండున్నరేళ్ల రేవంత్ రెడ్డి పాలన చూసిన తర్వాత, కాంగ్రెస్ పోవాలి.. కేసీఆర్ రావాలి అని ప్రజలు కోరుకుంటున్నారని హరీశ్ రావు స్పష్టం చేశారు. రేవంత్ రెడ్డి తలకిందులుగా తపస్సు చేసినా రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ 100 సీట్లు సాధించడం ఖాయమన్నారు.

మళ్ళీ పాత రోజులు:

కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఒక్క హామీ కూడా అమలు చేయలేదని, 30 లక్షల మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్ ఆపి వారి భవిష్యత్తును రేవంత్ రెడ్డి ఆగం చేశారని విమర్శించారు. వడ్లు అమ్ముకోవడానికి రైతులు 45 రోజుల పాటు కల్లాల వద్ద పడిగాపులు కాశారని, నేటికీ 30 శాతం వడ్లు కల్లాల్లోనే ఉన్నాయని, ప్రభుత్వం ధాన్యం కొనుగోళ్లలో పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు. ఎన్నికల కోసం కాకుండా రైతుల మీద ప్రేమతో కేసీఆర్ రైతుబంధు తీసుకువచ్చారని, కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం యాసంగి పంటకు రైతుబంధు ఎగనామం పెట్టిందని ధ్వజమెత్తారు. దేవుళ్ల మీద ఒట్లు పెట్టి ఆగస్టు కల్లా రుణమాఫీ చేస్తానన్న రేవంత్ రెడ్డి, బడ్జెట్‌లో చెప్పిన 35 వేల కోట్లకు గానూ సగం కూడా రుణమాఫీ చేయకుండా రైతులను మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ పాలనలో మండలానికో గోదాము కట్టి ఎరువుల కొరత లేకుండా చేస్తే, నేడు కాంగ్రెస్ పాలనలో ఎరువుల కోసం మళ్లీ పాత రోజుల తరహాలో క్యూలైన్లు, లాఠీచార్జీల పరిస్థితి దాపురించిందన్నారు.

రైతు డిస్కంతో 8 గంటలే కరెంట్:

గత నాలుగు నెలలుగా ఎల్ఐసీకి ప్రీమియం కట్టకపోవడం వల్ల రాష్ట్రంలో 3 వేల మంది రైతులు చనిపోయినా రైతు బీమా రాకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి కొత్తగా తెస్తున్న 'రైతు డిస్కం' జీవో నంబర్ 8 వల్ల వ్యవసాయానికి కేవలం పగటి పూట 7 నుంచి 8 గంటల పాటు మాత్రమే కరెంటు వస్తుందని, కేసీఆర్ ఇచ్చిన 24 గంటల ఉచిత కరెంటుకు ఉరి వేయబోతున్నారని హెచ్చరించారు. కేసీఆర్ పాలనలో పెద్దపల్లి జిల్లాలో ఎకరం భూమి 50 నుంచి 60 లక్షలు ఉంటే, నేడు కాంగ్రెస్ పాలనలో సగానికి పడిపోయిందని, రైతుతో పాటు రైతుల భూముల విలువ కూడా తగ్గిపోయిందని హరీశ్ రావు గారు విమర్శించారు. భూముల ధరలు, రిజిస్ట్రేషన్ ఫీజులు, ఆర్టీఏ ట్యాక్స్‌లు, మద్యం ధరలు విపరీతంగా పెంచిన కాంగ్రెస్ ప్రభుత్వం, ప్రజలకు ఇచ్చే పథకాలను మాత్రం ఎగ్గొట్టిందని దుయ్యబట్టారు. తులం బంగారం ఇస్తామని మోసం చేయడంతో పాటు, విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ ఆపేసి పేదల పిల్లల చదువులను దూరం చేసిందని ఆరోపించారు.

పార్టీ క్లిష్ట సమయంలో నిలబడ్డవారే దేవుళ్లు:

కష్టకాలంలో పార్టీని వీడి వెళ్లిన వారిని మళ్లీ తిరిగి చేర్చుకునే ప్రసక్తే లేదని, ఈ క్లిష్ట సమయంలో అండగా నిలబడ్డ కార్యకర్తలే తమకు దేవుళ్లని, వారిని గుండెల్లో పెట్టుకుని కాపాడుకుంటామని హరీశ్ రావు గారు భరోసా ఇచ్చారు. కార్యకర్తలకు మనోధైర్యాన్ని నింపేలా నాయకులందరూ విభేదాలు పక్కనపెట్టి ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై పోరాడాలని పిలుపునిచ్చారు. పోలీసుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోందని, కేసీఆర్ హయాంలో ఇచ్చిన సరెండర్ లీవ్స్, టీఏ బిల్లులు, స్టేషన్ అలవెన్స్‌లు ఇప్పుడు ఆగిపోయాయని, ఆరోగ్య భద్రతను కూడా రద్దు చేసి కొత్తగా జీతంలో 1.5 శాతం కోత పెడుతున్నారని విమర్శించారు. అందుకే కింది స్థాయి కానిస్టేబుల్ నుంచి రైతులు, విద్యార్థుల వరకు ప్రతి ఒక్కరూ మళ్లీ కేసీఆర్ రావాలనే కోరుకుంటున్నారని స్పష్టం చేశారు.

Next Story