విశ్రాంత ఉద్యోగి మాటలు వింటే మనస్సు చలించిపోతున్నది: హరీశ్ రావు

by Prasad Jukanti |   (  Updated:2025-11-22 09:35:15  IST  )

మూటలు, కోతలు, వాటాలు.. కమీషన్ల గురించి మాత్రమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పని చేస్తున్నారని హరీశఅ రావు ఆరోపించారు.

విశ్రాంత ఉద్యోగి మాటలు వింటే మనస్సు చలించిపోతున్నది: హరీశ్ రావు
X

దిశ, తెలంగాణ బ్యూరో/డైనమిక్ బ్యూరో: ఉద్యోగులు, ఉపాధ్యాయుల పట్ల ఏమాత్రం ప్రేమ ఉన్నా వెంటనే రిటైర్మెంట్ బెనిఫిట్స్ ను చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు డిమాండ్ చేశారు. రిటైర్మెంట్ బెనిఫిట్స్ కోసం నెలలు తరబడి ఎదురు చూస్తూ ఓపిక నశించిందంటూ ఓ రిటైర్డ్ ఉద్యోగి వీడియో రూపంలో తన ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం పైరవీకారులు, పలుకుపడి ఉన్న వారికి మాత్రమే రిటైర్మెంట్ బెనిఫిట్స్ వస్తున్నాయని ఆ వీడియోలో ఆయన ఆరోపించారు. దీనిపై స్పందించిన హరీశ్ రావు.. ఈ విశ్రాంత ఉద్యోగి మాటలు వింటే మనస్సు చలించిపోతున్నదని.. మూటలు, కోతలు, వాటాలు, కమీషన్ల గురించి మాత్రమే పనిచేసే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీకు రిటైర్డ్ ఉద్యోగులు, ఉపాధ్యాయుల కన్నీళ్లు కనిపించడం లేదా? వేదన వినిపించడం లేదా? అని నిలదీశారు.

కమిషన్లు రావనే ఇవ్వడం లేదా?:

ముఖ్యమంత్రి లక్ష కోట్లతో మూసీ సుందరీకరణ, మరో లక్ష కోట్లతో ఫోర్త్ సిటీ, వేల కోట్లతో అక్కరకు రాని చోట ఆరు లైన్ల రోడ్లు వేస్తానంటున్నారు. కమీషన్ల కోసం బడా కాంట్రాక్టర్ల బిల్లులు గ్రీన్ చానెల్‍లో పెట్టి క్లియర్ చేస్తున్నారు. కానీ విశ్రాంత ఉద్యోగులకు మాత్రం రిటైర్మెంట్ బెన్ఫిట్స్ విడుదల చేయడం లేదని ధ్వజమెత్తారు. కమిషన్లు రావని విశ్రాంత ఉద్యోగుల బకాయిలు విడుదల చేయడం లేదా? నీకు ఆ మనసు లేదా? అని నిలదీశారు. 30 ఏళ్లకు పైగా సేవలందించిన ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు మీ ప్రభుత్వం ఇచ్చే గౌరవం ఇదేనా? వారి గోడు ఈ ప్రభుత్వానికి పట్టదా? అని ప్రశ్నించారు. 2024 మార్చి నుంచి రిటైర్ అయిన ఉద్యోగులు, ఉపాధ్యాయులకు బెన్ఫిట్స్ అందక అనేక ఇబ్బందులు ఎదుర్కుంటుంటే ప్రభుత్వం ఏం చేస్తున్నట్లు? సర్వీసులో దాచుకున్న సొమ్మును కూడా తిరిగి ఇవ్వకుండా ప్రభుత్వం వేధిస్తుండటం అమానవీయం, అనైతికం అన్నారు. విశ్రాంతి తీసుకోవాల్సిన సమయంలో రిటైర్డ్ ఉద్యోగులను మానసిక ఒత్తిడికి గురి చేయడం దుర్మార్గం అని మీ నిర్లక్ష్యపూరిత వైఖరి, పట్టింపు లేని తనం వల్ల ఇప్పటికే అనేక మంది విశ్రాంత ఉద్యోగులు మానసిక ఒత్తిడికి గురై ప్రాణాలు కోల్పోయారని ఆరోపించారు.

సీఎం మాటలు నీటి మూటలు:

బకాయిలు క్లియర్ చేసేందుకు ప్రతి నెల రూ.700 కోట్లు విడుదల చేస్తామని చెప్పిన ముఖ్యమంత్రి మాటలు నీటి మూటలే అయ్యాయని దేశంలోనే విశ్రాంత ఉద్యోగులకు రూ. 10,000 కోట్ల బకాయిలు పెట్టిన రాష్ట్రం ఏదీ లేదని ఈ ఘనత కూడా మీకే దక్కింది రేవంత్ రెడ్డి అంటూ విమర్శించారు. హక్కుగా తాము పొందాల్సిన బెనిఫిట్స్ కోసం విశ్రాంత ఉద్యోగులను ప్రభుత్వ కార్యాలయాలు, కోర్టుల చుట్టూ తిరిగేలా, పైరవీలు చేసుకోవాల్సిన దుస్థితిని ఈ ప్రభుత్వం కల్పించిందన్నారు. కుటుంబ సభ్యులతో కలిసి విశ్రాంతి తీసుకోవాల్సిన సమయంలో విశ్రాంత ఉద్యోగులకు అవిశ్రాంత పోరాటం చేయాల్సిన పరిస్థితి కల్పించారని దుయ్యబట్టారు. ప్రజలకు హామీ ఇచ్చి నెరవేర్చని జాబితాలో ఉద్యోగుల పీ‍ఆర్‍సి, డీఏలు కూడా చేరటం దురదృష్టకరం అన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ఉద్యోగులను ప్రభుత్వం దారుణంగా మోసం చేసిందని పీఆర్సీ లేదు, హెల్త్ కార్డులు లేవు, 5 డీఏల జాడే లేదని సీపీఎస్ రద్దుపై నాన్చివేత ధోరణి కొనసాగిస్తున్నారని విమర్శించారు. ప్రతి నెల ఒకటో తేదీన వేతనాలు చెల్లిస్తామని గొప్పలు చెప్పి, ఆచరణలో మాత్రం గాలికి వదిలేశారని విమర్శించారు. రెండు మూడు నెలలు జీతాలు అందక ఎంతో మంది ఉద్యోగులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మీ మాటల మాయాజాలంతో ఎంతకాలం ఉద్యోగులు, టీచర్లను మోసం చేస్తారని ప్రశ్నించారు. వీడియో

Next Story