- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సచివాలయంలో మాజీ మావోయిస్టులకు సాదర స్వాగతం.. గతంలో ఎంట్రీ ఉండేది కాదు!
కేంద్ర చేపట్టిన ఆపరేషన్ కగార్ చివరి అంకానికి చేరడంతో మావోయిస్టు పార్టీ అగ్రనేతలు జన జీవన స్రవంతిలో కలుస్తున్నారు.

దిశ, తెలంగాణ బ్యూరో: కేంద్ర చేపట్టిన ఆపరేషన్ కగార్ చివరి అంకానికి చేరడంతో మావోయిస్టు పార్టీ అగ్రనేతలు జన జీవన స్రవంతిలో కలుస్తున్నారు. ఇటీవలే నలుగురు సీనియర్ నేతలు తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్‌జీ, మల్లా రాజిరెడ్డి అలియాస్ సంగ్రామ్, బడే చొక్కారావు అలియాస్ దామోదర్, నూనె నరసింహారెడ్డి అలియాస్ గంగన్న డీజీపీ శివధర్‌రెడ్డి ఎదుట లొంగిపోయిన విషయం తెలిసిందే. ఆ తర్వాత వారు తమ కుటుంబ సభ్యులను కలుసుకున్నారు. తాజాగా ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో ఆరుగురు మాజీ మావోయిస్టులు భేటీ అయ్యారు. హైదరాబాద్ సచివాలయంలో ముఖ్యమంత్రితో దేవ్‌జీ, మల్లా రాజిరెడ్డి, సుజాతక్క, దామోదర్, చంద్రన్న, నూనె నరసింహారెడ్డి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పలు అంశాలపై కీలక చర్చలు జరిగినట్లు తెలిసింది. ప్రధానంగా పొలిటికల్ ఎజెండాపై చర్చ జరుగుతునట్లు తెలుస్తున్నది. ఎందుకంటే.. సచివాలయంలోకి వెళ్తున్నప్పుడు సీఎంతో ఏం చర్చిస్తారని మీడియా ప్రతినిధులు అడగ్గా.. పొలిటికల్ ఎజెండా అని దేవ్‌జీ చెప్పారు.
ప్రజా సమస్యలపై సీఎం ఆరా..!
మరోవైపు మావోయిస్టు పార్టీ పరిస్థితి, లొంగిపోయిన వారికి ప్రభుత్వ సాయం, ప్రజా సమస్యలపై మాట్లాడుతున్నట్లు సమాచారం. గతేడాది అక్టోబర్‌లో లొంగిపోయిన మావోయిస్టు పార్టీ తెలంగాణ కమిటీ సభ్యుడు బండి ప్రకాష్ తన ఆరోగ్యం, ఆర్థిక సమస్యలపై ఇటీవల ఆయన ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఇలా లొంగిపోయిన వారికి ప్రభుత్వం నుంచి అందుతున్న సాయం, అజ్ఞాతం వీడి జన జీవన స్రవంతిలో కలిసిన వారి జీవన స్థితిగతులు, తమ కోసం ఓ సంక్షేమ పథకం తీసుకురావాలని మాజీ మావోయిస్టు నేతలు సీఎంను కోరనున్నట్లు సమాచారం. అడవుల్లో ఉన్నప్పుడు మావోయిస్టుల దృష్టికి వచ్చిన ప్రజా సమస్యలు ఏమిటనే దానిపై సీఎం రేవంత్ ఆరా తీసే అవకాశం ఉన్నది.
వారి కోసం ప్రత్యేక పథకం?
మాజీ మావోయిస్టు అగ్రనేతలు ముఖ్యమంత్రితో భేటీ అనంతరం లొంగిపోయిన మావోయిస్టుల సంక్షేమం కోసం ఏదైనా ప్రకటన చేసే అవకాశం ఉన్నట్టు కనిపిస్తోంది. ఆపరేషన్ కగార్ సమయంలో కాంగ్రెస్ పార్టీ మావోయిస్టులపై మెరుపు దాడులను ఖండించింది. సీఎం రేవంత్‌రెడ్డి సైతం మావోయిస్టులు శాంతియుతంగా లొంగిపోవాలని కోరారు. ఈ క్రమంలో తెలంగాణ పోలీసుల ఎదుట పలువురు నక్సలైట్లు లొంగిపోయిన విషయం తెలిసిందే.
గతంలో నిషేధం.. నేడు సాదర స్వాగతం..
గతంలో సచివాలయంలోకి మాజీ మావోయిస్టులకు ఎంట్రీ ఉండేది కాదు. ఆ సమయంలో అటు వైపు మాజీ మావోయిస్టులు, సానుభూతిపరులు వస్తే రెక్కీ నిర్వహిస్తున్నారనే నెపంతో అరెస్ట్ చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. కానీ, తాజాగా ఎంట్రీ లేని మాజీ మావోయిస్టు నేతలకు సచివాలయంలోకి సాదర స్వాగతం పలకడం ప్రాధాన్యత సంతరించుకుంది.






