అందరి ఫోకస్ ఆ సీటుపైనే.. బరిలో బంధువులు, మాజీలు, అసెంబ్లీ ఎన్నికల నిరాశవహులు

by Naga Rani Yarlagadda |

స్థానిక సంస్థల షెడ్యూల్ విడుదల, రిజర్వేషన్లపై క్లారిటీ రావడంతో జెడ్పీ చైర్మన్​స్థానాన్ని ఆశించే వారి సంఖ్య పెరిగిపోతున్నది.

అందరి ఫోకస్ ఆ సీటుపైనే.. బరిలో బంధువులు, మాజీలు, అసెంబ్లీ ఎన్నికల నిరాశవహులు
X

దిశ, తెలంగాణ బ్యూరో : స్థానిక సంస్థల షెడ్యూల్ విడుదల, రిజర్వేషన్లపై క్లారిటీ రావడంతో జెడ్పీ చైర్మన్​స్థానాన్ని ఆశించే వారి సంఖ్య పెరిగిపోతున్నది. అనేక జిల్లాల్లో మంత్రులు, ఎమ్మెల్యేల కుటుంబ సభ్యులు బరిలో దిగేందుకు ఉత్సాహం చూపుతుండగా.. మరోవైపు మాజీలు, వారి ఫ్యామిలీ మెంబర్స్ సైతం పోటీ చేసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. ముఖ్యంగా అందరి చూపు జెడ్పీ చైర్మన్ పీఠంపైనే ఉండటంతో ఆశవహుల సంఖ్య పెరిగిపోతున్నది.

బరిలో వేంనరేందర్ రెడ్డి కుమారుడు!

ములుగు నియోజకవర్గంలోని గంగారం మండల జెడ్పీటీసీ స్థానం జనరల్‌కు కేటాయించారు. ఇక్కడ నుంచి పోటీ చేసే వారికి జెడ్పీ చైర్మన్​పదవి దక్కుతుందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతున్నది. వేం నరేందర్‌రెడ్డి కుమారుడిని వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయించాలనే ఆలోచన ఉందని ఆయన ప్రధాన అనుచరులు స్థానికంగా చర్చించుకుంటున్నారు. జెడ్పీ చైర్మన్​జనరల్‌కు రిజర్వ్​కావడంతో ఇప్పుడే రాజకీయ రంగ ప్రవేశం చేయించి అసెంబ్లీ ఎన్నికల నాటికి బలమైన పునాది వేయించాలని ఆయన ఆలోచిస్తున్నట్టు ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. మంత్రి సీతక్కను ఒప్పించి ఆయన్ను జెడ్పీటీసీగా పోటీ చేయిస్తారని ప్రచారం సాగుతున్నది. కానీ, దీనిపై ఇప్పటి వరకు వేం నరేందర్ రెడ్డి ఎలాంటి స్పష్టతా ఇవ్వలేదు. భూపాలపల్లి జెడ్పీ పదవి బీసీ జనరల్‌ కావడంతో మాజీ నక్సలైట్​గాజర్ల అశోక్‌‌ను చైర్మన్ చేయాలనే ఆలోచన ఉందని అధికార పార్టీ వర్గాల ద్వారా తెలిసింది.

ఆసక్తిగా కామారెడ్డి జెడ్పీ

కామారెడ్డి జిల్లా జెడ్పీ చైర్మన్ సీటు జనరల్‌కు రిజర్వ్ అయ్యింది. దీంతో కాంగ్రెస్ నుంచి బాన్సువాడ ఎమ్మెల్యే, మాజీ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి కుమారుడు పోచారం భాస్కర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డి ప్రధాన పోటీదారులుగా ఉన్నారు. బీర్కూర్, జుక్కల్ నియోజకవర్గంలోని బిచ్కుంద జెడ్పీటీసీ స్థానాలు జనరల్‌కు రిజర్వ్ కావడంతో భాస్కర్‌రెడ్డి బీర్కూర్ నుంచి జెడ్పీటీసీగా పోటీ చేసి జెడ్పీ చైర్మన్ రేసులో ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్టు తెలిసింది. ఏనుగు రవీందర్‌రెడ్డి సొంత మండలం తాడ్వాయి జెడ్పీటీసీ స్థానం సైతం జనరల్‌‌కు రిజర్వ్ అయ్యింది. ఆయన అక్కడి నుంచి పోటీ చేసి జెడ్పీ చైర్మన్ పదవి రేసులో ఉండే చాన్స్ ఉన్నట్టు సమాచారం. బీఆర్ఎస్ నుంచి కామారెడ్డి మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ కుమారుడు గంప శశాంక్‌ పోటీ పడేందుకు ఆసక్తి చూపుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో కామారెడ్డి సీటును కేసీఆర్ కోసం త్యాగం చేసినప్పుడు కేసీఆర్ గంప గోవర్ధన్‌కు.. జెడ్పీ చైర్మన్ పోస్టుపై హామీ ఇచ్చినట్లు టాక్. ఇక నిజామాబాద్ జిల్లాలో జెడ్పీ చైర్మన్ సీటు బీసీ (మహిళ)కు రిజర్వ్ అయింది. దీంతో కాంగ్రెస్ నుంచి మాజీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ ఆకుల లలిత పేరు ప్రధానంగా వినిపిస్తున్నది. బీఆర్ఎస్ నుంచి మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ కుటుంబం నుంచి ఒకరిని బరిలో దింపే అవకాశాలున్నట్లు ప్రచారం జరుగుతున్నది. బాజిరెడ్డి గోవర్ధన్ కోడలు, లేదంటే ఆయన భార్యను ఒప్పించి పోటీలో దింపే అవకాశాలున్నట్లు పార్టీ నాయకులు చెబుతున్నారు.

సంగారెడ్డి బరిలో మంత్రి దామోదర కూతురు

సంగారెడ్డి జెడ్పీ స్థానం ఎస్సీ జనరల్‌కు రిజర్వ్​అయింది. ఈ స్థానం కోసం మంత్రి దామోదర రాజనర్సింహ.. తన కూతురు త్రిషను బరిలోకి దింపే ప్రయత్నం చేస్తున్నట్టు సమాచారం. ఆమె ఆందోలు నియోజకవర్గంలోని చౌటకూరు నుంచి జెడ్పీటీసీగా పోటీ చేసే అవకాశం ఉందని పార్టీ నాయకులు చెబుతున్నారు. ఆందోలు మాజీ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ తమ్ముడు రాహుల్ సైతం పోటీలో ఉండనున్నట్టు సమాచారం. ఆయన మునిపల్లి, లేదా చౌటకూరులో.. త్రిషపై పోటీ చేయొచ్చని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. మెదక్ జిల్లా పరిషత్ జనరల్​కేటగిరికి రిజర్వ్​కావడంతో నర్సాపూర్ మాజీ ఎమ్మెల్యే మదన్‌రెడ్డి చైర్మన్ పదవి ఆశిస్తున్నారు. గతంలో తనకు తగిన గుర్తింపు ఇస్తామని రేవంత్‌రెడ్డి హామీనిచ్చారని చెబుతున్నారు. ఇదే స్థానం కోసం మెదక్ మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి సైతం బీఆర్ఎస్ నుంచి బరిలో ఉంటబోతున్నారని టాక్.

ఖమ్మంలో ఎవరికి?

ఖమ్మం జెడ్పీ చైర్మన్ స్థానం ఎస్టీ జనరల్ కావడంతో ఆ సామాజిక వర్గానికి చెందిన రాజకీయ నేతలు ప్రయత్నాలు మొదలు పెట్టారు. ఇందులో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అనుచరులుగా ఉన్న విజయబాయి పేరు ప్రముఖంగా వినిపిస్తున్నది. గతంలో అసెంబ్లీ ఎన్నికల్లో వైరా నియోజకవర్గం నుంచి ఆమె కాంగ్రెస్​టిక్కెట్ కోసం ప్రయత్నాలు చేశారు. చివరి నిమిషంలో విజయబాయికి టిక్కెట్టు దక్కలేదు. భవిష్యత్‌లో న్యాయం చేస్తామంటూ పార్టీ, పొంగులేటి శ్రీనివాసరెడ్డి హామీ ఇవ్వడంతో ఆమె వెనక్కి తగ్గారు. ప్రస్తుతం ఖమ్మం జెడ్పీ చైర్మన్ ఎస్టీ జనరల్ కావడంతో ఆమె పేరు ప్రధానంగా వినిపిస్తోంది.‌ మరోవైపు డిప్యూటీ సీఎం భట్టి మాత్రం ఆయన అనుచరుడు బాలాజీ పేరు ప్రతిపాదిస్తున్నట్టు సమాచారం.

పొత్తులో ఎవరికో కొత్తగూడెం..!

కొత్తగూడెం జిల్లా పరిషత్ చైర్మన్ స్థానాన్ని కైవసం చేసుకునేందుకు అధికార పార్టీ పావులు కదుపుతున్నది. కాంగ్రెస్‌తో సీపీఐ పొత్తు పెట్టుకుని 12 స్థానాల వరకు పోటీ చేయనున్నట్టు తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు తుళ్లూరు బ్రహ్మయ్యను ఏదో స్థానం నుంచి జెడ్పీటీసీగా పోటీ చేయించి చైర్మన్ పదవి ఇస్తారనే చర్చ పార్టీలో నడుస్తున్నది. సుజాతనగర్ జెడ్పీ స్థానం బీసీ కావడంతో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు నాగ సీతారాములు అక్కడి నుంచి పోటీ చేసి జెడ్పీ చైర్మన్ పదవి రేసులో ఉండేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తున్నది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిషత్ చైర్మన్ పదవి జనరల్ కావడంతో ప్రతి ఒక్కరూ జెడ్పీ స్థానం వైపు ఆశ చూపుతున్నట్లు తెలుస్తున్నది. జిల్లాలో సీపీఐ బలంగా ఉన్న 10 నుంచి 12 స్థానాల్లో ఆ పార్టీ పోటీ చేసేందుకు సిద్ధపడుతున్నట్లు ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. జెడ్పీ ఎలక్షన్లలో కొత్తగూడెం జిల్లాలో సీపీఐ, కాంగ్రెస్ కలిసి పోటీ చేస్తున్నట్లు తెలుస్తుంది.

యాదయ్య కుటుంబం నుంచే..

రంగారెడ్డి జిల్లా జెడ్పీ చైర్మన్‌ పదవి ఈ సారి ఎస్సీ మహిళకు రిజర్వ్ అయింది. చేవెళ్ల (ఎస్సీ నియోజకవర్గం) ఎమ్మెల్యే కాలే యాదయ్య వారసులు చైర్మన్‌ రేసులో ఉండే అవకాశం ఉందని ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు. ఎమ్మెల్యే కుమారుడు శ్రీకాంత్‌ మొన్నటి వరకు మొయినాబాద్‌ జెడ్పీటీసీగా, ఎమ్మెల్యే భార్య జయమ్మ నవాబ్‌‌పేట జెడ్పీటీసీగా, రెండో కోడలు భవాని నవాబ్‌‌పేట ఎంపీపీగా పని చేశారు. ఈసారి జెడ్పీ చైర్మన్‌ ఎస్సీ మహిళకు రిజర్వ్ కావడంతో తన భార్య లేకుంటే కోడలును బరిలో నిలబెట్టే అవకాశం ఉందని ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు.

భువనగిరి నుంచి విప్​బంధువు

భువనగిరి జిల్లా పరిషత్​బీసీ మహిళకు రిజర్వ్​అయింది. ఇక్కడ కాంగ్రెస్ నుంచి ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య అన్న భార్య బీర్ల శివాణి బరిలో ఉంటారనే ప్రచారం జరుగుతున్నది. దీనికి సంబంధించి అంతర్గతంగా ఏర్పాట్లు జరుగుతున్నాయని సమాచారం. బీఆర్ఎస్ నుంచి ఆలేరు మాజీ ఎమ్మెల్యే భిక్షమయ్యగౌడ్ భార్య బూడిద సువర్ణ బరిలో ఉంటారని పార్టీ నాయకుల ద్వారా తెలిసింది.

Next Story