అడవులే జీవనాధారం - వాటి రక్షణ మనందరి బాధ్యత: మంత్రి కొండా సురేఖ

by Ramesh Naini |

అడవుల పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యతని, అవి మన జీవనానికి పునాదిగా ఉంటాయని మంత్రి కొండా సురేఖ పేర్కొన్నారు.

అడవులే జీవనాధారం - వాటి రక్షణ మనందరి బాధ్యత: మంత్రి కొండా సురేఖ
X

దిశ, తెలంగాణ బ్యూరో: అడవుల పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యతని, అవి మన జీవనానికి పునాదిగా ఉంటాయని మంత్రి కొండా సురేఖ పేర్కొన్నారు. గాలి, నీరు, ఆహారం, జీవరాశులన్నీ ప్రకృతి పైనే ఆధారపడి ఉన్నాయన్నారు. “వృక్షో రక్షతి రక్షితః” అనే సూక్తిని ఉటంకిస్తూ చెట్లను కాపాడితేనే మన భవిష్యత్తు సురక్షితంగా ఉంటుందని తెలిపారు. దూలపల్లి తెలంగాణ అటవీ అకాడమీలో ప్రపంచ అటవీ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. అకాడమీ డైరెక్టర్ ప్రియాంక వర్గీస్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి శ్రీమతి కొండా సురేఖ, అటవీ పర్యావరణ శాస్త్ర సాంకేతిక విభాగం ముఖ్య కార్యదర్శి అహ్మద్ నదీమ్, అటవీ దళాల ముఖ్య సంరక్షణాధికారిణి డా. సీ. సువర్ణ, రాజా బహదూర్ వెంకట రామారెడ్డి పోలీస్ అకాడమీ డైరెక్టర్ అభిలాష్ బిస్త్ పాల్గొన్నారు. అటవీ శాఖ ముఖ్య కార్యదర్శి అహ్మద్ నదీమ్ మాట్లాడుతూ.. అడవులు పర్యావరణ సమతుల్యతకు కీలకమని తెలిపారు. అడవుల సంరక్షణలో ఫ్రంట్‌లైన్ సిబ్బంది చేస్తున్న కృషి ప్రశంసనీయమని కొనియాడారు. అటవీ దళాల ముఖ్య సంరక్షణాధికారిణి డా. సువర్ణ మాట్లాడుతూ అడవులు మానవ జీవితానికి విడదీయలేని భాగమని, మన మనుగడకు అవే జీవనాధారం అన్నారు.

అటవీ-పోలీస్ అకాడమీల మధ్య ఎంవోయూ..

దూలపల్లి తెలంగాణ స్టేట్ ఫారెస్ట్ అకాడమీ (టీజీఎస్‌ఎఫ్ఏ), హిమాయత్ సాగర్‌లోని రాజా బహదూర్ వెంకట రామరెడ్డి తెలంగాణ పోలీస్ అకాడమీ (ఆర్‌బీవీఆర్‌ఆర్‌) మధ్య శిక్షణ, సామర్థ్యాభివృద్ధి రంగాల్లో పరస్పర సహకారం కోసం అవగాహన ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం ప్రకారం సంయుక్త శిక్షణ కార్యక్రమాలు, శిక్షణ సామగ్రి, ఫ్యాకల్టీ మార్పిడి చేపడతారు. ట్రైనీలకు పరస్పర శిక్షణ అవకాశాలు కల్పించి, శాస్త్రీయ, సాంకేతిక సమాచారాన్ని పంచుకోవడం ద్వారా నైపుణ్యాలను పెంపొందించనున్నారు. సమన్వయం కోసం సంయుక్త అకడమిక్ బోర్డు ఏర్పాటు చేయనున్నారు.

గవర్నర్‌ను కలిసిన మంత్రి కొండా సురేఖ..

మంత్రి కొండా సురేఖ సోమవారం లోక్ భవన్‌లో రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్ల ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానంలో మార్చి 27న నిర్వహించనున్న శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవానికి సంబంధించిన ఆహ్వాన పత్రికను ఆలయ అర్చకులు, దేవాదాయ శాఖాధికారులతో కలిసి అందజేశారు. భద్రాచలం శ్రీ సీతారాముల కల్యాణం యొక్క విశిష్టత గురించి కొండా సురేఖ గవర్నర్ కు వివరించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో వైభవంగా జరిగే పవిత్ర వేడుకని, ఈ మహోత్సవానికి దేశం నలుమూలల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో హాజరవుతారని తెలిపారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రభుత్వం తరఫున అన్ని ఏర్పాట్లు పూర్తి స్థాయిలో చేస్తున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య, దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి శైలజ రామయ్యర్, కమిషనర్ హన్మంతరావు, అర్చకులు పాల్గొన్నారు.

Next Story