- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
TG: ప్రభుత్వ ఉపాధ్యాయుల విదేశీ పర్యటన ఖరారు
రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులకు అంతర్జాతీయ స్థాయి విద్యా విధానాలపై అవగాహన కల్పించేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మక నిర్ణయం తీసుకుంది.

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులకు అంతర్జాతీయ స్థాయి విద్యా విధానాలపై అవగాహన కల్పించేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మక నిర్ణయం తీసుకుంది. ఉపాధ్యాయుల వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరచడం, ప్రపంచ స్థాయి ఉత్తమ బోధనా పద్ధతులను అధ్యయనం చేయడం కోసం చేపట్టిన 'టీచర్స్ ఎక్స్‌పోజర్ విజిట్ అండ్ ఎడ్యుకేషనల్ ఎక్స్ఛేంజ్ ప్రోగ్రామ్'లో భాగంగా విదేశాలకు పర్యటనకు వెళ్లే 28 మంది ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయుల జాబితాను పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ డాక్టర్ ఇ. నవీన్ నికోలస్ వెల్లడించారు. ఏప్రిల్ 20 నుండి 24 వరకు తెలంగాణ నుండి మొత్తం 40 మంది ప్రతినిధులు (ఉపాధ్యాయులు, విద్యాశాఖ అధికారులు) నాలుగు దేశాలైన ఫిన్లాండ్, సింగపూర్, వియత్నాం, జపాన్ దేశాలను సందర్శించనున్నారు.
ప్రస్తుతం ఫిన్లాండ్ పర్యటన కోసం హెడ్ మాస్టర్లు, స్కూల్ అసిస్టెంట్లు , సెకండరీ గ్రేడ్ టీచర్లతో కూడిన 28 మంది సభ్యుల జాబితాను ఖరారు చేశారు. ఈ జాబితాలో కరీంనగర్, మహబూబాబాద్, మెదక్, ఖమ్మం, మంచిర్యాల, సంగారెడ్డి, హైదరాబాద్, జనగాం, జయశంకర్ భూపాలపల్లి, మేడ్చల్ మల్కాజిగిరి, సిద్ధిపేట, భద్రాద్రి కొత్తగూడెం, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి, జోగులాంబ గద్వాల, కామారెడ్డి, నల్గొండ, ఆదిలాబాద్, నిజామాబాద్, రంగారెడ్డి జిల్లాలకు చెందిన ఉపాధ్యాయులు ఉన్నారు. ఎంపికైన ఉపాధ్యాయులకు వీసా ప్రాసెసింగ్ , ఇతర సూచనలపై అవగాహన కల్పించేందుకు నేడు మధ్యాహ్నం 3 గంటలకు వర్చువల్ (ఆన్‌లైన్) ఓరియంటేషన్ నిర్వహించనున్నారు. ఎంపికైన వారు పర్యటనకు అవసరమైన పత్రాలతో సిద్ధంగా ఉండాలని ఆర్జేడీలు, డీఈఓలను ఆదేశించారు.






