Minister Seethakka: దేశంలోనే తొలిసారి.. అంగన్వాడీ చిన్నారులకు విజయ పాలు!

by Ramesh Naini |

రాష్ట్రంలో పౌష్టికాహార లోపాన్ని అధిగమించి, పోషకాహార లోప రహిత తెలంగాణను నిర్మించాలనే కృత నిశ్చయంతో రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీ ప్రీ స్కూల్ చిన్నారుల కోసం దేశంలోనే తొలిసారిగా ఒక వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.

Minister Seethakka: దేశంలోనే తొలిసారి.. అంగన్వాడీ చిన్నారులకు విజయ పాలు!
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో పౌష్టికాహార లోపాన్ని అధిగమించి, పోషకాహార లోప రహిత తెలంగాణను నిర్మించాలనే కృత నిశ్చయంతో రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీ ప్రీ స్కూల్ చిన్నారుల కోసం దేశంలోనే తొలిసారిగా ఒక వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా, ములుగు జిల్లాను పైలట్ ప్రాజెక్టుగా ఎంచుకుని, అంగన్వాడీ కేంద్రాల్లోని ప్రీస్కూల్ చిన్నారులకు ప్రతిరోజు 100 మిల్లీలీటర్ల (మి.లీ) విజయ పాలను ఉచితంగా అందించే కార్యక్రమాన్ని సోమవారం ఘనంగా ప్రారంభించింది. రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క ములుగు జిల్లా కేంద్రంలోని కృష్ణా కాలనీ అంగన్వాడీ కేంద్రంలో ఈ పైలట్ ప్రాజెక్టును లాంఛనంగా ప్రారంభించి, చిన్నారులకు స్వయంగా పాలు పంపిణీ చేశారు.

వెనుకబాటుతనం వల్లే ములుగు ఎంపిక:

ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ, రాష్ట్రంలో అధికంగా వెనుకబాటుతనంతో ఉన్న ములుగు జిల్లాను ఈ కార్యక్రమానికి పైలట్ ప్రాజెక్టుగా ఎంచుకోవడం జరిగిందని తెలిపారు. ఈ పథకం విజయవంతం అయితే, దీనిని రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేసే యోచనలో ప్రభుత్వం ఉందని స్పష్టం చేశారు. తెలంగాణను పోషకాహార లోప రహిత రాష్ట్రంగా మార్చడమే మా లక్ష్యం. అందులో భాగంగానే ప్రీస్కూల్ చిన్నారులకు పాలను పంపిణీ చేస్తున్నాం. ఈ కార్యక్రమం విజయవంతానికి అంగన్వాడీ టీచర్లు క్రియాశీల పాత్ర వహించాలి. తల్లిదండ్రులను కలిసి అంగన్వాడీ సేవలపై అవగాహన కల్పించాలి. కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా మన అంగన్వాడీ కేంద్రాలు పని చేయాలి అని మంత్రి సీతక్క సూచించారు. అంగన్వాడీలు అంకితభావంతో కృషి చేసి, అంగన్వాడీ కేంద్రాలను కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా తీర్చిదిద్దాలని కోరారు.

బాల్య వివాహాల పై ఉక్కుపాదం, వృద్ధుల సంరక్షణకు చట్టం:

అనంతరం, వయోవృద్ధుల వారోత్సవాల్లో భాగంగా పోస్టర్లు ఆవిష్కరించి మాట్లాడుతూ, తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేసే పిల్లల నుండి ఆస్తులను జప్తు చేసి, తిరిగి తల్లిదండ్రుల పేరు మీద మార్పిడి చేయడం జరుగుతుందని హెచ్చరించారు. అలాగే, బాలల హక్కుల వారోత్సవాల్లో భాగంగా బాలల హక్కుల పరిరక్షణ, బాల్య వివాహాలపై ఏర్పాటు చేసిన పోస్టర్లను ఆవిష్కరించారు. బాల్య వివాహాలు పిల్లల అభివృద్ధికి విఘాతమని పేర్కొంటూ, ములుగును బాల్య వివాహ రహిత జిల్లాగా తీర్చిదిద్దాలని సీడీపీఓలులు, సూపర్వైజర్లు, అంగన్వాడీ టీచర్లకు సూచించారు.

Next Story