- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆటోమెటిక్ స్టార్టర్లపై ఫోకస్! రైతుల అబ్జెక్షన్
ఆటోమేటిక్ స్టార్టర్ల తొలగింపుపై విద్యుత్ శాఖ అధికారులు దృష్టి సారించారు.

దిశ, కాటారం: రైతులు సాగునీటి కోసం వేసుకున్న వ్యవసాయ బోరుబావుల విద్యుత్ కనెక్షన్లకు అమర్చుకున్న ఆటోమేటిక్ స్టార్టర్ల తొలగింపుపై విద్యుత్ శాఖ అధికారులు దృష్టి సారించారు. ప్రభుత్వం వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లకు ఉచిత విద్యుత్ సరఫరా చేస్తుండగా, వ్యవసాయ మోటార్లు ఆగకుండా నడిచేందుకు రైతులు ఆటోమేటిక్ స్టార్టర్లను వినియోగిస్తున్నారు. వీటి ద్వారా అవసరం ఉన్నా లేకున్నా నీరు తోడి వేయడం, విద్యుత్ వినియోగం ఎక్కువ కావడంతో ఆటోమేటిక్ స్టార్టర్లను తొలగించేందుకు విద్యుత్ శాఖ నిర్ణయించింది.
ఇతర రాష్ట్రాల నుంచి విద్యుత్ సరఫరా నిలిపివేయడంతో అదనపు భారం, వృథాను అధికారులు గుర్తించారు. వ్యవసాయానికి ఇచ్చే 24 గంటల విద్యుత్ సరఫరా సమయంలో కొంత మేరకే పంట పొలాలకు నీరు పారించుకుంటున్నారని, మిగతా నీరంతా వృథాగా పోతోందని గుర్తించిన అధికారులు వ్యవసాయ బోరు మోటార్లకు బిగించిన ఆటోమేటిక్ స్టార్టర్లను తొలగించే పనిలో పడ్డారు ఇప్పటికే బోరు బావుల వద్ద ఉన్న ఆటో స్టార్టర్లను తొలగించేందుకు రైతులకు అవగాహన కల్పిస్తూ తొలగించే ప్రక్రియను అధికారులు కొనసాగిస్తున్నారు.
42,700 విద్యుత్ వ్యవసాయ కనెక్షన్లు..
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని 11 మండలాల్లో 42,700 వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి. వీటిలో సగానికి పైగానే ఆటో స్టార్టర్లను పెట్టి రైతులు వ్యవసాయ మోటార్లను నడుపుతున్నారు. విద్యుత్, నీటి వృథా చేయవద్దనే ఉద్దేశంతో విద్యుత్ శాఖ ఆటో స్టార్టర్లను తొలగించేందుకు చర్యలు చేపట్టింది. ఆటో స్టార్టర్ల తొలగింపుపై కొంతమంది రైతులు స్వచ్ఛందంగానే తొలగించి మ్యానువల్ స్టార్టర్లను అమర్చుకుంటున్నారు.
గ్రామాల్లో విద్యుత్ సిబ్బంది పర్యటిస్తూ ఆటోమేటిక్ స్టార్టర్లను తొలగించాలని ముందుగా తెలుపుతున్నారు. రైతులు తొలగించకపోవడంతో విద్యుత్ శాఖ అధికారులు పొలంబాట పట్టారు. స్టార్టర్లను కలిగి ఉన్న రైతుల వద్దకు వెళ్లి వాటితో కలిగే నష్టాలను వివరించి తొలగించేలా అవగాహన కల్పిస్తున్నారు. రైతులు తొలగించకుంటే విద్యుత్ అధికారులే స్వయంగా వాటిని తొలగిస్తున్నారు.
ఆటోమేటిక్ స్టార్టర్లతో ఏం జరుగుతోంది?
విద్యుత్ సరఫరా ఎప్పుడు వచ్చినా పంటలకు నిరంతరం నీరు సరఫరా జరిగేందుకు వ్యవసాయ కనెక్షన్లకు ఆటోమేటిక్ స్టార్టర్లను ఏర్పాటు చేస్తున్నారు. రైతులు పొలాల వద్ద ఉన్నా లేకున్నా విద్యుత్ రాగానే ఆటోమేటిక్ స్టార్టర్‌తో మోటారు ఆన్ కావడంతో పంటలకు నీరు యథావిధిగా సరఫరా అవుతుంది. మోటార్లు నిరంతరం నడవడంతో నీరు వృథా అవ్వడంతో పాటు భూగర్భ జలాలు అడుగంటి పోతున్నాయి.
దీంతో పాటు ఎకతాటిగా వ్యవసాయ బోర్లు ఆటో స్టార్టర్లతో నడవడంతో ట్రాన్స్ఫార్మర్లపై అదనపు లోడ్ పడుతుండడంతో విద్యుత్ ఖర్చు పెరుగుతోందని సంబంధిత శాఖ అధికారులు చెబుతున్నారు. ఈ మేరకు ట్రాన్స్కో అధికారులు ఆటోమేటిక్ స్టార్టర్ల నివారణపై దృష్టి పెట్టారు. ట్రాన్స్ఫార్మర్లపై అదనపు భారం పడకుండా చూడాలని రైతులకు సూచిస్తున్నారు. త్రీఫేస్ సమస్యను అధిగమించడానికి రైతులు ఆటోమేటిక్ స్టార్టర్ల వినియోగం మానుకోవాలని సూచిస్తున్నారు.
రైతులు స్వచ్ఛందంగా ముందుకు రావాలి..
రైతులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి పంటపొలాల వద్ద ఆటోమేటిక్ స్టార్టర్లను తొలగించాలి. 24 గంటలు నాణ్యమైన విద్యుత్ సరఫరా చేస్తున్నందున ఆటోమేటిక్ స్టార్టర్ల అవసరం లేకుండా పోయింది. రైతులే స్వచ్ఛందంగా ముందుకు వచ్చి తొలగించాలి. గ్రామాల్లో రైతులకు అవగాహన కల్పిస్తున్నాం. విద్యుత్ సిబ్బంది దృష్టికి వచ్చిన ఆటోమేటిక్ స్టార్టర్లను తొలగిస్తున్నారు. జిల్లాలో ఇప్పటివరకు 3,500 పైగా ఆటోమేటిక్ స్టార్టర్లను తొలగించాం.
– డీ నాగరాజు, డీఈఈ భూపాపల్లి






