‘డైరెక్టరేట్ ఆఫ్ సెకండరీ హెల్త్’కు ఆర్థిక అధికారాలు

by Ajay Maddhiboyina |

రాష్ట్ర వైద్యరంగంలో చరిత్రాత్మక మార్పులకు శ్రీకారం చుడుతూ ప్రతిపాదించిన తెలంగాణ వైద్యవిధాన పరిషత్‌ (టీవీవీపీ) రద్దు ప్రక్రియ అధికారికంగా తుదిదశకు చేరుకున్నది. ఈ ఏడాది మార్చి 23న శాసనసభలో ప్రవేశపెట్టిన టీవీవీపీ రద్దు బిల్లుకు ఏప్రిల్ 25న గవర్నర్ ఆమోద ముద్రవేశారు.

‘డైరెక్టరేట్ ఆఫ్ సెకండరీ హెల్త్’కు ఆర్థిక అధికారాలు
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర వైద్యరంగంలో చరిత్రాత్మక మార్పులకు శ్రీకారం చుడుతూ ప్రతిపాదించిన తెలంగాణ వైద్యవిధాన పరిషత్‌ (టీవీవీపీ) రద్దు ప్రక్రియ అధికారికంగా తుదిదశకు చేరుకున్నది. ఈ ఏడాది మార్చి 23న శాసనసభలో ప్రవేశపెట్టిన టీవీవీపీ రద్దు బిల్లుకు ఏప్రిల్ 25న గవర్నర్ ఆమోద ముద్రవేశారు. అనంతరం ఏప్రిల్ 30న ప్రభుత్వం దీనికి సంబంధించిన అధికారిక గెజెట్‌ను ప్రచురించింది. ఈ చట్టప్రకారం టీవీవీపీ స్థానంలో ఏర్పడిన డైరెక్టరేట్ ఆఫ్ సెకండరీ హెల్త్(డీఎస్ హెచ్) విభాగానికి పూర్తిస్థాయి విభాగాధిపతి(హెచ్ఓడీ) హోదా, స్వతంత్ర ఆర్థిక అధికారాలను కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం గురువారం తుది ఉత్తర్వులు జారీచేసింది. ఈ మేరకు ఆర్థికశాఖ ప్రత్యేక కార్యదర్శి సిక్తా పట్నాయక్ జీవో నం.72ను విడుదల చేశారు.

010 పద్దు కింద వేతనాలు

తాజాగా విడుదలైన ఫైనాన్స్ జీవోతో నూతన డైరెక్టరేట్ పరిధిలోని వేలాది మంది ఉద్యోగులకు ట్రెజరీ ద్వారా 010 పద్దు కింద వేతనాలు అందడానికి మార్గం సుగమమైంది. అయితే, పూర్తిస్థాయిలో ట్రెజరీ విధానం ద్వారా జీతాలు చేతికి రావడానికి సాంకేతిక కారణాలతో ఇంకా కాస్త సమయం పట్టే అవకాశం ఉందని వైద్యవర్గాలు పేర్కొంటున్నాయి. అలాగే, ఈ నూతన విభాగానికి సంబంధించి కొత్త సర్వీస్ రూల్స్ ఫ్రేమ్ చేయాల్సి ఉండటంతో దీనికోసం ప్రభుత్వం త్వరలోనే ఓ ప్రత్యేక కమిటీని నియమించనున్నట్టు సమాచారం.

సర్దుబాటుపై వైద్యుల ఆందోళన

మరోవైపు, నూతన డైరెక్టరేట్ కింద జరుగుతున్న పునర్ వ్యవస్థీకరణ ప్రక్రియపై డాక్టర్లలో కొన్ని అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఆస్పత్రుల పడకల సామర్థ్యాన్ని బట్టి ఈక్వల్ కేడర్ స్ట్రెంత్(సమాన ఉద్యోగుల సంఖ్య) ఉండాలని, కానీ ఇటీవల జరిగిన బదిలీల్లో ఇష్టానుసారంగా జరిగిందనే విమర్శలు వస్తున్నాయి. ఆయా ఆస్పత్రుల్లో ఉన్న 30, 50, 100 పడకల సామర్థ్యానికి అనుగుణంగా ఎక్కడికక్కడ క్యాడర్ స్ట్రెంత్‌ను శాస్త్రీయంగా సర్దుబాటు చేయాల్సిన అవసరం ఉందని డాక్టర్లు డిమాండ్ చేస్తున్నారు.

ప్రభుత్వ ఆధీనంలోకి ఆస్పత్రులు

నూతన చట్టం ప్రకారం గతంలో టీవీవీపీ పరిధిలో ఉన్న 184 ప్రభుత్వ ఆస్పత్రులు(జిల్లా ఆస్పత్రులు, ఏరియా ఆస్పత్రులు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, సివిల్ డిస్పెన్సరీలు), వాటికి సంబంధించిన స్థలాలు, భవనాలు, ఆస్తులు, బాధ్యతలన్నీ ఇకపై నేరుగా ప్రభుత్వ ఆధీనంలోకి వచ్చాయి. ఈ సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులంతా నూతన డైరెక్టరేట్ కింద ప్రభుత్వ ఉద్యోగులుగా కొనసాగనున్నారు. ఈ నిర్ణయం ద్వారా బడ్జెట్‌పై అదనపు భారం పడబోదని ఆర్థిక మెమొరాండంలో స్పష్టం చేశారు.

పూర్తిస్థాయి కమిషనర్ లేకుండానే..

వైద్యారోగ్యశాఖలో ఇటీవలే బదిలీల పర్వం ముగిసింది. అయితే పూర్తిస్థాయి కమిషనర్ లేకుండానే ప్రక్రియను చేపట్టారు. గత నెలాఖరున టీవీవీపీ కమిషనర్ డాక్టర్ అజయ్ కుమార్ పదవీ విరమణ చేయడంతో ఆయన స్థానంలో హెల్త్ సెక్రటరీ క్రిస్టినా జెడ్ చోంగ్తూను ఇన్ చార్జ్ గా నియమించారు. ఆమె రాష్ట్రవ్యాప్త విధుల్లో బిజీగా ఉండటంతో కనీసం తమ హెచ్ఓడీని కలిసేందుకు కూడా అవకాశం లేకుండా పోతోందని టీవీవీపీ ఉద్యోగులు వాపోతున్నారు. బదిలీల సమయంలో తమకు జరిగిన అన్యాయాలను చెప్పుకునేందుకు కూడా తమకు ఆమె అవకాశం కల్పించలేదని పలువురు తెలిపారు. టీవీవీపీ ఇకపై డీఎస్ హెచ్ గా మారుతున్న సందర్భంలో ఉండే అనేక బాలారిష్టాలను అధిగమించాలంటే పూర్తిస్థాయి కమిషనర్ ఉండటమే మార్గమని వైద్యులు, ఉద్యోగులు చెబుతున్నారు. కాగా, కొత్త కమిషనర్ నియామకానికి సంబంధించిన ఫైల్ సీఎం ఆఫీసులో పెండింగులో ఉందని తెలుస్తున్నది.

Next Story