అస్తవ్యస్తంగా మార్కెట్ల నిర్వహణ.. ఆదాయం ఉన్నా నిధులు శూన్యం

by Naga Rani Yarlagadda |

రాష్ట్రంలో వ్యవసాయ మార్కెట్ల నిర్వహణలో నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. ఆదాయం ఉన్నా త్రాగునీటి కోసం కూడా అధికారులు అప్పులు చేయాల్సిన పరిస్థితి దాపురించింది.

అస్తవ్యస్తంగా మార్కెట్ల నిర్వహణ.. ఆదాయం ఉన్నా నిధులు శూన్యం
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలోని వ్యవసాయ మార్కెట్ల నిర్వహణ అస్తవ్యవస్తంగా మారింది. సరిపడా ఆదాయం ఉన్నా ఆర్థిక సమస్యలతో అవస్థలు పడే పరిస్థితి కనిపిస్తోంది. సిబ్బందితో విధులు నిర్వహించడం అధికారులకు దినదిన గండంగా మారింది. ఏ శాఖా సమకూర్చని ఆదాయం ఇస్తూ రైతులకు, ప్రజలకు సేవలందిస్తున్నాయి. తమ ఆదాయం తమకు ఇవ్వడానికి ఉన్నతాధికారులు జాప్యం చేయడంపై సిబ్బంది ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం నెలవారీ చెల్లించే నిధులను విడుదల చేయడకపోవడంతో మార్కెట్లలో తాగునీరు, చెత్త తొలగింపు, కరెంటు బిల్లు, సిబ్బంది బీమా, స్టేషనరీ కోసం అధికారులు అప్పులు చేయాల్సిన దుస్థితి నెలకొంది.

రూ. 240 కోట్ల బిల్లులు పెండింగ్​

గత 6 నెలల నుంచి సుమారు రూ.240 కోట్ల బిల్లులు పెండింగ్‌లో ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 205 మార్కెట్లు ఉంటే వాటి ద్వారా ఆదాయం రూ.600 కోట్ల వరకు ఫీజుల రూపంలో వస్తోంది. ఇందులో నుంచి ఉద్యోగుల వేతనాలు, పింఛన్లు, నిర్వహణ ఖర్చులు చెల్లించాలి. కానీ ఇప్పటివరకు వాటికి అతీగతి లేదు. అదే విధంగా మార్కెట్లలో ఉన్న కార్యాలయాల్లో సిబ్బంది కొరత వేధిస్తోంది. పారిశుధ్య పనుల కోసం 1,870 మంది సిబ్బంది అవసరం కాగా నెలనెలా చెల్లించకపోవడంతో చాలామంది విధులు మానేస్తున్నారు. ప్రస్తుతం 495 మంది శానిటేషన్ పనులు నిర్వహిస్తున్నట్లు సమచారం. అదే విధంగా మార్కెట్ కార్యాలయాల్లో 25 మంది వరకు సిబ్బంది అవసరం ఉంటే 10 నుంచి 12 మంది మాత్రమే విధులు నిర్వహిస్తున్నారు. ఉద్యోగ విరమణ, దీర్ఘకాలిక సెలవులపై వెళ్తే అంతే సంగతి. ఉన్న సిబ్బందిపై అదనపు భారం పడుతుంది. ఒక పక్క సిబ్బంది సమస్య, పారిశుధ్య లోపం, ఔట్​సోర్సింగ్ ఉద్యోగుల అసంతృప్తి మార్కెటింగ్ ఉన్నతాధికారులకు తలనొప్పిగా మారింది. సిబ్బంది రోజూ వేతనాలపై నిలదీస్తుంటే సమాధానం చెప్పలేక తమ జేబుల్లోంచి ఇస్తున్నారు. వాటికి సంబంధించిన బిల్లులు ఇవ్వాలని ఉన్నతాధికారులను కోరితే స్పందించే నాథుడే లేడు. గత 6 నెలల నుంచి తమ సమస్యల కోసం మంత్రి తుమ్మల, మార్కెటింగ్​శాఖ డైరెక్టర్​వద్ద మొర పెట్టుకున్నా రేపు.. మాపు అంటూ సర్ది చెప్పడం తప్ప బిల్లుల చెల్లింపులో అడుగు ముందుకు పడటం లేదని మార్కెట్​అధికారులు వాపోతున్నారు. త్వరలో జరిగే మంత్రివర్గ సమావేశంలో మార్కెట్ శాఖలో నెలకొన్న ఆర్థిక సమస్యలపై చర్చించాలని సూచిస్తున్నారు.

సమస్యలపై అడిగితే దాటవేత

మార్కెటింగ్​శాఖలో ఉన్నతాధికారులు తమ సమస్యలపై అడిగితే సమాధానం దాటవేస్తూ సిబ్బంది చిన్న తప్పు చేసినా క్రమశిక్షణ చర్యల పేరుతో ఇబ్బందులకు గురి చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. వారు చేసిన తప్పిందంపై విచారణ చేపట్టకుండా మెమోలు ఇస్తూ విధులకు దూరం చేస్తున్నారు. సమస్యలపై ఎక్కడ నిలదీస్తారోననే కోపంతో ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నట్లు సిబ్బంది ఆరోపిస్తున్నారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో బోయిన్‌పల్లి, గుడి మల్కాపూర్, కూకట్‌పల్లి మార్కెట్లకు రోజుకు లక్షలాది మంది రైతులు తాము పండించిన ఉత్పత్తులు తీసుకొచ్చి నేరుగా వినియోగదారులకే విక్రయిస్తున్నారు. దీంతో పాటు సరుకుల కొనుగోలుకు ఒక మార్కెట్‌కు రోజు 25 వేల మంది వస్తుంటారు. కనీస సౌకర్యాలు లేకపోవడంతో చాలా మంది అటువైపు చూడటం లేదు. పార్కింగ్​స్థలం వద్ద ఉండాల్సిన సెక్యూరిటీలు చాలా మంది విధులకు రావడం లేదు. దీంతో అక్కడ వాహనాలు నిలిపితే బయటకు వెళ్లడం కష్టంగా మారింది. పార్కింగ్ సమస్య ఉండటంతో కొనుగోలుదారులు షాపింగ్ మాల్ వైపు వెళ్తున్నారు. కొనుగోలుదారుల సంఖ్య తగ్గితే చిరు వ్యాపారులు నష్టపోతారు. దీని ద్వారా మార్కెట్‌కు వచ్చే ఆదాయం తగ్గుతోంది. ఈ ఏడాది నుంచి స్వీపర్లుగా పనిచేసే వారికి ప్రత్యేక దుస్తుల కోసం ఇచ్చే రూ.1,500 కూడా ఇవ్వడం లేదు. హమాలీ, దడువాయి, చాటావాలా, గుల్లావాలా వంటి వారికి పీఎంఎస్‌బీవై బీమా కూడా అమలు కావడం లేదు. 6 నెలలకోసారి నిర్వహించాల్సిన ఆరోగ్య శిబిరాలు అడపాదడపా నిర్వహిస్తున్నారు. మార్కెట్​యార్డులో చెట్లకు కూడా సక్రమంగా నీరు పోయడం లేదు. కొత్త మొక్కల పెంపకం ఊసేలేదు.

మరమ్మతులకు చెల్లింపులు లేవు

ధాన్యం కొనుగోలు సమయంలో కేంద్రాల్లో ఆటోమెటిక్ ప్యాడీ క్లీనర్లు, ప్యాడీ డ్రైయర్లు ఏర్పాటు చేస్తారు. అవి నెలకోసారి రిపేర్ చేయాల్సి వస్తోంది. వాటికి సంబంధించిన బిల్లులు కూడా ప్రభుత్వం చెల్లించడం లేదు. అధికారులు తమ వేతనం నుంచి కొన్ని డబ్బులు వాటికి వినియోగిస్తున్నారు. మార్కెట్ శాఖ నుంచి ఆదాయం పెద్ద మొత్తంలో వచ్చినా వాటిని విడుదల చేయాలని ఎన్నిసార్లు మొర పెట్టకున్నా అధికారులు పెడచెవిన పెట్టడంపై సిబ్బంది మండిపడుతున్నారు. ఎలాంటి ఆదాయం ఇవ్వని శాఖలకు గడువులోగా చెల్లింపు చేస్తారని, తాము ప్రభుత్వంపై భారం పడకుండా రూ.కోట్లలో ఆదాయం ఇస్తుంటే నిర్లక్ష్యం చేయడమేమిటని నిలదీస్తున్నారు.

Next Story