TG: నాలుగు లక్షల ఎకరాల భూ వివాదం.. భూ భారతిలో లేని పోడు పట్టాల వివరాలు

by Gantepaka Srikanth |

రాష్ట్రంలో అనేక ఏళ్లుగా పోడు పంచాయితీ తెగడం లేదు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన చర్యల వల్ల ఇది మరింత జఠిలంగా మారింది.

TG: నాలుగు లక్షల ఎకరాల భూ వివాదం.. భూ భారతిలో లేని పోడు పట్టాల వివరాలు
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో అనేక ఏళ్లుగా పోడు పంచాయితీ తెగడం లేదు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన చర్యల వల్ల ఇది మరింత జఠిలంగా మారింది. ముఖ్యంగా కరీంనగర్, ఖమ్మం, ఆదిలాబాద్, వరంగల్, మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లాలతోపాటు కామారెడ్డి జిల్లా మాచారెడ్డి, లింగంపేట, గాంధారి, నిజామాబాద్ జిల్లా సిరికొండ, మోపాల్, దర్పల్లి మండలాల్లో ఈ సమస్య మరీ తీవ్రంగా ఉంది. వేలాది మంది ఆదివాసీ గిరిజనులు ఇబ్బందులు పడుతున్నారు. అటవీ శాఖ అధికారులు తమపై అక్రమ కేసులు పెట్టి.. భయాందోళనకు గురిచేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మోపాల్ మండలం బైరాపూర్ లో పోడు సాగును అధికారులు అడ్డుకోగా, ఓ రైతు గడ్డిమందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. అక్కాపూర్ లో పోడు భూముల్లోని బోరుబావులను ధ్వంసం చేసి రాళ్లు వేశారన్న ఆరోపణలు వచ్చాయి. తమపై కేసులు పెట్టడంతో రెండేండ్లుగా ఇబ్బందులు పడుతున్నామని మాచారెడ్డి మండలం అక్కాపూర్ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పోడు వ్యవసాయం చేసుకుంటుంటే.. గడ్డిమందు చల్లి పంటను ధ్వంసం చేస్తున్నారని ఫారెస్ట్ అధికారులపై ఫిర్యాదులు వస్తున్నాయి. దీంతో పోడు భూముల సమస్యకు పరిష్కారం చూపాలంటూ పలు చోట్ల నిరసనలు వ్యక్తమవుతున్నాయి. 2020 నుంచి ఈ పోడు భూముల సమస్యతోపాటు ఫారెస్ట్, రెవెన్యూ డిపార్ట్ మెంట్స్ మధ్య బౌండరీ డిస్ప్యూట్స్ తీవ్రమయ్యాయి. ఈ నేపథ్యంలో ఈ సమస్యకు పరిష్కార మార్గాలు వెతికేలా, సంబంధిత అంశాలపై ఈ నెల 20న ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు.

పోర్టల్ లో నమోదు చేస్తామని చెప్పి..

‘గతంలో టీడీపీ, కాంగ్రెస్‌ ఇచ్చినవి ఆర్‌ఓఎఫ్‌ఆర్‌ పట్టాలు కావు. పని చేసుకోవడానికి వీలు కల్పించే పత్రం మాత్రమే. ఆ భూములు పొందిన వారు ఓనర్లు కాదు. ఫలసాయంతో మాత్రమే బతకాలి. ఒక దర్బార్ పెట్టి పోడు భూములకు పట్టాలు ఇచ్చి క్లోజ్ చేస్తాం. ఆర్‌ఓఎఫ్‌ఆర్‌ ఉన్న వాటిని కూడా ధరణి పోర్టల్ లో ప్రత్యేకంగా నమోదు చేస్తాం. దీంతో ప్రతి ఎకరా భూమికి సంబంధించిన వివరాలు పక్కాగా తెలుసుకోవచ్చు’ అని 2020, 2021 సంవత్సరాల్లో అప్పటి సీఎం కేసీఆర్ అసెంబ్లీ వేదికగా చెప్పిన మాటలు ఇవి. అయితే ఆ తర్వాత సరైన చర్యలు చేపట్టకపోవడంతో పోడు సమస్య మరింత జఠిలంగా మారిందనే విమర్శలు వస్తున్నాయి.

ఆదివాసులు, అధికారుల మధ్య..

కేసీఆర్ హయాంలో అధికారికంగా 3 లక్షల ఎకరాలకు ఆర్వోఎఫ్ఆర్ పట్టాలు జారీ చేశామని చెప్పారు. అయితే దాని తర్వాత 2020లో 4 లక్షల ఎకరాలకు పైగా పోడు పట్టాల కోసం అప్లికేషన్లు వచ్చాయి. అంటే 7 లక్షల ఎకరాల పోడు భూముల్లో పట్టాలు ఇచ్చి ఉండాలి. అయితే 2005 డిసెంబరు 13 కంటే ముందు నుంచి పోడు చేసుకుంటున్న తమకు పట్టాలు ఇవ్వలేదని చాలా మంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పోడు భూముల సమస్యతో ఎజెన్సీ ఏరియాల్లో ఆదివాసులు, ఫారెస్టు అధికారుల మధ్య పోరాటమే నడుస్తున్నది. ఒకరేమో హక్కుల కోసం, మరొకరేమో కాపాడేందుకు విధుల నిర్వహణలో నిమగ్నమయ్యారు. దీంతో 4 నుంచి 5 లక్షల ఎకరాల్లో వివాదం నేటికీ నడుస్తున్నది.

సాగు న్యాయయాత్రలో..

నిజామాబాద్, ఉట్నూరు, ఏటూరు నాగారం, భద్రాచలం, నాగార్జున సాగర్, మెదక్, నిజామాబాద్ ప్రాంతాల్లో అత్యధికం ఫారెస్ట్ డిస్ప్యూట్ నెలకొన్నది. ఇటీవల లీఫ్స్ సంస్థ చేపట్టిన సాగు న్యాయయాత్రలోనూ రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను న్యాయవాదుల దృష్టికి తీసుకొచ్చారు. కొందరికి పోడు పట్టాలు ఇవ్వలేదు. కొందరికీ పట్టాలు ఉన్నా ఆర్ఓఎఫ్ఆర్ వివరాలు ఆన్ లైన్ లో లేకపోవడంతో బ్యాంకర్లు పంట రుణాలు ఇవ్వడం లేదు. భూ భారతిలోనూ పోడు పట్టాల వివరాలను అప్ లోడ్ చేయకపోవడంతో నిజమైన ఆదివాసులకు రైతు భరోసా, పంట రుణాలు అందడం లేదు. 2012లోనే కేంద్ర ప్రభుత్వం పోడు సాగు భూమిని ప్రత్యేక సర్వే నంబర్లతో రెవెన్యూ రికార్డుల్లో నమోదు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. పోడు భూముల్లో వ్యవసాయం చేయొచ్చు. ఫారెస్టు అధికారులు ఇబ్బంది పెట్టే అధికారం లేదని కేంద్ర చట్టాలు చెప్తున్నాయి. అయితే కేంద్ర ప్రభుత్వం కూడా సాయం అందించే విధంగా చట్ట సవరణ చేయాల్సిన అవసరం ఉంది.

డీఎల్సీల వద్ద పెండింగ్!

ఉమ్మడి రాష్ట్రంలో ఆర్ఓఎఫ్ఆర్ చట్టం కింద 2008 నుంచి 3,03,970 ఎకరాల్లో అర్హులైన 94,774 మంది హక్కుదారులకు పట్టాలు జారీ చేశారు. ఈ చట్టం చేసినప్పటి నుంచి 6,03,850 ఎకరాలకు సంబంధించి 1,84,730 దరఖాస్తులు అందాయి. అందులో క్షేత్ర స్థాయి విచారణ చేసి అర్హులైన వ్యక్తులకు పట్టాలను జారీ చేసినట్లు ప్రభుత్వం చెప్పింది. 2007-2012 మధ్య కాలంలో సగం దరఖాస్తులను తిరస్కరించారు. ఆ దరఖాస్తులను ఎందుకు తిరస్కరించారో అధికారులు చెప్పలేదన్న ఆరోపణలు ఉన్నాయి. అందుకే సమస్య కొనసాగుతూనే ఉంది. 2018 నుంచి ఆర్ఓఎఫ్ఆర్ పట్టాల కోసం 98,745 ఎకరాలకు గాను 27,990 దరఖాస్తులు వచ్చాయి. వాటిలో 4,248 ఎకరాల్లో 2401 క్లెయిమ్స్ అర్హత ఉన్నవని గుర్తించి పట్టాలు ఇచ్చారు. మరో 40,780 సంబంధించిన ఎకరాలకు సంబంధించిన 9,976 క్లెయిమ్ లను డీఎల్సీ ద్వారా అర్హత లేనివిగా గుర్తించారని అధికారుల లెక్క. 53,565 ఎకరాలకు సంబంధించి 15,558 క్లెయిమ్స్ డీఎల్సీల దగ్గర పెండింగులో ఉన్నాయి.

జాయింట్ సర్వే అవసరం

కోనేరు రంగారావు కమిటీ నివేదిక ప్రకారం రెవెన్యూ, అటవీ శాఖలు సంయుక్తంగా సర్వే చేయాలి. వివాదం ఉన్నా.. హక్కు పత్రాలు జారీ చేయాలి. ఆ తర్వాత సర్వే ప్రకారం నిర్ణయం తీసుకోవచ్చు. ఆసిఫాబాద్ నుంచి భద్రాచలం, భద్రాచలం నుంచి శ్రీశైలం వరకు గెట్టు పంచాయితీలు తేల్చాలంటే భూ సర్వే తప్పనిసరి అని భూమి సునీల్ అభిప్రాయపడ్డారు. అటవీ చట్టాల ప్రకారం సెక్షన్ 4 ప్రకారం నోటీసులు జారీ చేసి.. సదరు భూమిని డీమ్డ్ ఫారెస్టు అంటున్నారు. కానీ సెక్షన్ 15 ప్రకారం ఆ భూములను సెటిల్మెంట్ చేయాల్సిన బాధ్యతను పాలకులు మర్చిపోయారు. అటవీ హక్కుల చట్టాల ప్రకారం గ్రామసభలు నిర్వహించి అర్హులకు హక్కు పత్రాలు జారీ చేయాలి. ప్రతి గ్రామానికి సెటిల్మెంట్ ఆఫీసర్లను నియమించాలి. చాలా ప్రాంతాల్లో ఫారెస్టు భూముల్లో అసైన్డ్ పట్టాలు ఇచ్చారు. అంటే ప్రభుత్వమే వాళ్లను సాగు చేసుకొమ్మని ఇచ్చినప్పుడు రైతుల తప్పేం ఉంది? అలాగే రాష్ట్ర వ్యాప్తంగా రెవెన్యూ, ఫారెస్ట్ డిస్ప్యూట్ తేలాలంటే జాయింట్ సర్వే చేయాలి.

ఫారెస్ట్.. అసైన్డ్ పట్టాలు

యాదాద్రి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలం రాచకొండ రెవెన్యూ పరిధిలో సర్వే నం.192, 273 ల్లో ఏడెనిమిది వేల ఎకరాల భూమి ఉంది. అదంతా అడవిగానే పేర్కొన్నారు. కొంత వక్ఫ్ భూమిగానూ నమోదు చేశారు. అదెలా సాధ్యమైందో రెవెన్యూ, వక్ఫ్ బోర్డు అధికారులకే తెలియాలి. అయితే ఈ రెండు సర్వే నంబర్లలో సుమారు 6 వేల ఎకరాలు గిరిజనులకు పంచి పెట్టారు. 2 వేల మంది భూమి లేని గిరిజనులకు ఇచ్చారు. పట్టాలు పంపిణీ చేశారు. రెవెన్యూ రికార్డుల్లోకి నమోదు చేశారు. పాత పట్టాదారు పుస్తకాలు కూడా జారీ చేశారు. కానీ భూ రికార్డుల ప్రక్షాళన తర్వాత వారికిచ్చిన పట్టాలు చెల్లవని రెవెన్యూ అధికారులు చెబుతున్నారు. అందుకే కొత్త పాసు పుస్తకాలు జారీ చేయడం లేదు. దీంతో వారంతా రైతుభరోసా, రైతుబీమా పథకాలకు దూరమయ్యారు. ఐదేండ్లుగా అధికారుల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. సర్వే నం.192, 273ల్లోని కొంత భూమి మాత్రమే రిజిస్ట్రేషన్ నిషేధిత భూముల జాబితాలో పేర్కొన్నారు. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ల శాఖ వెబ్ సైట్ లో మాత్రం సర్వే నంబరు 192 లో సబ్ డివిజన్లు 1, 1/57, 2, 57, సర్వే నంబరు 273లో సబ్ డివిజన్లు 1, 6 మాత్రమే రిజిస్ట్రేషన్ నిషేధిత జాబితాలో ఉన్నాయి. భూ భారతితో మాత్రం సర్వే నంబరు 192, 273 లోని అన్ని సబ్ డివిజన్లను రిజిస్ట్రేషన్ల నిషేధిత జాబితా(పీఓబీ)లో పేర్కొన్నారు. దాంట్లో సర్వే నం.192/1-1లో 534 ఎకరాలు, 192/2-2 లో 2673 ఎకరాలు అటవీ భూమిగా నమోదు చేశారు. అలాగే సర్వే నం.273/1లో 5,481, 273/2 లో 213.26 ఎకరాలు కూడా అటవీ భూమిగా పేర్కొన్నారు. అయితే ఇప్పుడు పట్టాలే చెల్లవని అధికారులు చెబుతుండడంతో గిరిజనులు ఇబ్బందులు పడుతున్నారు.

Next Story