- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
దళిత విద్యార్థుల తిప్పలు..!
దళిత విద్యార్థులకు చిక్కొచ్చిపడింది. ఎస్సీ విద్యార్థులకు ఫీజురీయింబర్స్‌మెంట్ డబ్బులను నేరుగా విద్యార్థి ఖాతాలో వేయాలని తీసుకున్న ప్రభుత్వ నిర్ణయం విద్యార్థులనే కాకుండా,

దిశ, మేడ్చల్ బ్యూరో : దళిత విద్యార్థులకు చిక్కొచ్చిపడింది. ఎస్సీ విద్యార్థులకు ఫీజురీయింబర్స్‌మెంట్ డబ్బులను నేరుగా విద్యార్థి ఖాతాలో వేయాలని తీసుకున్న ప్రభుత్వ నిర్ణయం విద్యార్థులనే కాకుండా, వారి తల్లిదండ్రులను ముప్పుతిప్పలు పెడుతోంది. విద్యా సంవత్సరం ప్రారంభమైనా మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో ఫీజు రీయింబర్స్‌మెంట్ డబ్బులను స్కాలర్‌షిప్‌లకు అర్హులైన విద్యార్థుల ఖాతాలలో జమ చేయలేదు. అయితే కాలేజీ యాజమాన్యాలు మాత్రం స్కాలర్‌షిప్ మీ ఖాతాల్లోనే పడుతున్నందున, మీరు మాకు ఫీజు డబ్బులు చెల్లించాల్సిందేనని ఒత్తిడి తెస్తున్నాయని పలువురు విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో దళిత విద్యార్థుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది.
కొత్త నిబంధనతో నష్టమే..
దళిత విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకానికి సంబంధించి కేంద్రం కొత్త నిబంధన పెట్టింది. ఎస్సీ విద్యార్థులకు ఉపకార వేతనాలు, ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాలకు సంబంధించిన ఆర్థిక సాయాన్ని విద్యాసంస్థలకు కాకుండా నేరుగా విద్యార్థి బ్యాంకు ఖాతాలోనే జమ చేయాలని మూడేళ్ల కిందటే తేల్చి చెప్పింది. అప్పుడే కేంద్రం నుంచి పథకం వాటా నిధులు విడుదల చేస్తామని స్పష్టం చేసింది. ఈ మేరకు ఖచ్చితమైన హామీనిస్తూ నిర్ణయం తీసుకుని కేంద్రానికి నివేదిక ఇవ్వాలని ఆదేశించింది.
ఖాతాల్లోకి డబ్బులు రాకాపోవడంతో..
కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని తెలంగాణ సర్కారు అమలు చేస్తోంది. ఇందుకుగాను 2024-25 ఆర్థిక సంవత్సరంలో దళిత విద్యార్థుల ఉపకారవేతనాల కోసం ప్రభుత్వం రూ.35 కోట్ల నిధులను విడుదల చేసింది. అయితే ఏడాదికి ఎస్సీ విద్యార్థుల ఉపకారవేతనాల కోసం దాదాపు రూ.500 కోట్ల వరకు నిధులు అవసరమవుతాయని అధికారులు చెబుతున్నారు. కాగా మేడ్చల్ జిల్లాలో అత్యధిక ఇంజినీరింగ్, జూనియర్, డిగ్రీ ఇతరాత్ర 482 కాలేజీలు ఉండగా, ఈ విద్యా సంవత్సరానికి ఉపకారవేతనాల కోసం 28,331 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. కాగా ప్రభుత్వం ఇటివల కేవలం రూ.35 కోట్ల నిధులనే విడుదల చేయడంతో జిల్లాలో దరఖాస్తు చేసుకున్న ఎస్సీ విద్యార్థులలో కొద్ది మందికే ఫీజు రీయింబర్స్‌మెంట్ జమ అయినట్లు సమాచారం. ఇంకా వేల సంఖ్యలో విద్యార్థుల ఖాతాలో స్కాలర్‌షిప్ డబ్బులు పడలేదని తెలుస్తోంది. దీంతో తల్లిదండ్రులు ఉపకారవేతనాల కోసం జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి కార్యాలాయానికి క్యూ కడుతున్నట్లు సమాచారం. ఇంజినీరింగ్ కాలేజీ యాజమాన్యాలు డబ్బుల కోసం వేధిస్తున్నట్లు విద్యార్ధులు వాపోతున్నారు.
అధిక వాటా కేంద్రానిదే..
ఎస్సీ విద్యార్థుల ఉపకారవేతనాలు, ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకంలో కేంద్ర వాటా గతంలో 15 శాతం ఉండగా, రాష్ట్రం వాటా 85 శాతం ఉండేది. అయితే మూడేళ్ల నుంచి కేంద్రం నిధులను 60 శాతం ఇస్తోంది. అయితే కాలేజీ యాజమాన్యాలకు ఫీజులు ఇవ్వడాన్ని కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత శాఖ ఆక్షేపిస్తోంది. ఎస్సీ విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్ డబ్బులను నేరుగా విద్యార్థి ఖాతాకే ఇవ్వాలని తాజాగా ఆదేశించింది. రాష్ట్ర వాటా కంటే కేంద్రం వాటా ఎక్కువగా ఉన్నందున కేంద్రం నిబంధనలు అమలు చేయాలని రాష్ట్ర సర్కారుకు సూచించింది. అయితే విద్యార్థి ఖాతాకు ఫీజు విడుదల చేస్తే కాలేజీ యాజమన్యానికి చెల్లించడంలో జాప్యం జరుగుతుందని, అలాగే నిధుల విడుదలలో జాప్యం జరిగితే విద్యార్థి వ్యక్తిగతంగా చెల్లించాల్సి వస్తోంది. ఫీజుల విషయంలో కాలేజీలు కచ్చితత్వాన్ని పాటిస్తున్నాయి. దీనివల్ల చివరకు డ్రాపౌట్ల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అభిప్రాయం వ్యక్తం అవుతోంది.
యాజమాన్యాలు సంయమనం పాటించాలి..
- జీ.వినోద్ కుమార్, ఎస్సీ అభివృద్ది అధికారి, మేడ్చల్ జిల్లా
ఎస్సీ విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్ పట్ల కళాశాల యాజమాన్యాలు సంయమనం పాటించాలి. ప్రభుత్వం నుంచి డబ్బులు వారి ఖాతాల్లోకి ఇంకా రాలేదు. డబ్బులు వచ్చే విషయం కాలేజీ యాజమాన్యాలకు ముందుగానే తెలుస్తోంది. డబ్బులు వచ్చిన తర్వాత తీసుకోవాలి. అప్పటి వరకు విద్యార్థులపై ఒత్తిడి తీసుకురావద్దు.






