వరి సన్న విత్తనాలు కొనేందుకు ఆసక్తి చూపిన రైతులు

by Malleboina Mahesh |

ప్రభుత్వ సన్న వరి విత్తన మేళాలకు కరువైన స్పందన.. బోనస్ నిబంధనలపై రైతుల్లో గందరగోళం.. ప్రవేట్ సీడ్స్ వైపే అన్నదాతల మొగ్గు!

వరి సన్న విత్తనాలు కొనేందుకు ఆసక్తి చూపిన రైతులు
X

దిశ, తెలంగాణ బ్యూరో: వానాకాలంలో ఏడు రకాల సన్నాలు సాగు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం రైతు వేదికల్లో నిర్వహిస్తున్న విత్తనమేళాకు ఆశించిన ఆదరణ లభించడం లేదు. బహిరంగ మార్కెట్​లో ఉన్న ధరలే ఉండటంతో అన్నదాతలు విత్తనాల కొనుగోలుకు ఆసక్తి చూపడం లేదు. నగదు చేతిలో లేని రైతులంతా రైతువేదికల వైపు రావడం లేదు. పంట పండించిన తర్వాత చెల్లిస్తామని ప్రైవేట్ దుకాణాల్లో సీడ్స్ కొంటున్నారు. కాగా, ప్రభుత్వం అందుబాటులో ఉంచిన సన్నాలు అన్ని భూముల్లో ఆశించిన దిగుబడి రాదని కొందరు రైతులు పాత వడ్లతోనే నారు పోస్తున్నారు. నీరు పుష్కలంగా ఉన్న రైతులు 20 రోజుల క్రితమే వరి నారు పోశారు. వ్యవసాయ శాఖ ఇప్పడు పంపిణీ చేసే సన్నాలు నారు పోస్తే పంట డిసెంబర్​కోతకు వస్తుంది. ఈ ఏడు రకాల సాగుకు వెనకడుగు వేస్తున్నట్లు తెలుస్తోంది.

రైతులకు బోగస్ గుబులు!

విత్తన సంస్థ ధ్రువీకరించిన విత్తనాలను అందుబాటులోకి ఉంచామని వ్యవసాయ అధికారులు ప్రచారం చేసిన రైతులు పట్టించుకోవడం లేదు. మరోవైపు విపక్ష పార్టీ రైతు సంఘాలు సన్నాలకు బోనస్​ఎగనామం పెట్టేందుకు ప్రభుత్వం కుట్రలు చేస్తోందని నలుగురు రైతులు కూడితే ఇదే ప్రచారం చేస్తున్నారు. ఈనెల 30వ తేదీ వరకు రాష్ట్రంలోని 2,601 రైతు వేదికల్లో విత్తన మేళాలు జరుగుతున్నాయి. ఇందులో రైతులకు 1,24,649 క్వింటాళ్ల వరి విత్తనాలు, 6,913 క్వింటాళ్ల పప్పు జాతి విత్తనాలు, 11,815 క్వింటాళ్ల నూనెగింజల సీడ్స్, 1,339 క్వింటాళ్ల కూరగాయల విత్తనాలు అందుబాటులో ఉంచారు. అదనంగా నానో యూరియా, నానో డీఏపీ ఎరువులను కూడా రైతుల కొనుగోలుకు సిద్ధంగా ఉంచిన రైతులు అటు వైపు వెళ్లడం లేదు. మేళా ప్రారంభమైన నాలుగు రోజులు గడిచినా ఇప్పటి వరకు 50 వేల క్వింటాళ్లు అమ్మకం జరగలేదని తెలుస్తోంది. ప్రభుత్వం సబ్సిడీపై విత్తనాలు సరఫరా చేస్తే అన్నదాతలు ప్రైవేట్ వైపు అడుగు వేయరని వ్యవసాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

సీడ్స్ డీలర్ల తప్పుడు ప్రచారం

ప్రభుత్వం పంపిణీ చేసే సన్నాలు ఆశించిన దిగుబడి రావని సీడ్స్ డీలర్లు రైతులకు చెబుతున్నారు. ఒకవేళ సాగుచేసిన ఆరు నెలలు దాటిన తర్వాత పంట కోతకు వస్తుందని, ఇప్పటివరకు ధాన్యం కొనుగోలు మూతపడ్డాయని పేర్కొంటున్నారు. దీంతో రూ.500 బోనస్​రాదని, తమ వద్ద ఉన్న విత్తనాలు కొనుగోలు చేస్తే 120 రోజుల్లో కోతకు వస్తోందని ప్రభుత్వం కొనుగోలు చేయకపోయినా ప్రైవేట్ డిమాండ్​ ఉంటుందని చెబుతూ తమ వద్ద సన్నాలను డీలర్లు రైతులకు అంటగడుతున్నట్టు ప్రచారం జరుగుతున్నది. దీనిపై వ్యవసాయశాఖ స్పందించడం లేదు.

వాటిపైనే రైతుల మొగ్గు

రాష్ట్రంలో తక్కువ కాలంలో కోతకు వచ్చేవి, కలుపు ఇబ్బందులు లేని రకాలను సాగు చేయడానికి అన్నదాతలు ఆసక్తి చూపుతున్నారు. ప్రభుత్వం సూచించిన ఏడు రకాల్లో మొదటి రెండు రకాలు 130 నుంచి 140 రోజుల్లో కోతకు వస్తాయి. తర్వాత మూడు రకాలు 120 నుంచి 130 రోజులు పంట చేతికొస్తుంది. ఇతర రకాల సన్నాలు 120 రోజుల్లోపే కోత కోయవచ్చు. స్వల్పకాలంలో వచ్చే పంటల పట్ల రైతులు ఆస్తకి చూపుతున్నారు. వానాకాలం సాగుకు సిద్ధమై వరి విత్తనాలు కొనుగోలు బిజీగా ఉన్న రైతులకు వ్యవసాయ శాఖ చేస్తున్న ఏడు రకాల సన్నాలు వేయాలనే నిబంధనలతో సాగు ఆలస్యం కావొచ్చని అన్నదాతలు భావిస్తున్నారు.

మిగతా రకాలను వేస్తే బోనస్​కు ఎగనామం పెట్టేందుకు ప్రభుత్వం కుట్రలు చేస్తుందని ఆరోపిస్తున్నారు. సన్నాలు గుర్తించేందుకు ప్రభుత్వం కొన్ని నిబంధనలు పెట్టింది. బియ్యపు గింజ పొడవు, వెడల్పుల నిష్పత్తి నిర్దేశిత ప్రమాణాల మేరకు ఉంటే బోనస్​ఖాతాలో జమ చేయాలని భావిస్తోంది. గ్రెయిన్​కాలిపర్​అనే మిషన్​ద్వారా గింజ పొడవు, వెడల్పు కొలుస్తారు. గింజ పొడవు 6 మిల్లీమీటర్లు, వెడల్పు 2 మి.మీ. కంటే తక్కువగా ఉండాలి. పొడువు, వెడల్పుల నిష్పత్తి 2.5 ఎం ఎం కంటే ఎక్కువ ఉండే వాటిని ప్రాధాన్యమిస్తారు. ధాన్యం తేమ శాతం 17 కంటే తక్కువగా ఉండాలి.

Next Story