- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రైతాంగానికి ఆందోళన: జూన్ ముగిసినా బోసిపోయిన జలాశయాలు.
జూన్ ముగిసినా నిండని శ్రీశైలం, సాగర్, ఎస్సారెస్పీ జలాశయాలు.. జూలైలోనూ తక్కువ వర్షపాతమే అన్న ఐఎండీ.. ఖరీఫ్ సాగుపై తెలంగాణ రైతన్నల ఆందోళన!

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించి నెల రోజులు పూర్తయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా పలుచోట్ల అడపాదడపా వర్షాలు కురుస్తున్నాయి. మరికొన్ని చోట్ల ఆశించిన మేర వర్షాలు లేవు. రాష్ట్ర వ్యాప్తంగా చాలా వరకు మండలాల్లో లోటు వర్షపాతమే ఉన్నది. దాంతో రాష్ట్రంలోని ప్రధాన జలాశయాలు సైతం నీరు లేక బోసిపోయి కనిపిస్తున్నాయి. జూన్‌లోనే వర్షాలు ప్రారంభమై.. ఎగువ ప్రాంతాల నుంచి వరద వచ్చి అంతో ఇంతో ప్రాజెక్టులు జలకళను సంతరించుకోవడం చూస్తుంటాం. కానీ.. ఈసారి జూన్ ముగిసే నాటికీ శ్రీశైలం, నాగార్జునసాగర్, శ్రీరాంసాగర్, సింగూర్, నిజాంసాగర్ వంటి ప్రధాన ప్రాజెక్టుల్లో నిల్వలు ఆశించిన స్థాయికి చేరలేదు.
ప్రాజెక్టులకు నీరు వస్తున్నా.. భారీ వరద ప్రవాహాలు లేకపోవడంతో నిల్వలు కనిపించడం లేదు. అటు గ్రామాల్లో సైతం వర్షాలు లేకపోవడంతో చెరువులు, కుంటలు సైతం ఎండిపోయి కనిపిస్తున్నాయి. కొన్ని గ్రామాల్లో అయితే పూర్తిస్థాయిలో చెరువులు ఎండిపోవడంతో రైతులు ఆకాశానికేసి వర్షాల కోసం చూస్తున్నారు. గత ఏడాది ఈ సమయానికి అనుకున్న స్థాయిలో వర్షాలు పడడంతో జలాశయాల్లోకి నీరు వచ్చి చేరింది. ముఖ్యంగా కృష్ణా పరివాహక ప్రాంతం మాత్రం భారీ వర్షాలు, వరదలతో నిండిపోయింది. గోదావరి పరివాహకంలో మెల్లమెల్లగా వరదలు ఊపందుకున్నాయి.
ఎగువ నుంచి వచ్చే వరదే కీలకం..
జూన్ మాసంలోనే వర్షాలు కురియాల్సిఉన్నా.. భారీ వర్షాలు రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడా కనిపించలేదు. దీంతో వరద నీరు వచ్చిందీ లేదు. ఇలాంటి పరిస్థితుల్లో భారత వాతావరణ శాఖ (ఐఎండీ) విడుదల చేసిన తాజా అంచనాలు మరింత ఆందోళన కలిగిస్తున్నాయి. జూలై నెలలోనూ దేశవ్యాప్తంగా సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని ఐఎండీ స్పష్టం చేసింది. ఇప్పటికే జూన్ నెలలో దేశవ్యాప్తంగా గణనీయమైన వర్షపాతం లోటు నమోదైంది. ముఖ్యంగా మధ్య భారతదేశంలో 50 శాతానికి పైగా లోటు ఉండటం కృష్ణా, గోదావరి నదుల ఎగువ క్యాచ్మెంట్లపై ప్రత్యక్ష ప్రభావం చూపే అవకాశం ఉన్నదని నిపుణులు చెబుతున్నారు.
రాష్ట్రంలోని శ్రీశైలం, నాగార్జునసాగర్, జూరాల వంటి కృష్ణా బేసిన్ ప్రాజెక్టులకు కర్ణాటక, మహారాష్ట్రలోని క్యాచ్మెంట్ ప్రాంతాల్లో కురిసే వర్షాలే ప్రధాన ఆధారం. అలాగే.. శ్రీరాంసాగర్, ఎల్లంపల్లి వంటి గోదావరి ప్రాజెక్టులకు మహారాష్ట్రలో కురిసే వర్షాలే కీలకం. రాష్ట్రంలో స్థానికంగా కురిసే వర్షాలు చెరువులు, చిన్న రిజర్వాయర్లు నింపడానికి, భూగర్భ జలాలు పెరగడానికి ఉపయోగపడతాయి. కానీ.. భారీ జలాశయాల్లో నిల్వలు గణనీయంగా పెరగాలంటే ఎగువ రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున వరద ప్రవాహాలు రావాల్సిందే. ప్రస్తుతం ఆ పరిస్థితి కనిపించకపోవడంతో ప్రాజెక్టులకు ఇన్ ఫ్లో పరిమితంగానే ఉంది.
మహారాష్ట్ర, కర్ణాటకలోని ఎగువ క్యాచ్మెంట్ ప్రాంతాల్లో విస్తారంగా, నిరంతరాయంగా వర్షాలు లేకపోవడంతో నదుల్లో భారీ వరద ప్రవాహాలు కనిపించడం లేదు. ఖరీఫ్ సీజన్‌కు జూలై నెల అత్యంత కీలకమైనది. ఈ సమయంలోనే వరి, పత్తి, మొక్కజొన్న వంటి ప్రధాన పంటల సాగు వేగం అందుకుంటుంది. అయితే.. జూలైలోనూ ఆశించిన స్థాయిలో వర్షాలు కురవకపోతే ప్రధాన జలాశయాల్లో నీటి నిల్వలు పెరగకపోవచ్చు. ఫలితంగా సాగునీటి విడుదల పై ఒత్తిడి పెరిగి, ఆయకట్టు ప్రాంతాల్లో నీటి లభ్యతపై అనిశ్చితి ఏర్పడే అవకాశం ఉంది. అదే సమయంలో తాగునీరు, సాగునీరు, విద్యుత్ ఉత్పత్తి అవసరాల మధ్య ప్రభుత్వం సమతుల్యత పాటించడం మరింత సవాలుగా మారుతుంది. కాగా.. గతేడాది కృష్ణా బేసిన్ పరిధిలోని ప్రాజెక్టులు నిండిపోగా.. గోదావరి బేసిన్ లోని ప్రాజెక్టులు చెరువులు కొంత మేరకు నిండాయి. అయితే.. ఈ ఏడాది మాత్రం ఎల్‌నినో ప్రభావం, వర్షాభావం పరిస్థితుల వల్ల కృష్ణా, గోదావరిలో ఎక్కడ ప్రాజెక్టుల్లో నీరు కనిపించడం లేదు.






