రైతు పత్తికి సవాలక్ష కొర్రీలు..! దళారులు తెచ్చిన పంట గంటల్లోనే తూకం

by Kema Shiva Kumar |

పత్తి కొనుగోలు కేంద్రాలకు అన్నదాతలు పంటను తీసుకొస్తే సవాలక్ష కొర్రీలు పెడుతున్నారు.

రైతు పత్తికి సవాలక్ష కొర్రీలు..! దళారులు తెచ్చిన పంట గంటల్లోనే తూకం
X

దిశ, తెలంగాణ బ్యూరో: పత్తి కొనుగోలు కేంద్రాలకు అన్నదాతలు పంటను తీసుకొస్తే సవాలక్ష కొర్రీలు పెడుతున్నారు. అదే దళారులు తీసుకొచ్చే పత్తిని సీసీఐ కేంద్రాల సిబ్బంది ఆగమేఘాల మీద తూకం వేయడం పరిపాటిగా మారింది. వారు ఇచ్చే లంచాలకు అలవాటు పడి దళారుల పత్తి ఏవిధంగా ఉన్నా కాంటా వేసి త్వరగా ఇంటికి పంపుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. రైతులు ట్రాక్టర్లలో పత్తి బస్తాలు తీసుకొస్తే తడిగా ఉందని తేమశాతం రాదని, రంగు మారిందని ఇప్పడు తూకం వేయలేమని సమాధానం చెబుతూ రెండుమూడు రోజులు కేంద్రాల వద్ద పడిగాపులుకాసేలా చేస్తున్నారు. ఇదేమిటని రైతులు ప్రశ్నిస్తే పత్తిలో నాణ్యత లేదని, సీసీఐ నిబంధనల ప్రకారం తీసుకోవడానికి వీలులేదంటున్నారు. దళారులు తీసుకొస్తే గంట సేపు ఉండకుండా వెంటనే తూకం వేసి పంపించడంలో ఉన్న మతలబు ఏమిటని నిలదీస్తే దిక్కు ఉన్నచోట చెప్పుకోమని సిబ్బంది బెదిరింపులకు గురిచేస్తున్నట్లు తెలిసింది.

పట్టించుకునే వారేరీ?

పత్తి రైతులు తమ కష్టాలను స్థానిక నాయకులకు మొర పెట్టుకుందామని వెళ్తే వారంతా స్థానిక ఎన్నికల బిజీలో ఉంటున్నారు. తమను ప్రశ్నించే వారే లేరని జిన్నింగ్​మిల్లులు రైతులు తీసుకొచ్చే పత్తి తూకం వేసేందుకు అనేక నిబంధనలు పెడుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 327 జిన్నింగ్ మిల్లులు ప్రారంభించాలని ప్రభుత్వం ఆదేశిస్తే ఇప్పటివరకు 314 అందుబాటులోకి వచ్చాయి. ఇంకా 13 మిల్లులు ఓపెన్​చేయకుండా రేపుమాపంటూ నిర్లక్ష్యం చేస్తున్నట్లు మార్కెటింగ్​శాఖ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నది. ఒక పక్క సీసీఐ అడ్డగోలు నిబంధనలు, కేంద్రాల సిబ్బంది దోపిడీ కారణంగా అన్నదాతలకు మిగిలేది ఏమీలేదు. పండించిన పత్తి ఇంట్లో ఉంచుకోలేక వచ్చినకాడికి చాలు అన్నట్లు అమ్మకాలు చేసే దుస్థితి నెలకొంది.

పత్తి తూకంలో భారీ మోసాలు

సీసీఐ కొనుగోలు కేంద్రాల్లో పత్తి తూకాల్లో మోసాలు జరుగుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనిపై నల్లగొండ జిల్లాలో రైతులు ఆందోళన సైతం చేశారు. ఎలక్ట్రానిక్​కాంటాలు అందుబాటులోకి రావడంతో రిమోట్​కంట్రోల్‌తో పత్తి తక్కువ తూకం చూపించేలా చేస్తున్నారు. పత్తి బస్తా 110 కిలోలు ఉంటే 98 కిలోలు మాత్రమే ఉన్నట్లు మిషన్లలో చూపిస్తున్నారు. ఈ మోసాలపై తూనికలు, కొలతల శాఖ సిబ్బందికి తెలిపినా వారు మధ్యాహ్నం రైతులు భోజనానికి వెళ్లిన సమయంంలో కేంద్రాలకు వచ్చి తూతూమంత్రంగా తనిఖీలు చేస్తూ ఏమిలేదని చెబుతూ నిర్వాహకులతో కుమ్మకైనట్లు ఆరోపణలు ఉన్నాయి.

ఎకరాకు 12 క్వింటాళ్ల కొనుగోలు కొన్ని చోట్లనే..

ఎకరానికి 12 క్వింటాళ్ల చొప్పున పత్తిని సీసీఐ కొనుగోలు చేయాలని ప్రభుత్వం హెచ్చరించినా సగం కేంద్రాలు కూడా కొనుగోలు చేయడం లేదని తెలిసింది. వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల హెచ్చరించినప్పడు రెండు రోజుల పాటు హడావుడి చేసి తర్వాత ఎకరానికి 7 క్వింటాళ్లు మాత్రమే కొనుగోలు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. జిన్నింగ్​మిల్లుల నిర్వాహకులు తమకు సీసీఐ అధికారులు చెప్పిన విధంగా చేస్తామని, రాష్ట్ర ప్రభుత్వంతో పనిలేదని చెబుతున్నారు. అదే విధంగా కపాస్​కిసాన్​యాప్​కూడా ఉదయం పూట కంటే రాత్రి పూట అందుబాటులో ఉంటోందని తెలుస్తోంది. ఆ సమయంలో రైతులు ఆన్‌లైన్​నమోదు చేసుకునే వీలుండదని, దళారుల కోసమే ఇలా చేస్తున్నట్లు రైతులు ఆరోపిస్తున్నారు.

Next Story