ఎఫ్​పీఓలతో రైతుకు మేలు.. సీఎంవో సెక్రటరీతో రైతు కమిషన్ భేటీ

by Ramesh Naini |

ఎఫ్​పీఓలతో రైతుకు మేలు.. సీఎంవో సెక్రటరీతో రైతు కమిషన్ భేటీ
X

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో ఎఫ్​పీఓలను ఏర్పాటు చేస్తే రైతులకు ఎంతో మేలు కలుగుతుందని, ఇతర రాష్ట్రాల్లో బలంగా పనిచేస్తున్నాయని రైతు కమిషన్​ బృందం పేర్కొంది. బుధవారం సచివాలయంలోని సీఎంవో సెక్రటరీ శేషాద్రి తో రైతు కమిషన్ ఛైర్మన్ కోదండరెడ్డి, సభ్యులు సమావేశమయ్యారు. రైతు కమిషన్ ఇప్పటి వరకు ఇతర రాష్ట్రాల్లో చేసిన పర్యటనలు, అక్కడ అమలవుతున్న వ్యవసాయ, మార్కెటింగ్ విధానాలపై కమిషన్ తయారు చేసిన నివేదికలను అందించారు. ఈ సందర్భంగా వారు వివరిస్తూ, కేరళ, మహారాష్ట్ర, ఒడిశా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో రైతులు ఆర్థికంగా బలోపేతం కావడంలో ఎఫ్​పీఓలు కీలకంగా పని చేస్తున్నాయని వెల్లడించారు.

రైతు కమిషన్ కేరళ, మహారాష్ట్రలోని నాసిక్ లో పర్యటించిన సమయంలో ఎఫ్​పీఓల ప్రభావం స్పష్టంగా కనిపించిందని తెలిపారు. కేంద్రం కూడా ఎప్​పీఓల ఏర్పాటుకు సానుకూలంగా ఉన్న విషయం కూడా గుర్తు చేశారు. నాసిక్ లోని సహ్యాద్రి ఎఫ్​పీఓ దేశంలోనే ఆదర్శంగా పని చేస్తుందని వివరించారు. తెలంగాణలో కూడా ఎఫ్​పీఓల ఏర్పాటులో ప్రభుత్వం చొరవ తీసుకుంటే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. అదే విధంగా మార్కెటింగ్ వ్యవస్థ, కౌలు రైతు విధానాలపై కేరళ రాష్ట్రంలో అమలవుతున్న పాలసీలపై కమిషన్ రూపొందించిన నివేదిక అందించారు.

Next Story