- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పత్తి రైతుల సమస్యలను గవర్నర్ దృష్టికి తీసుకెళ్లిన రైతు కమిషన్..
రాష్ట్రంలో పత్తి రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ దృష్టికి రైతు కమిషన్ బృందం తీసుకెళ్లింది.

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో పత్తి రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ (Governor Jishnu Dev Verma) దృష్టికి రైతు కమిషన్ బృందం తీసుకెళ్లింది. సోమవారం రాజ్ భవన్ లో ఆయనతో రైతు కమిషన్ ఛైర్మన్ కోదండరెడ్డి, సభ్యులు కేవీఎన్ రెడ్డి, గోపాల్ రెడ్డి, రాములు నాయక్, భవాని రెడ్డి, భూమి సునీల్ సమావేశమయ్యారు. సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రాలను ఆలస్యంగా తెరవడంతో పాటు పత్తి అమ్ముకోవాలన్నా కేంద్రం కొత్తగా తీసుకొచ్చిన కపాస్ కిసాన్ యాప్‌లో నమోదు చేసుకోవాలని నిబంధన పెట్టడంతో అమాయక రైతులు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దానికి తోడు ఎకరాకు 7 క్వింటాళ్ల పత్తి మాత్రమే అనే నిబంధనను రైతుకు తలనొప్పిగా మారిందని కమిషన్ వివరించింది.
ఈసారి రాష్ట్రంలో 48 లక్షల ఎకరాల్లో పత్తి సాగు జరిగిందని, అధిక వర్షాలు, మొంథా తుఫాను వల్ల పత్తి రైతులు తీవ్ర నష్టపోయారు. తుఫాన్ ను ఎదుర్కొని సాగుచేసిన పత్తి రైతుకు సీసీఐ నిబంధనలు ఆందోళనకు గురి చేసిందని కమిషన్ ఛైర్మన్ కోదండరెడ్డి తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా రైతుల నుండి కమిషన్ కార్యాలయానికి ఫిర్యాదులు వస్తున్నాయని రైతుల విన్నపాన్ని కమిషన్ బృందం తమరి దృష్టికి తీసుకొస్తున్నట్లు పేర్కొన్నారు. ఇటీవల కేంద్రం విడుదల చేసిన విత్తన చట్టం ముసాయిదా -2025 పై అభ్యంతరాలు ఉన్నాయని, ఇప్పటికే రాష్ట్ర రైతాంగం, రైతు సంఘాల నేతలు కేంద్ర విత్తన చట్టం ముసాయిదాపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నట్లు చెప్పారు. పత్తి రైతుల విషయంలో కమిషన్ ఇచ్చిన వినతికి గవర్నర్ సానుకూలంగా స్పందించి సీసీఐ విషయంలో కేంద్రంతో మాట్లాడతానని హామీ ఇచ్చారు.






