తిప్పర్తి రహదారిపై బైఠాయించిన రైతులు.. అద్దంకి-నార్కట్‌పల్లి హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్

by Kema Shiva Kumar |   (  Updated:2026-02-11 09:20:40  IST  )

నల్లగొండ జిల్లా తిప్పర్తి మండల కేంద్రంలో ఇవాళ మధ్యాహ్నం ఉద్రిక్తత చోటుచేసుకుంది.

తిప్పర్తి రహదారిపై బైఠాయించిన రైతులు.. అద్దంకి-నార్కట్‌పల్లి హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్
X

దిశ, వెబ్‌డెస్క్: నల్లగొండ (Nalgonda) జిల్లా తిప్పర్తి (Thipparthi) మండల కేంద్రంలో ఇవాళ మధ్యాహ్నం ఉద్రిక్తత చోటుచేసుకుంది. సాగుకు కీలకమైన యూరియా (Urea) సకాలంలో అందడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తూ రైతులు అద్దంకి-నార్కట్‌పల్లి (Addanki- Narkatpally) రహదారిపై బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. యాప్‌తో తిప్పలు.. తీరని కొరత ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన యూరియా పంపిణీ యాప్‌లో సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయని, దీనివల్ల తమకు సకాలంలో ఎరువులు అందడం లేదని రైతులు ఆరోపించారు. వరి నాట్లు వేసిన సమయంలో యూరియా వేయడం అత్యవసరమని, అధికారులు నిర్లక్ష్యం వహిస్తే పంటలు దెబ్బతినే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. యాప్‌లో గంటల తరబడి ప్రయత్నించినా ఫలితం ఉండటం లేదని, ఉన్నతాధికారులు స్పందించి పాత పద్ధతిలోనే యూరియా పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు.

రైతుల మెరుపు ఆందోళనతో అద్దంకి-నార్కట్‌పల్లి రహదారిపై సుమారు 3 గంటల పాటు వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. కిలోమీటర్ల మేర వాహనాలు బారులు తీరడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు యుద్ధ ప్రాతిపదికన ఘటనా స్థలానికి చేరుకుని రైతులకు నచ్చజెప్పారు. యూరియా సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి, సత్వరమే పంపిణీ జరిగేలా చూస్తామని పోలీసులు స్థానిక అధికారులు రైతులకు హామీ ఇచ్చారు. దీంతో అన్నదాతలు ఆందోళనను విరమించి రహదారిపై నుంచి పక్కకు తప్పుకోగా.. అనంతరం పోలీసులు ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు.

Next Story