ఇంటర్ అడ్మిషన్ల గడువు పొడిగింపు

by Ajay Maddhiboyina |

విద్యా సంవత్సరం 2025-26 కు సంబంధించి ఇంటర్ మొదటి సంవత్సరం అడ్మిషన్ల గడువును ఆగస్టు 20 వరకు తెలంగాణ బోర్డ్ ఆఫ్

ఇంటర్ అడ్మిషన్ల గడువు పొడిగింపు
X

దిశ, తెలంగాణ బ్యూరో: విద్యా సంవత్సరం 2025-26 కు సంబంధించి ఇంటర్ మొదటి సంవత్సరం అడ్మిషన్ల గడువును ఆగస్టు 20 వరకు తెలంగాణ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ (టీజీబీఐఈ) పొడిగించింది. ఇటీవల విడుదలైన పదవ తరగతి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ ఫలితాలను పరిగణనలోకి తీసుకుని, విద్యార్థుల ప్రయోజనార్థం ఈ నిర్ణయం తీసుకున్నట్లు బోర్డు ప్రకటించింది. ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్, ప్రైవేటు అన్‌ఎయిడెడ్, రాష్ట్రంలోని అన్ని రెసిడెన్షియల్, మోడల్ స్కూల్, కేజీబీవీ, ఇన్సెంటివ్ జూనియర్ కాలేజీలు, రెండేళ్ల ఇంటర్ కోర్సు అందిస్తున్న కాంపోజిట్ డిగ్రీ కాలేజీలకు ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది.

అడ్మిషన్ల కోసం చివరి తేదీని ఆగస్టు 20 వరకు పొడిగించినట్లు బోర్డు ఒక ప్రకటనలో తెలిపింది. అన్ని కాలేజీల ప్రిన్సిపాళ్లు పొడిగించిన గడువులోగా ఫస్టియర్ ఇంటర్ విద్యార్థులను చేర్చుకోవాలని, అర్హులైన విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించే అవకాశాన్ని కోల్పోకుండా చూడాలని ఇంటర్ బోర్డు సూచించింది. కాగా, తల్లిదండ్రులు, విద్యార్థులు అఫిలియేటెడ్ జూనియర్ కాలేజీల్లో మాత్రమే అడ్మిషన్లు తీసుకోవాలని బోర్డు స్పష్టం చేసింది. అఫిలియేటెడ్ కళాశాలల జాబితా టీజీబీఐఈ అధికారిక వెబ్‌సైట్‌లైన acadtgbie.cgg.gov.in,tgbie.cgg.gov.in లలో అందుబాటులో ఉందని పేర్కొంది.

Next Story