- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్

దిశ, తెలంగాణ బ్యూరో: పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు సంబంధించి బీఆర్ఎస్ వేసిన అనర్హత పిటిషన్లపై స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు? అన్నింటినీ కొట్టేస్తారా? విచారణకు హాజరు కాని దానం నాగేందర్ సభ్యత్వాన్ని రద్దు చేస్తారా? అసలు సుప్రీం కోర్టు ఇచ్చిన గడువులోగా తన నిర్ణయాన్ని ప్రకటిస్తారా? లేకపోతే మరింత సమయం తీసుకుంటారా? అనే అంశాలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి. గత నెలలో అన్హరత పిటిషన్ల కేసును విచారించిన సుప్రీం కోర్టు.. నెల రోజుల్లో నిర్ణయాన్ని ప్రకటించాలని స్పీకర్ ను ఆదేశించింది. ఈ గడువు డిసెంబర్ 18తో ముగియనుండగా.. ఈ లోగా స్పీకర్ లాంటి నిర్ణయం ప్రకటిస్తారోనని ఉత్కంఠ నెలకొన్నది.
బీఆర్ఎస్‌లో టెన్షన్
పార్టీ మారిన పది మంది ఎమ్మెల్యేలపై అన్హరత వేటు వేయాలని బీఆర్ఎస్ ఇచ్చిన పిటిషన్లపై స్పీకర్ విచారణ కొనసాగిస్తున్నారు. ఇప్పటివరకు ఇరుపక్షాల వాదనలు స్వయంగా విన్నారు. అయితే సుప్రీం కోర్టు విధించిన గడువులోపు స్పీకర్ తన నిర్ణయాన్ని ప్రకటిస్తారో లేదోననే టెన్షన్ లో బీఆర్ఎస్ నేతలు ఉన్నారు. సుప్రీం ఇచ్చిన గడువులోపు గతంలో స్పీకర్ తన నిర్ణయాన్ని ప్రకటించకపోవడంతో కోర్టు ధిక్కారణ కేసును వేశారు. దీంతో గతనెల 18న విచారణ చేపట్టిన కోర్టు.. నెల రోజుల్లో నిర్ణయాన్ని ప్రకటించాలని సూచించింది. అయితే గడువులోపు స్పీకర్ తన నిర్ణయాన్ని ప్రకటిస్తారా? ఒకవేళ తీర్పును ప్రకటించకపోతే ఏం చేయాలి? మళ్లీ సుప్రీం కోర్టుకు వెళ్లాలా? అనే టెన్షన్ లో బీఆర్ఎస్ పార్టీ ఉన్నది.
మరికొంత టైం అడగనున్న స్పీకర్?
ఈ నెల 19న అన్హరత పిటిషన్లపై విచారణ చేపడుతామని గత నెలలో జరిగిన విచారణ సందర్భంగా సుప్రీం కోర్టు ప్రకటించింది. అయితే ఎమ్మెల్యే కడియం శ్రీహరి తన వాదనలు వినిపించేందుకు మరికొంత సమయం కావాలని స్పీకరుకు అప్పీలు చేయగా, ఆయన అందుకు అంగీకరించారు. ఇదే విషయాన్ని స్పీకర్ కార్యాలయం సుప్రీం కోర్టుకు వివరించే అవకాశం ఉందని లీగల్ ఎక్స్ పర్ట్స్ అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే విచారణకు 8 మంది ఎమ్మెల్యేలు హాజరయ్యారని, మరో ఎమ్మెల్యే సమయం కోరారని విషయాన్ని సుప్రీం కోర్టుకు అఫడవిట్ వేసి, సమయం కోరే చాన్స్ ఉందని వివరించారు. అందుకు సుప్రీం అంగీకరిస్తే.. అన్హరత పిటిషన్ల విచారణ ప్రక్రియ మరికొంత కాలంపాటు కొనసాగుతుందని, లేకపోతే స్పీకర్ తన నిర్ణయాన్ని ప్రకటిస్తారనే చర్చ రాజకీయ వర్గాల్లో ఉన్నది.
రాజీనామాకు దానం రెడీ!
అన్హరత పిటిషన్లపై స్పీకర్ తన నిర్ణయాన్ని ప్రకటించడానికి ముందే ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ తన శాసన సభ్యత్వానికి రాజీనామా చేయనున్నట్లు తెలుస్తున్నది. బీఆర్ఎస్ టికెట్ పై ఎమ్మెల్యేగా గెలిచిన దానం నాగేందర్.. ఆ తర్వాత పార్టీ ఫిరాయించి, కాంగ్రెస్ బీ ఫామ్ పై ఎంపీగా పోటీ చేశారు. అలాగే పలు కాంగ్రెస్ పార్టీ ప్రొగ్రామ్స్ లో సైతం పాల్గొన్నారు. దీంతో ఆయన సభ్వత్వాన్ని స్పీకర్ రద్దు చేసే అకాశముందనే చర్చ జరుగుతున్నది. అందుకని స్పీకర్ తన నిర్ణయాన్ని ప్రకటించడం కంటే ముందే రాజీనామా చేస్తే హుందాగా ఉంటుందనే సంకేతాలు దానంకు పార్టీ అధిష్టానం నుంచి వచ్చినట్లు తెలిసింది. అందులో భాగంగానే ఆయన కొన్ని రోజులుగా కాంగ్రెస్ ఫ్లెక్సీలను పెద్ద ఎత్తున నియోజకవర్గంలో కట్టి, ఉప ఎన్నికలకు రెడీ అవుతున్నట్లు టాక్ ఉంది.






