నాటుసారా, గంజాయి, అక్రమ మద్యంపై ఉక్కుపాదం

by Ajay Maddhiboyina |

రాష్ట్రంలో నాటుసారా, గంజాయి, సింథటిక్ డ్రగ్స్‌తో పాటు ఇతర రాష్ట్రాల నుంచి అక్రమంగా వస్తున్న నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ కట్టడికి తెలంగాణ ఎక్సైజ్ శాఖ ఉక్కుపాదం మోపుతోంది.

నాటుసారా, గంజాయి, అక్రమ మద్యంపై ఉక్కుపాదం
X

దిశ,తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో నాటుసారా, గంజాయి, సింథటిక్ డ్రగ్స్‌తో పాటు ఇతర రాష్ట్రాల నుంచి అక్రమంగా వస్తున్న నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ కట్టడికి తెలంగాణ ఎక్సైజ్ శాఖ ఉక్కుపాదం మోపుతోంది. కట్టడి చేయాలన్న ప్రభుత్వ ఆదేశాలతో ఎక్సైజ్ శాఖ, స్పెషల్ టాస్క్ ఫోర్స్, డ్రగ్ టాస్క్ ఫోర్స్ , డ్రగ్ కంట్రోల్ అథారిటీ విభాగాలు దాడులు నిర్వహిస్తున్నాయి.

1,218 కేసులు, 4,643 లీటర్ల నాటుసారా స్వాధీనం ..

పల్లెలు, తండాలను పట్టి పీడిస్తున్న నాటుసారా తయారీ, రవాణాలపై అధికారులు ప్రధానంగా దృష్టి సారించి రాష్ట్రంలో ఉమ్మడి మహబూబ్‌నగర్, ఆదిలాబాద్, వరంగల్, నల్లగొండ జిల్లాల్లోని కొన్ని మారుమూల తండాల్లో ఇంకా తయారీ సాగుతోందని గుర్తించి నిఘా తీవ్రతరం చేశారు. ఎన్‌ఫోర్స్‌మెంట్‌ జాయింట్ డైరెక్టర్ అంజన్‌రావు పర్యవేక్షణలో గత 20 రోజుల్లోనే నాటుసారా తయారీదారులు, విక్రేతలపై ఏకంగా 1,218 కేసులు నమోదు చేశారు. దాడుల్లో 4,643 లీటర్ల నాటుసారాను స్వాధీనం చేసుకోగా, తయారీకి సిద్ధంగా ఉంచిన 69,220 లీటర్ల బెల్లం పానకాన్ని ధ్వంసం చేశారు. అలాగే 45,994 కిలోల బెల్లాన్ని సీజ్ చేసి అక్రమార్కుల నడ్డి విరిచారు.

15 ఫార్మా, కెమికల్ కంపెనీల్లో తనిఖీలు..

సింథటిక్ డ్రగ్స్, కల్తీ కల్లు తయారీకి వినియోగించే ఆల్ప్రజోలామ్, ఫెంటనిల్, మెఫెడ్రోన్ లాంటి ప్రమాదకర రసాయనాలపై డీసీఏ, ఎస్టీఎఫ్ అధికారులు ఉమ్మడిగా ఫోకస్ పెట్టారు. డీసీఏ డ్రగ్ ఇన్స్‌పెక్టర్లు, ఎస్టీఎఫ్ అధికారులు కలిసి రాష్ట్రంలోని సుమారు 15 ఫార్మా, కెమికల్ కంపెనీల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. డ్రగ్స్ తయారీకి ఆస్కారం ఉన్న రసాయనాల నిల్వలు, వినియోగం, విక్రయాలపై ఆరా తీశారు. అధికారుల ఆకస్మిక తనిఖీలు ఫార్మా, పరిశ్రమ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. మరోవైపు, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో నిబంధనలు ఉల్లంఘిస్తున్న బార్లపైనా అధికారులు కొరడా ఝుళిపించారు. ఈ నెల 12వ తేదీ నుంచి ఎస్టీఎఫ్ బృందాలు ఏకంగా 47 బార్లలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించాయి.

నిబంధనలు అతిక్రమించినట్లు గుర్తించిన యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులకు నివేదికలు సమర్పించాయి. ఇతర రాష్ట్రల నుండి రాష్ట్రంలోకి అక్రమంగా చొరబడుతున్న ఎన్డీపీఎల్, డిఫెన్స్ లిక్కర్, మిక్సింగ్ లిక్కర్ల కట్టడికి ఎస్టీఎఫ్, డీటీఎఫ్ బృందాలు సరిహద్దులు, చెక్‌పోస్టుల వద్ద నిఘా పెంచాయి. ఇటీవలి దాడుల్లో 556 లీటర్ల అక్రమ మద్యాన్ని పట్టుకున్నారు. అలాగే 244 కిలోల గంజాయితో పాటు, ఎండీఎంఏ డ్రగ్స్‌ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అక్రమాలకు తావులేకుండా చేయాలన్న ప్రభుత్వ కఠిన ఆదేశాలతో మత్తు పదార్థాలపై రాజీలేని పోరాటం చేస్తామని, రానున్న రోజుల్లో ఈ దాడులు మరింత ఉద్ధృతంగా కొనసాగుతాయని ఎక్సైజ్, రెవెన్యూ శాఖల ముఖ్య కార్యదర్శి రఘునందన్ రావు, ఎక్సైజ్ కమిషనర్ సి.హరికిరణ్, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్‌ అవినాశ్ మహంతి స్పష్టం చేశారు..

Next Story