రాష్ట్రపతికి బిల్లు పంపి ఆమోదించమని అడిగారా? : మాజీ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్

by Naga Rani Yarlagadda |

రాష్ట్రపతికి బిల్లు పంపి ఒక్కసారైనా ఆమోదించమని కలిసి అడిగారా? ఆర్డినెన్స్ పంపే ముందు న్యాయ కోవిదులు, బీసీ నాయకుల సలహాలు తీసుకున్నారా? అని మాజీమంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్ ప్రశ్నించారు.

రాష్ట్రపతికి బిల్లు పంపి ఆమోదించమని అడిగారా? : మాజీ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్
X
  • పెండింగులో ఉండగా గవర్నర్‌కు ఆర్డినెన్స్ ఎలా పంపిస్తారు?
  • బీసీలకు కీలక శాఖలు ఇవ్వాలి
  • మాజీమంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రపతికి బిల్లు పంపి ఒక్కసారైనా ఆమోదించమని కలిసి అడిగారా? ఆర్డినెన్స్ పంపే ముందు న్యాయ కోవిదులు, బీసీ నాయకుల సలహాలు తీసుకున్నారా? అని మాజీమంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్ ప్రశ్నించారు. బుధవారం తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. న్యాయకోవిదుల అభిప్రాయాలకు వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్‌ను గవర్నర్‌కు పంపడం దురదృష్టకరమన్నారు. 2015 డిసెంబర్‌లో కేసీఆర్ హయాంలో తెచ్చిన ఆర్డినెన్స్‌కు సవరణ చేస్తూ మరో ఆర్డినెన్స్‌ను గవర్నర్‌కు పంపారని తెలిపారు. అసెంబ్లీలో పాస్ చేసిన బిల్లును గవర్నర్ ద్వారా రాష్ట్రపతికి పంపారని.. బిల్లు పెండింగ్‌లో ఉండగానే గవర్నర్ దగ్గరకు అదే అంశంపై ఆర్డినెన్స్ పంపారని.. కేసీఆర్ ఆర్డినెన్స్ తెస్తే హైకోర్టు, సుప్రీంకోర్టులు కొట్టేశాయని తెలిపారు.

స్వప్న రెడ్డి అనే కాంగ్రెస్ నాయకురాలు కేసీఆర్ ఆర్డినెన్స్‌పై కోర్టుకెళ్లారని, కళ్ల ముందు ఈ అనుభవం ఉండగా ఆర్డినెన్స్ ఎలా పంపిస్తారని ప్రశ్నించారు. తమిళనాడు తరహాలో తొమ్మిదో షెడ్యూల్‌లో రిజర్వేషన్లను చేర్చడం తప్ప మరో మార్గం లేదన్నారు. బీసీలపై చిత్తశుద్ధి ఉంటే పశుసంవర్ధక శాఖ మంత్రి శ్రీహరికి రెవెన్యూ శాఖ ఇవ్వాలని.. బీసీలకు మంత్రి పదవులు ఇవ్వడంతోపాటు కీలక శాఖలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఎంపీ వద్దిరాజు రవి చంద్ర మాట్లాడుతూ.. బీసీపీఎఫ్ ఆధ్వర్యంలో జరిగిన మహా ధర్నా విజయవంతం అయ్యిందన్నారు. ఓ వైపు ధర్నా జరుగుతుండగానే గవర్నర్‌కు ఆర్డినెన్స్ పంపడం బాధాకరమని అన్నారు. బీసీల ఓట్లు వేయించుకొని మోసం చేసిన కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం తప్పదని హెచ్చరించారు. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యు పుట్ట మధు, నేతలు నందికంటి శ్రీధర్, కె.కిషోర్‌గౌడ్ పాల్గొన్నారు.

Next Story