వరంగల్ డిక్లరేషన్లో ఇచ్చిన ఒక్కహామీనైనా అమలు చేశారా?: హరీష్ రావు

by Naga Rani Yarlagadda |   (  Updated:2025-11-18 08:32:07  IST  )

వరంగల్ డిక్లరేషన్ లో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన ఒక్కహామీనైనా నెరవేర్చిందా?

వరంగల్ డిక్లరేషన్లో ఇచ్చిన ఒక్కహామీనైనా అమలు చేశారా?: హరీష్ రావు
X

దిశ, వెబ్‌డెస్క్: వరంగల్ డిక్లరేషన్ లో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన ఒక్కహామీనైనా నెరవేర్చిందా? అని బీఆర్ఎస్ మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు ప్రశ్నించారు. మంగళవారం వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ ని సందర్శించిన అనంతరం.. ఆయన పత్తిరైతులతో మాట్లాడి ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ.. రాష్ట్రంలో రైతుల పరిస్థితి అధ్వాన్నంగా తయారైందన్నారు. కాంగ్రెస్ పాలనలో కరెంటు నుంచి కాంటా వరకూ అన్నీ సమస్యలేనని విమర్శించారు. సమయానికి ఎరువులు అందవు, కరెంట్ సరిగ్గా రాదు, రైతుబంధు లేదు, రుణమాఫీ చేయరు, బోనస్ పంటల బీమా ఊసు మొత్తానికే లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికైనా మేలుకోకపోతే.. తెల్ల బంగారాన్ని తీసుకొచ్చి జూబ్లీహిల్స్ ప్యాలెస్ ముందు పోస్తామని హెచ్చరించారు.

ఇప్పటివరకూ 60 సార్లు ఢిల్లీకి వెళ్లిన సీఎంకు పత్తి రైతుల పరిస్థితిపై కేంద్రానికి విన్నవించే అవకాశం రాలేదా ? అని ప్రశ్నించారు. ఉపఎన్నికలో గెలిచేందుకు విచ్చలవిడిగా డబ్బు పంచిన రేవంత్ రెడ్డి.. రైతులకు కనీస మద్దతుధర అందించలేకపోతున్నారని దుయ్యబట్టారు. L1, L2, L3 విధానం, కపాస్ యాప్ లో 8-12 శాతం తేమ ఉండాలన్న నిర్ణయాలని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గిట్టుబాటు ధరలపై పత్తిరైతులకు అరచేతిలో వైకుంఠం చూపించి.. చేతల్లో నరకం చూపిస్తున్నాయని విమర్శించారు. గత సంవత్సరం మాదిరిగానే 12 క్వింటాల పత్తిని కొని, రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.

Next Story