పారిశుధ్య నిర్వహణలో పంచాయతీ రాజ్ ఫెయిల్: మాజీ మంత్రి హరీశ్‌రావు

by Ajay Maddhiboyina |   (  Updated:2025-07-23 17:03:50  IST  )

పారిశుధ్య నిర్వహణలో పంచాయతీరాజ్ డిపార్ట్‌మెంట్ ఫెయిల్ అయిందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు విమర్శించారు.

పారిశుధ్య నిర్వహణలో పంచాయతీ రాజ్ ఫెయిల్: మాజీ మంత్రి హరీశ్‌రావు
X

దిశ, తెలంగాణ బ్యూరో: పారిశుధ్య నిర్వహణలో పంచాయతీరాజ్ డిపార్ట్‌మెంట్ ఫెయిల్ అయిందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు విమర్శించారు. డయేరియాతో ఊరు ఊరంతా మంచం పట్టడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం దేమికలాన్ గ్రామం మొత్తం డయేరియా బారిన పడి ఒక్కొక్కరిగా ప్రాణాలు కోల్పోతుంటే ప్రభుత్వం ఏం చేస్తున్నదని ప్రశ్నించారు. కలుషిత నీరు తాగి తండ్రి, కొడుకులు మృతిచెందడం అత్యంత బాధాకరమని పేర్కొన్నారు. శుభ్రమైన తాగునీటి సరఫరాలో రూరల్ వాటర్ సప్లై డిపార్ట్‌మెంట్ ఫెయిల్ అయిందని తెలిపారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో నష్టనివారణ చర్యలు చేపట్టడంలో రెవెన్యూ డిపార్ట్‌మెంట్ ఫెయిల్ అయిందని.. మొత్తంగా పల్లెలు, గ్రామాల ప్రజలకు సురక్షితమైన నీరు, పరిశుభ్రమైన వాతావరణం కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందని తెలిపారు. దేమికలాన్ గ్రామంలో మెడికల్ ఎమర్జెన్సీ ప్రకటించి, వెంటనే మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేసి ప్రజల ప్రాణాలు కాపాడాలని డిమాండ్ చేశారు.

ఉద్యోగాలు అడిగినందుకు గ్రంథాలయాల్లో నిషేధాజ్ఞలు

లైబ్రరీలలో నిషేధాజ్ఞలతో కూడిన బోర్డులు ఏర్పాటు చేయడంపై హరీశ్‌రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్ని వర్గాలపై ఆంక్షలు విధించడం కాంగ్రెస్ ప్రభుత్వానికి నిత్యకృత్యంగా మారిందని పేర్కొన్నారు. మొన్న యూనివర్సిటీల్లో ఆందోళనలు నిషేధిస్తూ మెమో ఇచ్చారని.. తాజాగా లైబ్రరీల్లో విద్యార్థులపై ఆంక్షలు విధించారని ఆరోపించారు. ప్రజాస్వామ్య పాలన అనే ఏడో గ్యారెంటీని మరిచి ఎమర్జెన్సీ రోజులను తిరిగి తెస్తున్నారని పేర్కొన్నారు. గ్రంథాలయాలను రాజకీయ వేదికలుగా మార్చిన దుర్మార్గ చరిత్ర కాంగ్రెస్ పార్టీదని తెలిపారు. ఇప్పుడు సుద్దపూస మాటలు, నీతులతో బోర్డులు పెట్టినంత మాత్రాన పాపపరిహారం కాదు రేవంత్‌రెడ్డి అని విమర్శించారు.

ఎన్నికల సమయంలో కాంగ్రెస్ రాజకీయం అంతా లైబ్రరీల చుట్టే జరిగిందని.. రాహుల్‌గాంధీని సైతం లైబ్రరీకి తీసుకువచ్చి బూటకపు హామీలు ఇచ్చిన సంగతి మరిచిపోయారా? అని ప్రశ్నించారు. గ్రంథాలయాల్లో పోలీసు లాఠీచార్జీలు జరిపించిన అరాచక చరిత్ర కాంగ్రెస్ ప్రభుత్వానిదని గుర్తుచేశారు. జాబ్ క్యాలెండర్ ఏమైందని విద్యార్థులు నిలదీసినందుకు, నిషేధాజ్ఞలు ఏర్పాటు చేస్తారా? అని ప్రశ్నించారు. ఒక్క విద్యార్థులే కాదని.. యావత్ తెలంగాణ హామీలపై నిలదీస్తున్నదని.. మొత్తం తెలంగాణ సమాజం మీద నిషేధాజ్ఞలు విధిస్తారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. 20 నెలల్లో 12వేల ఉద్యోగాలు కూడా ఇవ్వకుండా 60వేల ఉద్యోగాలు ఇచ్చినట్లు తప్పుడు ప్రచారం చేస్తున్నారని పేర్కొన్నారు. నెలల తరబడి విద్యార్థులు, నిరుద్యోగులు నోటిఫికేషన్ల కోసం ఎదురుచూస్తుంటే సీఎం మాత్రం ఢిల్లీకి చక్కర్లు కొడుతూ కాలం వెళ్లదీస్తున్నారని తెలిపారు. ఆంక్షలు, నిషేధాలతో నిరుద్యోగుల హృదయాల్లో రగులుతున్న నిరసన జ్వాలలను చల్లార్చలేరని హెచ్చరించారు. ఇప్పటికైనా రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి వెంటనే నోటిఫికేషన్లు విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

Next Story