మాజీ సీఎం కేసీఆర్, సీఎం రేవంత్ రెడ్డి మధ్య లోపాయికారి ఒప్పందం: కేంద్ర మంత్రి బండి

by Malleboina Mahesh |   (  Updated:2025-12-25 07:58:24  IST  )

తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి మధ్య లోపాయికారి ఒప్పందాలు సాగుతున్నాయంటూ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ సంచలన ఆరోపణలు చేశారు.

మాజీ సీఎం కేసీఆర్, సీఎం రేవంత్ రెడ్డి మధ్య లోపాయికారి ఒప్పందం: కేంద్ర మంత్రి బండి
X

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ రాజకీయాల్లో కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ మరోసారి నిప్పులు చెరిగారు. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి మధ్య లోపాయికారి ఒప్పందాలు సాగుతున్నాయంటూ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ సంచలన ఆరోపణలు చేశారు. గురువారం మీడియా ప్రతినిధులతో నిర్వహించిన చిట్ చాట్‌లో ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్‌పై రేవంత్ రెడ్డి ఉపయోగిస్తున్న భాష ఏమాత్రం సరైంది కాదని, వీరిద్దరి మధ్య కుదిరిన రహస్య ఒప్పందంలో భాగంగానే కావాలనే కేసీఆర్‌పై సానుభూతి కలిగేలా రేవంత్ మాట్లాడుతున్నారా? అని బండి సంజయ్ అనుమానం వ్యక్తం చేశారు. కేసీఆర్ కంటే పెద్ద శని తెలంగాణకు ఎవరూ ఉండరని, కేటీఆర్‌కు అధికార పోయినా అహంకారం మాత్రం తగ్గలేదని బండి సంజయ్ ఎద్దేవా చేశారు.

అలాగే కాంగ్రెస్ ప్రభుత్వంపై, ముఖ్యంగా మంత్రుల పనితీరుపై తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్ర కేబినెట్‌లోని ఇద్దరు, ముగ్గురు మంత్రులు చట్టంలోని లొసుగులను ఆసరాగా చేసుకుని వేల కోట్ల రూపాయల అక్రమాలకు పాల్పడుతున్నారని, వారి అక్రమాలపై ఇప్పటికే ఇంటెలిజెన్స్ ద్వారా నివేదికలు తెప్పించుకుంటున్నామని సంచలన ఆరోపణలు చేశారు. త్వరలోనే మంత్రుల భాగోతాన్ని బయటపెడతామని, కాంగ్రెస్ అవినీతిపై బీజేపీ సమరశంఖం పూరిస్తుందని హెచ్చరించారు. రేవంత్ రెడ్డి పాలన కూడా గత కేసీఆర్ బాటలోనే సాగుతోందని, జీవోలను పబ్లిక్ డొమైన్‌లో పెట్టకుండా పారదర్శకతను కాలరాస్తున్నారని దుయ్యబట్టారు.

కేసీఆర్ కుటుంబంపై ధ్వజం

కృష్ణా జలాల విషయంలో తెలంగాణకు జరిగిన అన్యాయానికి ముమ్మాటికీ కేసీఆరే కారణమని బండి సంజయ్ స్పష్టం చేశారు. "తెలంగాణకు రావాల్సిన 575 టీఎంసీల వాటాను కాదని, కేవలం 299 టీఎంసీలకే అంగీకరించిన కేసీఆర్ రాష్ట్ర ద్రోహి" అని విమర్శించారు. నాటి అపెక్స్ కమిటీ సమావేశంలో జగన్మోహన్ రెడ్డి సమక్షంలో జరిగిన ఒప్పందాలను బయటపెట్టేందుకు తాము సిద్ధమన్నారు. తెలంగాణకు పట్టిన 'శని' కేసీఆర్ కుటుంబమేనని, ఆ కుటుంబం తప్ప రాష్ట్రంలో ఇంకెవరూ బాగుపడలేదని ఆరోపించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ కుటుంబ ప్రమేయం స్పష్టంగా ఉందని, 6 వేల మంది ఫోన్లను ట్యాప్ చేసి ఎందరో జీవితాలను నాశనం చేశారని, తాము అధికారంలోకి వస్తే బాధ్యులందరినీ కచ్చితంగా జైలుకు పంపుతామని పునరుద్ఘాటించారు.

జీహెచ్‌ఎంసీ ఎన్నికలు - మజ్లిస్ ముక్త్ భాగ్యనగర్

రాబోయే జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగానే పోటీ చేసి మేయర్ పీఠాన్ని దక్కించుకుంటుందని బండి సంజయ్ ధీమా వ్యక్తం చేశారు. భాగ్యనగరాన్ని మజ్లిస్ పార్టీకి దారదత్తం చేయడానికి కాంగ్రెస్ ప్లాన్ చేస్తోందని, "మజ్లిస్ ముక్త్ భాగ్యనగర్" (మజ్లిస్ లేని హైదరాబాద్) తమ లక్ష్యమని ప్రకటించారు. కేంద్రం నుండి గ్రామ పంచాయతీలకు రూ. 3,005 కోట్లు వస్తున్నాయని, అయితే రాష్ట్ర ప్రభుత్వం ఒక్కో పంచాయతీకి రూ. 5 లక్షలు ఇస్తామని చెప్పడం బిచ్చమేసినట్లు ఉందని ఎద్దేవా చేశారు. సగటున ఒక్కో పంచాయతీకి కోటి రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఖైరతాబాద్ ఉప ఎన్నిక కోసం తాము ఎదురుచూస్తున్నామని, బీజేపీ కార్యకర్తలు కసితో ఉన్నారని ఈ సందర్భంగా కేంద్ర మంత్రి బండి సంజయ్ పేర్కొన్నారు.

Read More..

రేవంత్ రెడ్డిని ప్ర‌జ‌లే మూసీలో ప‌డేస్తారు.. మాజీ మంత్రి జ‌గ‌దీష్ రెడ్డి ఫైర్

Next Story