- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
హై అలర్ట్.. నిమజ్జనానికి సర్వం సన్నద్ధం.. గ్రేటర్ పరిధిలో 303 కిలోమీటర్ల శోభాయాత్ర.. జీహెచ్ఎంసీ కీలక విజ్ఞప్తి
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో శనివరాం జరిగే గణేష్ నిమజ్జన కార్యక్రమం సురక్షితంగా, ఎకో ఫ్రెండ్లీ విధానంలో సాఫీగా జరిగేలా జీహెచ్ఎంసీ ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి పూర్తి సన్నద్ధంగా ఉంది.

దిశ, సిటీ బ్యూరో: గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో శనివరాం జరిగే గణేష్ నిమజ్జన కార్యక్రమం (Ganesh immersion ceremony) సురక్షితంగా, ఎకో ఫ్రెండ్లీ విధానంలో సాఫీగా జరిగేలా జీహెచ్ఎంసీ ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి పూర్తి సన్నద్ధంగా ఉంది. నిమజ్జనం ముగిసే వరకూ జీహెచ్ఎంసీ, పోలీస్, సమన్వయ శాఖలు హై అలెర్ట్ గా ఉండనున్నాయి. ఆధ్యాత్మిక వాతావరణంలో భక్తి శ్రద్ధలతో నిమజ్జనం ప్రశాంత వాతావరణంలో జరిగేలా చూసేందుకు పోలీస్, రెవెన్యూ, ఎలక్ట్రిసిటీ, హెచ్ఎండీఏ, జలమండలి, ట్రాఫిక్ పోలీస్ , ఆర్ అండ్ బీ, హైడ్రా, వైద్య ఆరోగ్య, పర్యాటక, సమాచార శాఖ లను సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగుతుంది.
చంద్ర గ్రహణంతో..
గ్రేటర్ హైదరాబాద్ లో వినాయక చవితి ప్రారంభం నుంచి 11 రోజుల తర్వాత నిమజ్జనం చేయడం ఆనవాయితీగా వస్తోంది. అయితే 11 రోజు పూర్తి కాకపోవడంతో తర్వాత రెండు రోజుల పాటు కూడా నిమజ్జనం కొనసాగుతూనే ఉంటుంది. అయితే ఈ సారి ఆదివారం చంద్ర గ్రహణం ఉండడంతో శనివారం అర్థరాత్రి వరకు నిమజ్జనం పూర్తి చేసేందుకు మండపాల నిర్వహాకులు సన్నాహాలు చేస్తున్నారు. ఒక ఆదివారం నిమజ్జనం కొనసాగిన 10 గంటలలోపే పూర్తిచేసే విధంగా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అధికారులు సైతం శనివారమే పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటున్నారు. అయితే ఖైరతాబాద్ మహాగణపతి బాహుబలి క్రేన్ పాయింట్ 4 వద్దే నిమజ్జనం చేయనున్నారు.
424 క్రేన్లు ఏర్పాటు
గ్రేటర్ హైదరాబాద్ నగరంలో 20 ప్రధాన లేక్ లతోపాటు జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన 72 కృత్రిమ కొలనులలో నిమజ్జనం కోసం ఏర్పాట్లు చేశారు. దీనివల్ల ట్రాఫిక్ ఇబ్బందులు దూరం అవ్వడంతో పాటు భక్తులకు సౌలభ్యంగా ఉంటుంది. ప్రధాన జల వనరులపై ఒత్తిడి తగ్గనుంది. 134 స్టాటిక్ క్రేన్లు, 259 మొబైల్ క్రేన్లు ఒక బాహుబలి క్రేన్, 10 పెద్ద క్రేన్లు సహా హుస్సేన్ సాగర్ చుట్టూ మొత్తం 20 క్రేన్‌లు ఏర్పాటు చేశారు. ఫలితంగా కీలకమైన ఈ హుస్సేన్ సాగర్‌లో నిమజ్జనం వేగంగా, స్మూత్ గా జరగనుంది. బాహుబలి క్రేన్ నెంబర్ 4 ద్వారా ఖైరతాబాద్ మహా గణేష్ విగ్రహం నిమజ్జనం చేయనున్నారు.
సురక్షిత నిమజ్జనానికి ప్రాధాన్యత
నిమజ్జన పాయింట్ ల వద్ద అవాంఛనీయ ఘటనలు జరగకుండా హైడ్రా, పర్యాటక శాఖ సమన్వయంతో హుస్సేన్ సాగర్ లో 9 బోట్లను, డీఆర్ఎఫ్ టీమ్‌లను, 200 గత ఈతగాళ్లను సిద్ధంగా ఉంచారు. పోలీసుల సహకారంతో 13 కంట్రోల్ రూమ్ లో ఏర్పాటు చేశారు.
303 కిలోమీటర్ల మార్గం శోభాయాత్ర
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 303.3 కిలోమీటర్ల మేర ప్రధాన ఊరేగింపు మార్గంలో గణేష్ విగ్రహాల నిమజ్జన శోభాయాత్ర సజావుగా జరిగేందుకు 160 గణేష్ యాక్షన్ టీంలను జీహెచ్ఎంసీ డిప్లాయ్ చేసింది. ఇప్పటికే ఈ మార్గంలో జీహెచ్ఎంసీ రోడ్ల మరమ్మతులు పూర్తి చేసింది. శోభాయాత్రకు అనువుగా ఎలక్ట్రిసిటీ, కేబుల్ వైర్ లను సరి చేసింది. చెట్ల కొమ్మలు తొలగించింది.
స్వచ్ఛతకు పెద్దపీట
నిమజ్జన కార్యక్రమంలో స్వచ్ఛతకు పెద్దపీట వేసేలా 15 వేల మంది శానిటేషన్ వర్కర్స్ ను మూడు షిఫ్టుల్లో పని చేస్తున్నారు.వినాయక చవితి ప్రారంభం ఇప్పటి వరకూ 125 జీసీబీ లు, 102 మినీ టిప్పర్ లు ఉపయోగించి 10,500 మెట్రిక్ టన్నుల కు పైగా అధిక వ్యర్థాలను సేకరించి జవహర్ నగర్లోని ప్రాసెసింగ్ సెంటర్ కు తరలించారు. గణేష్ ప్రతిమల నిమజ్జనం జరిగే ప్రదేశాలలో 39 మొబైల్ టాయిలెట్స్ ఏర్పాటు చేశారు.
విద్యుత్ జిగేల్
నిమజ్జనం జరిగే ప్రదేశాలతో పాటు ఊరేగింపు జరిగే మార్గంలో మొత్తం 56,187 టెంపరరీ లైటింగ్ ను జీహెచ్ఎంసీ ఏర్పాటు చేసింది. నిమజ్జనం పూర్తి అయ్యే వరకూ నూరు శాతం లైట్ లు పని చేసేలా అధికారులు మానిటర్ చేస్తున్నారు. నిమజ్జన పాయింట్‌లలో మూడు షిఫ్టులలో పని చేసేలా అంబులెన్స్ లతో సహా 7 మెడికల్ క్యాంపులను సిద్ధంగా ఉంచారు.
సకాలంలో గణేష్ ప్రతిమలను నిమజ్జనానికి తరలించాలి : కమిషనర్ కర్ణన్
గణేష్ నిమజ్జనం సజావుగా , సాఫీగా జరిగేలా చూస్తున్నామని కమిషనర్ ఆర్వీ.కర్ణన్ తెలిపారు. సకాలంలో గణేష్ ప్రతిమలను నిమజ్జనానికి తరలించాల్సిందిగా కమిషనర్ నిర్వాహకులకు ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. గణేష్ ప్రతిమల ఊరేగింపు జరిగే మార్గాలలో నిర్దేశించిన గార్బేజ్ పాయింట్లు లోనే చెత్తను వేయాలని ప్రజలను, భక్తులను కమిషనర్ కోరారు. కలర్ పేపర్ ముక్కలు ఊరేగింపులో ఎగురవేయవద్దని భక్తులు, ప్రజలకు విజ్ఞప్తి చేశారు. వీటిని తొలగించడం కష్టతరమని, ప్రయాణికుల కళ్లల్లో పడతాయని , పర్యావరణానికి హాని చేస్తాయని చెప్పారు.






