ఆగస్టు 5 నుండి ప్రారంభం కానున్న ఎప్ సెట్ తుదివిడత కౌన్సెలింగ్

by Muthe.Rajitha |

రాష్ట్రంలో ఎప్ సెట్ కౌన్సెలింగ్ మూడు విడతల్లో జరగనుంది.

ఆగస్టు 5 నుండి ప్రారంభం కానున్న ఎప్ సెట్ తుదివిడత కౌన్సెలింగ్
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో ఎప్ సెట్ కౌన్సెలింగ్ మూడు విడతల్లో జరగనుంది. రెండో విడత కౌన్సెలింగ్ లో బీటెక్ సీట్లు పొంది ఇప్పటికే ఫీజు చెల్లించిన వారు, సీట్లను రద్దు చేసుకోవడానికి గడువు శనివారంతో ముగిసింది. రెండు విడతల్లో కలిపి 83,521 మంది విద్యార్థులు సీట్లు పొందారు. అందులో ఎక్కువగా సీఎస్ఈ అనుబంధ కోర్సుల వైపే మొగ్గు చూపారు. మొత్తం కేటాయింపుల్లో 95.42 శాతం సీట్లు సీఎస్ఈ లో ఉన్నాయి. అయితే ఉన్నత విద్యా మండలి, అన్ని యూనివర్శిటీల వీసీలు, ప్రొఫెసర్లు, ఇండస్ట్రీ నిపుణులు, అకడమిక్ నిపుణులు జూన్ లో కోర్ సబ్జెక్టులపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించినప్పటికీ ఆ కోర్సుల్లో ఊహించినంతగా విద్యార్థులు ఆసక్తి చూపలేదు. ఆగస్టు 5 నుంచి మూడో విడత కౌన్సెలింగ్ ప్రారంభం కానుంది.

6 న, స‌ర్టిఫికెట్ వెరిఫికేష‌న్, ఆగస్టు 10 న సీట్ల కేటాయింపు జరగనుంది. బ్రాంచ్ లేదా కాలేజ్ మార్పు కోసం రిపోర్ట్ చేసేందుకు ఆగస్టు 13 వ‌ర‌కు అవకాశం కల్పించనున్నారు. ఇంటర్నల్ స్లైడింగ్ ఆగస్టు 18న ప్రారంభమై, ఆగస్టు 22 న సీట్ల కేటాయింపుతో ముగియనుంది. రాష్ట్రంలో కొత్తగా ప్రభుత్వ ఇంజనీరింగ్ కాలేజీ మంజూరైంది. నిజామాబాద్ లోని తెలంగాణ యూనివర్శిటీకి అనుబంధంగా దీన్ని ఏర్పాటు చేశారు. ఈ కాలేజీలో కొత్తగా నాలుగు కంప్యూటర్ సైన్స్ కోర్సులకు అనుమతులు ఇచ్చారు. ఒక్కో కోర్సులో 60 సీట్లు మంజూరు కాగా, రెండో విడత కౌన్సెలింగ్ ముగిసిన నేపథ్యంలో తుది విడత కౌన్సెలింగ్ ద్వారా ఈ కాలేజీల్లో అడ్మిషన్ల ప్రక్రియ చేపట్టనున్నారు.

Next Story