అంటువ్యాధులు కాని సమస్యల్లో హార్మోన్ల లోపాలే ప్రధానం

by Naga Rani Yarlagadda |

ఏటా పెరుగుతున్న నాన్-కమ్యూనికబుల్ డిసీజెస్‌లో (అంటువ్యాధులు కానివి) ఎండోక్రైన్ సంబంధిత వ్యాధులు ప్రధాన భాగాన్ని ఆక్రమిస్తున్నాయని తెలంగాణ ఎండోక్రైన్ సొసైటీ అధ్యక్షులు డా. బిపిన్ సేథి తెలిపారు.

అంటువ్యాధులు కాని సమస్యల్లో హార్మోన్ల లోపాలే ప్రధానం
X
  • తెలంగాణ ఎండోక్రైన్ సొసైటీ అధ్యక్షులు డా. బిపిన్ సేథి
  • తెలంగాణ ఎండోక్రైన్ సొసైటీ 7వ వార్షిక సదస్సు విజయవంతం

దిశ, తెలంగాణ బ్యూరో: ఏటా పెరుగుతున్న నాన్-కమ్యూనికబుల్ డిసీజెస్‌లో (అంటువ్యాధులు కానివి) ఎండోక్రైన్ సంబంధిత వ్యాధులు ప్రధాన భాగాన్ని ఆక్రమిస్తున్నాయని తెలంగాణ ఎండోక్రైన్ సొసైటీ అధ్యక్షులు డా. బిపిన్ సేథి తెలిపారు. ప్రారంభ దశలోనే వ్యాధి లక్షణాలను గుర్తించి చికిత్స అందిస్తే రోగుల జీవన ప్రమాణాలు, ఆయుర్దాయం గణనీయంగా పెరుగుతాయన్నారు. హైదరాబాద్‌లో రెండు రోజుల పాటు నిర్వహించిన తెలంగాణ ఎండోక్రైన్ సొసైటీ 7వ వార్షిక సదస్సు ఆదివారం విజయవంతంగా ముగిసింది. రాష్ట్రం నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో ఎండోక్రైనాలజిస్టులు, సీనియర్ వైద్యులు, పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థులు హాజరై సదస్సును దిగ్విజయం చేశారు. కార్యక్రమంలో మధుమేహం, ఊబకాయం, థైరాయిడ్, ఇతర హార్మోన్ల సంబంధిత వ్యాధుల నిర్ధారణ, చికిత్సా విధానాల్లో వస్తున్న విప్లవాత్మక మార్పులు, తాజా పరిశోధనలపై రంగాలవారీ నిపుణులు సమగ్రంగా చర్చించారు. మారుతున్న వైద్య పురోగతులకు అనుగుణంగా వైద్యులు తమ పరిజ్ఞానాన్ని నవీకరించుకోవడం ద్వారా రోగులకు ప్రారంభ దశలోనే ఖచ్చితమైన చికిత్స అందించి, మెరుగైన ఆరోగ్య ఫలితాలు సాధించవచ్చని ఆందోళన వ్యక్తం చేశారు. సమాజంలో ఈ వ్యాధులపై ఇంకా ఆశించినంత అవగాహన లేదని, ఏటా నిర్వహించే ఇటువంటి వార్షిక సదస్సుల ద్వారా ఆ లోటును పూడ్చేందుకు కృషి చేస్తున్నామని డా. సేథి వివరించారు. నేటి కాలంలో డయాబెటిస్, ఊబకాయం, థైరాయిడ్, జీవక్రియ సంబంధిత సమస్యలు సమాజంలో వేగంగా విస్తరిస్తున్నాయని సదస్సు నిర్వహణ కార్యదర్శి, నిమ్స్ వైద్యురాలు డా. బియాట్రిస్ ఆన్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో వైద్యులకు నిరంతర వైద్య విద్య (సీఎంఈ) ఎంతో అవసరమన్నారు. శాస్త్రీయ ఆధారాలతో కూడిన తాజా సమాచారాన్ని వైద్యులకు అందించడం ద్వారా రాష్ట్ర ప్రజలకు సకాలంలో నాణ్యమైన, ప్రామాణికమైన వైద్య సేవలు అందుతాయని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఆరోగ్య సేవలను మరింత బలోపేతం చేసేందుకు తెలంగాణ ఎండోక్రైన్ సొసైటీ నిరంతరం కృషి చేస్తుందని పునరుద్ఘాటించారు.

Next Story